సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు తక్కువగా ఉన్న, విద్యార్థులు లేని ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసేందుకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా 11 ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయాలని నిర్ణయించాయి. 2018–19 విద్యా సంవత్సరంలో తమకు అనుబంధ గుర్తింపు అవసరం లేదని, తమ కాలేజీలు మూసివేసుకుంటామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని జేఎన్టీయూహెచ్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు యాజమాన్యాల నుంచి జేఎన్టీయూహెచ్ ఇటీవల దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా 266 ఇంజనీరింగ్ (బీటెక్) కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, 11 కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు, ఫ్యాకల్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు జేఎన్టీయూహెచ్ సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) తనిఖీల్లో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే కాలేజీలకు, సీట్లకు అనుబంధ గుర్తింపు జారీ చేయనుంది. ఈసారి కొత్త కోర్సులను ఇచ్చేది లేదని ఏఐసీటీఈతోపాటు జేఎన్టీయూహెచ్ కూడా చెబుతుండటం, గడిచిన మూడేళ్లలో 25 శాతం లోపే ప్రవేశాలు ఉన్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు సీట్ల సంఖ్య భారీగా తగ్గనుంది.
బ్రాంచీల రద్దుకు మరిన్ని కాలేజీలు..
8 ఇంజనీరింగ్ కాలేజీలు 11 రకాల బీటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. డిమాండ్ లేని కోర్సులను మూసి వేసుకుంటామని వెల్లడించాయి. దీంతో భారీ గా సీట్లు రద్దు కానున్నాయి. అలాగే 28 ఎంటెక్ కాలేజీల్లోనూ 77 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. గతంలో 15 వేల వరకు ఎంటెక్‌లో సీట్లు ఉండగా గతేడాది వాటిని జేఎన్‌టీయూహెచ్ 5,400కు పరిమితం చేసింది. ఈసారి 77 బ్రాంచీల రద్దుతో ఎంటెక్ సీట్ల సంఖ్య 3 వేల లోపే ఉండే అవకాశం ఉంది. మరోవైపు 4 ఫార్మసీ కాలేజీలు 7 బ్రాం చీలను, ఒక ఎంబీఏ కాలేజీ ఒక బ్రాంచీని, 3 ఎంసీఏ కాలేజీలు 3 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి.
25 శాతం లోపు ప్రవేశాలు..
జేఎన్టీయూహెచ్ పరిధిలో 266 ఇంజనీరింగ్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో వరుసగా మూడేళ్లపాటు 25 శాతంలోపే ప్రవేశాలు ఉన్న కాలేజీలు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. 30 శాతం ప్రవేశాలు ఉన్న కాలేజీలను కొనసాగించడం సాధ్యం కాదని, వాటిని మూసివేయాలని ఏఐసీటీఈ నిర్ణయం తీసుకోగా, 25 శాతం లోపు ప్రవేశాలు ఉన్న కాలేజీలను మూసివేయాలని జేఎన్టీయూహెచ్ ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అలాంటి కాలేజీలు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది.
11 ఇంజనీరింగ్ కాలేజీల మూసివేత!
Published Tue, Feb 27 2018 2:08 AM | Last Updated on Tue, Feb 27 2018 2:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment