కంప్యూటర్‌ సైన్స్‌లో పెరిగాయ్‌.. | Seats available in private engineering colleges | Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ సైన్స్‌లో పెరిగాయ్‌..

Published Fri, Jul 7 2023 2:53 AM | Last Updated on Fri, Jul 7 2023 2:53 AM

Seats available in private engineering colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీ లలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు సంబంధించిన సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తి మేరకు పెద్దగా డిమాండ్‌ లేని బ్రాంచీల నుంచి ఇతర బ్రాంచీలకు 7,635 సీట్లను మార్చగా.. అద నంగా 6,930 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వరకు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలకు సంబంధించిన సీట్లేకావడం గమనార్హం.

మొత్తంగా డిమాండ్‌ ఉన్న బ్రాంచీలకు సంబంధించి ఈసారి (2023–24) కొత్తగా 14,565 ఇంజనీరింగ్‌ సీట్లను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో చేర్చుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సీట్లలో దాదాపు 10,195 సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. ఇలా ఇంజనీరింగ్‌లో సీట్ల పెంపుతో రూ.27.39 కోట్ల మేర అదనంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

విద్యార్థుల నుంచి డిమాండ్‌ లేని బ్రాంచీలు, సీట్లు రద్దు చేసుకుని.. ఆ మేర డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో పెంచుకోవడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఇటీవల అనుమతించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. సుమారు 50కిపైగా కాలేజీలు సీఎస్‌సీ, ఇతర కంప్యూటర్‌ కోర్సుల్లో భారీగా సీట్లు పెంచుకున్నాయి.

మొత్తం 1.15 లక్షలకు చేరిన సీట్లు..
రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో 66,112 సీట్లను అందుబాటులో పెట్టారు. తాజాగా పెరిగిన సీట్లను కూడా చేరిస్తే ఈ సంఖ్య 80,677 సీట్లకు పెరుగుతోంది. యాజమాన్య కోటా సీట్లనూ కలిపితే రాష్ట్రంలో 1.15 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌తోపాటు మరికొన్ని కంప్యూటర్‌ కోర్సుల్లో గత సంవత్సరం 41,506 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి 56 వేల వరకూ చేరనున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌తోపాటు ఇతర బ్రాంచీల్లో గత ఏడాది 29,780 సీట్లు ఉండగా.. ఈసారి 22,145 సీట్లకు తగ్గిపోనున్నాయి.

ఎంసెట్‌ షెడ్యూల్‌లో మార్పు
ఇప్పటికే ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ చివరి దశకు చేరకుంది. ఈ నెల 12న సీట్ల కేటా యింపు జరగాల్సి ఉంది. కొత్త సీట్లకు అనుమతి ఇవ్వడంతో.. వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఎంసెట్‌ షెడ్యూల్‌లో మార్పులు చేశారు.

దీని ప్రకారం ఈ నెల 8 వరకూ అభ్యర్థులు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. 9న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 12 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 16న సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. రెండో దశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 24 నుంచి మొదలవుతుంది.

పెంపు మంచి నిర్ణయం..
ఇంజనీరింగ్‌ సీట్ల పెంపు నిర్ణయం ఆహ్వాని ంచదగ్గ పరిణామం. దీనివల్ల అదనంగా 10వేల మందికిపైగా సీట్లు పొందే అవ కాశం వస్తుంది. డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో చేరాలనుకునే వారికి ఇది ప్రయోజనకరం. – ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌

ఫ్యాకల్టీకి ఉద్యోగ భద్రత కల్పించాలి
సంప్రదాయ బ్రాంచీల్లో సీట్లు తగ్గించడం వల్ల కొన్ని సెక్షన్లు రద్దవు తాయి. ఈ కారణంగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అధ్యాపకులను తొలగించే ప్రమాదం ఉంది. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. అవసరమైతే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మిగతా బ్రాంచీల్లో బోధించే నైపుణ్యం కల్పించాలి.    – వి.బాలకృష్ణ, సాంకేతిక,  వృత్తి విద్యా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement