విద్యార్థులపై ‘క్రెడిట్స్’ పిడుగు! | JNTU students protest on varsity | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై ‘క్రెడిట్స్’ పిడుగు!

Published Wed, Sep 23 2015 12:59 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

విద్యార్థులపై ‘క్రెడిట్స్’ పిడుగు! - Sakshi

విద్యార్థులపై ‘క్రెడిట్స్’ పిడుగు!

సాక్షి, హైదరాబాద్: సంస్కరణల పేరిట జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూహెచ్) అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. చివరి సంవత్సరంలోకి అడుగుపెట్టి మూణ్ణెళ్లు గడిచాక .. ఉన్నపళంగా ప్రమోషన్ క్రెడిట్స్‌ను పెంచడమే దీనికి కారణం. దీంతో తృతీయ సంవత్సరంతోనే విద్యార్థుల చదువు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారుల తీరుపై భగ్గుమంటున్న విద్యార్థులు మంగళవారం వర్సిటీలో నిరసనకు దిగారు.

అధిక సంఖ్యలో విద్యార్థులను డీటెండ్ చేయడం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని తగ్గించుకునే కుట్రలకు పాలకులు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. జేఎన్టీయూహెచ్ ఇన్‌చార్జ్ వీసీ, రిజిస్ట్రార్‌లు అందుబాటులో లేకపోవడంతో డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్ ఆంజనేయప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
 
అధికారుల అస్తవ్యస్త నిర్ణయాలు..
ఉత్తమ బోధన.. నాణ్యమైన ఫలితాల పేరిట జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఇటీవల కొన్ని సంస్కరణలు తెచ్చారు. అయితే ఇవి ఇప్పుడు విద్యార్థులకు శాపంగా మారాయి. గతంలో ఒక విద్యార్థి చివరి సంవత్సరంలోకి అడుగుపెట్టాలంటే.. 3.1 సెమిస్టర్ వరకు సదరు విద్యార్థికి 125 క్రెడిట్స్‌కుగానూ.. 50 క్రెడిట్స్ రావాలి. 3.2 సెమిస్టర్ వరకు 150కి 62 క్రెడిట్స్ సాధించాలి. ఇలా క్రెడిట్స్ పొందితేనే పైతరగతులకు ప్రమోట్ చేస్తారు. అయితే ఈ ఏడాది నుంచి ప్రమోషన్ క్రెడిట్స్ మొత్తాన్ని అధికారులు అకస్మాత్తుగా పెంచారు.

3.1 సెమిస్టర్ వరకు 62 క్రెడిట్స్ పొందితేనే చివరి సంవత్సరంలోకి అనుమతిస్తామని, తక్కువ క్రెడిట్స్ ఉన్న వారిని డిటెన్షన్ చేస్తామని, 3.2 సెమిస్టర్ గ్రేడ్స్‌ని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. క్రెడిట్స్ పెంపు, డిటెన్షన్  విషయాలను తృతీయ సంవత్సరం ఫలితాలు వెల్లడించిన సమయంలోనే విద్యార్థులకు చెప్పాలి. కాని అధికారులు మొన్నటి వరకు గోప్యత పాటించారు.

ఇది తెలియని విద్యార్థులు 3 నెలలపాటు చివరి సంవత్సరం తరగతులకు హాజరయ్యారు. చాలామంది బోధన ఫీజులు చెల్లించి.. వేల రూపాయలు ఖర్చు చేసి పుస్తకాలు, స్టడీ, ప్రాజెక్ట్ మెటీరియల్ కొనుగోలు చేశారు. మరోవైపు 4.1 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో క్రెడిట్స్ పెంపు, డిటెన్షన్ విధానాన్ని అధికారులు ప్రకటించడం గమనార్హం.

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులు డిటెన్షన్‌కు గురికానున్నారు. ఫలితంగా తృతీయ సంవత్సరంతోనే వారి చదువులు ఆగిపోనున్నాయి. వర్సిటీలో ఏదైనా కొత్త విధానాన్ని అవలంబించేటప్పుడు మొదటి సంవత్సరం నుంచే వర్తింపజేయాల్సి ఉంటుంది. ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు నూతన విధానాల నుంచి మినహాయింపు ఇస్తారు. అయితే మరో ఏడాదిలో ఇంజనీరింగ్ పూర్తయ్యే విద్యార్థులకు ఇప్పుడు మినహాయింపు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ యాదయ్యను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
 
కొత్త నిబంధనలు వద్దు..
పదేళ్లుగా అనుసరిస్తున్న నిబంధనలను మార్చి 3.1లో 62 క్రెడిట్స్‌ను తీసుకువచ్చి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కెరీర్‌పై దృష్టి సారించిన సమయంలో వారి జీవితాలతో ఆడుకోవద్దు.
 - గూడురు అజిత్‌రెడ్డి, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి
 
విద్యార్థుల గోడు పట్టించుకోరా..
డిటెన్షన్‌పై కళాశాలకు వెళ్తే జేఎన్టీయూహెచ్‌కు వెళ్లమని, జేఎన్టీయూహెచ్‌కు వస్తే కళాశాలలో తేల్చుకోమని చెబుతూ తప్పించుకుంటున్నారు. పది జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఒకే కౌంటర్‌ను కేటాయించడం దుర్మార్గం.
 - భానుప్రకాష్‌రెడ్డి, వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement