ఫెయిల్.. ఆబ్సెంట్.. కాదు పాస్! | Re Counting, Re Valuation to 16 thousand people apply | Sakshi
Sakshi News home page

ఫెయిల్.. ఆబ్సెంట్.. కాదు పాస్!

Published Sat, Aug 27 2016 12:57 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

ఫెయిల్.. ఆబ్సెంట్.. కాదు పాస్! - Sakshi

ఫెయిల్.. ఆబ్సెంట్.. కాదు పాస్!

జేఎన్టీయూహెచ్‌లో బీటెక్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల పరిస్థితి ఇదీ..
ఏప్రిల్‌లో రాసిన పరీక్షల ఫలితాల కోసం 600 మంది ఎదురుచూపు
కొందరి ఫలితాలు వెల్లడించినా.. అందులోనూ గందరగోళమే..
రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోసం 16 వేల మంది దరఖాస్తు
ఆ ఫలితాలు వెల్లడించకుండానే సప్లిమెంటరీ

సాక్షి, హైదరాబాద్: నయీఫ్ అనే విద్యార్థి బీటెక్ ఫస్టియర్ పరీక్షలు రాస్తే ఫలితాల్లో ఇంగ్లిష్ పరీక్షకు హాజరు కాలేదని (ఆబ్సెంట్) వచ్చింది. దీంతో ఆలస్య రుసుము రూ.5,000 చెల్లించి సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకున్నాడు. హాల్‌టికెట్ తీసుకొని పరీక్ష కేంద్రానికి వెళ్తే.. ఫెయిల్ అయిన వారి లిస్టులో నీ పేరు లేదు ‘నువ్వు పాసయ్యావు’ వెళ్లొచ్చని చెప్పారు.. ఇదీ జేఎన్టీయూహెచ్‌లో బీటెక్ విద్యార్థుల పరిస్థితి!
 
ఇలాంటి విచిత్రాలు జేఎన్టీయూహెచ్‌లో రోజుకోరకంగా చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు ఫెయిలైతే సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవడం సహజం. కానీ కొంతమంది బీటెక్ ఫస్టియర్ విద్యార్థులు ఏప్రిల్‌లో రాసిన పరీక్షల ఫలితాలను ఇప్పటికీ విడుదల చేయని జేఎన్టీయూహెచ్.. శుక్రవారం నుంచి అఫిలియేటెడ్ కాలేజీల్లో అదే బీటెక్ ఫస్టియర్ సప్లిమెం టరీ పరీక్షలు నిర్వహిస్తోంది. వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. మరోవైపు వెల్లడించిన ఫలితాలపై సందేహాలున్న సుమా రు 16 వేల మంది విద్యార్థులు రీ కౌంటింగ్/రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, రిజల్ట్ రాకుండానే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చివరి నిమిషం వరకు రీ వాల్యుయేషన్ ఫలితాల కోసం ఎదు రుచూసిన విద్యార్థులు, తీరా అవి ఇప్పట్లో రావని తెలిసి, సప్లిమెంటరీ పరీక్షలకు హాజర య్యారు. మరోవైపు గురువారం కొంతమంది విద్యార్థుల ఫలితాలను వర్సిటీ విడుదల చేసిం ది. విద్యార్థులు ఆ ఫలితాలను చూసుకుని అవాక్కయ్యారు. ఫలితాల్లో ఆబ్సెంట్ అని ఉండటం తో తలపట్టుకుంటున్నారు. రిజల్ట్‌లో ఫెయిల్ అని ఉండగా, సప్లిమెంటరీ పరీక్ష రాద్దామని వెళ్తే పాస్ అని చెప్పారని కొంతమంది వాపోతున్నారు. ప్రతిష్టాత్మక వర్సిటీలో, పరీక్షల వ్యవస్థ గందరగోళంగా మారడం శోచనీయమని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు.
 
600 మందికి ఎదురుచూపులే
నాణ్యతా ప్రమాణాలు లేని కారణంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు 2015-16 విద్యా సంవత్సరానికి జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆయా కళాశాలల్లో అప్పటికే ఫస్టియర్ బీటెక్ చదువుతున్న సుమారు 800 మంది విద్యార్థులకు వారు కోరుకున్న కాలేజీల్లో ప్రవేశం కల్పించింది. ఆపై మరో వారం రోజుల్లో ఫస్టియర్ పరీక్షలు ఉండటంతో తాత్కాలిక హాల్‌టికెట్ నంబరు ఇచ్చి జేఎన్టీయూహెచ్‌లోనే పరీక్షలు నిర్వహిం చింది. జూలై 20న విడుదల చేసిన ఫస్టియర్ ఫలితాల్లో ఈ 800 మంది విద్యార్థుల ఫలితాలను మాత్రం వెల్లడించలేదు.

విద్యార్థులంతా వర్సిటీలో బైఠాయించడంతో రెండు రోజుల నుంచి ఫలితాలను దశల వారీగా విడుదల చేస్తున్నారు. శుక్రవారానికి ఇంకా 600 మంది ఫలితాలను విడుదల చేయలేదు. సెప్టెంబర్‌లో జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలను పలు కారణాల వల్ల ఆగస్టులోనే నిర్వహిస్తుండటంతో ఓవైపు ఫలితాలు రాక, మరోవైపు ఫెయిలైతే సప్లిమెంటరీకి అవకాశం లేక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

మరోవైపు రెండు రోజుల నుంచి దశల వారీగా ఫలితాలను అందుకున్న విద్యార్థుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. పరీక్షలు రాసినప్పటికీ ఫలితాల్లో తాను ఇంగ్లిష్ పరీక్షకు ఆబ్సెంట్ అని పేర్కొన్నారని నయీఫ్ అనే విద్యార్థి వాపోయాడు. ఆలస్య రుసుము చెల్లించి సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకున్నానని, తీరా పరీక్ష కేంద్రానికి వెళ్తే ‘నువ్వు పాసయ్యావు’ పొమ్మన్నారని నయీఫ్ ‘సాక్షి’కి తెలిపాడు.
 
రీ కౌంటింగ్ ఫలితాలు ఎప్పుడో?
బీటెక్ ఫస్టియర్ ఫలితాలను జూలైలో విడుదల చేసిన అధికారులు రీ కౌంటింగ్/ రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులకు ఆగస్టు 10వ తేదీ వరకు అవకాశం కల్పిం చారు. దీంతో సుమారు 16 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ముందస్తు సప్లిమెంటరీకి షెడ్యూలు ప్రకటించిన జేఎన్టీయూహెచ్, పరీక్షలు ప్రారంభమయ్యేలోగా ఆ ఫలితాలను విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులు చేసేది లేక ఆందోళనతోనే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. కాగా, రీ కౌంటింగ్/రీ వాల్యుయేషన్ దరఖాస్తులు కాలేజీల నుంచి వర్సిటీకి చేరేందుకే 10 రోజుల సమయం పట్టిందని, రీ వాల్యుయేషన్ పూర్తిచేసి ఫలితాలు ఇచ్చేందుకు కనీసం మరోవారం పడుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement