English Exam
-
‘ప్రైవేట్’ యజమానులే సూత్రధారులు
♦ పదోతరగతి ఇంగ్లిష్–2 పేపర్ లీక్ ముఠా గుట్టు రట్టు ♦ రెండు విద్యాసంస్థల యజమానులతో సహా 12 మంది రిమాండ్ ♦ సెల్‌ఫోన్‌తో ప్రశ్నపత్రం చిత్రీకరించి వాట్సాప్‌లో చేరవేత హుజూర్నగర్: పదో తరగతి ఇంగ్లిష్–2 ప్రశ్నపత్రం లీక్ చేసిన సూత్రధారుల గుట్టును సూర్యాపేట జిల్లా పోలీసులు రట్టు చేశారు. రెండు ప్రైవేట్ పాఠ శాలల యాజమాన్యాలే సూత్రధారులని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను అరెస్టు చేశామని ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌కు చెందిన తనూజ (ఓం శాంతినికేతన్), స్కూలు యజమాని ఎస్కె. సైదులు, విజ్ఞాన్ పాఠశాల యజమాని కొత్తా శ్రీనివా సరావు, అదే పాఠశాలకు చెందిన సిబ్బంది పోలె వెంకటేశ్వర్లు, కొమ్ము శ్రీనులు టెన్త్ ఇంగ్లిష్–2 ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేందుకు తనూజ పాఠశాలలో పనిచేస్తున్న బాణోతు ప్రసాద్‌ను ఎంపిక చేసుకున్నారు. వాట్సాప్‌ను ఉపయోగించి... బాణోతు ప్రసాద్ సోదరుడు పట్టణంలోని వీవీఎం పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతు న్నాడు. అతడి ద్వారా ప్రశ్నపత్రాన్ని లీక్ చేస్తే ప్రతిఫలంగా కొంత నగదుతో పాటు తమ్ముడు పరీక్ష రాసేందుకు జవాబు పత్రాలు కూడా అంది స్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తన తమ్ముడు పరీక్ష రాసే గది కిటికీ వద్ద నుంచి ప్రసాద్ సెల్‌తో ప్రశ్నపత్రాన్ని చిత్రీకరించి వాట్సాప్ ద్వారా తనూజ, విజ్ఞాన్ పాఠశాలలకు చేరవేశాడు. ముఠా సభ్యులు ఎస్కె.సైదులు, గుగులోతు గోపీ నాయక్, భూక్యా ఆంజనేయులు, చిచ్చుల శరత్, బాణోతు సైదా, భూక్యా సాయిరాం, ఎస్కె.ఖలీల్ బాబాలు జవాబు పత్రం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో కలసి తనూజ పాఠశాలపై దాడి చేయడంతో పేపర్ లీకైన విషయం బయటపడింది. జవాబు పత్రాలు తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యానికీ ప్రశ్నపత్రం అందిందని తేలడంతో ఆ పాఠశాలపై కూడా దాడి చేశారు. పాఠశాల యజమాని కొత్తా శ్రీనివాసరావు, సిబ్బంది పోలె వెంకటే శ్వర్లు, కొమ్ము శ్రీనులతో పాటు జవాబు పత్రాలు జిరాక్స్‌లు తీస్తూ సహకరిస్తున్న స్థానిక సాయి ప్రభాత్నగర్లోని ఆరూరి రవిని అరెస్ట్ చేశారు. పరారీలో పేపర్ లీక్ నిందితులు.. వీవీఎం పాఠశాలకు చెందిన మరో ఇద్దరికీ ప్రసాద్ వాట్సాప్ ద్వారా పంపినట్లుగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే అదుపు లోకి తీసుకుంటామన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో ఇప్పటికే ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని, సదరు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశామన్నారు. ఏడుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు మహబూబాబాద్ అర్బన్: ఇంగ్లిష్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు పరీక్షల విభాగ అధికారులు వై.అమరేందర్, ఏసీజీ శ్రీనివాస్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మం డలం జెడ్పీహెచ్ఎస్లో పరీక్షలు జరుగుతుండ గా శివాని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా పలువురు టీచర్లు లీక్ చేశారన్నారు. సస్పెండ్ అయిన వారిలో ఎ.వెంకట్‌రెడ్డి (ఎస్జీటీ, జెడ్పీహెచ్ఎస్, దంతాలపల్లి), వై.హర్షవర్ధన్‌రెడ్డి (స్కూల్ అసిస్టెంట్, దంతాలపల్లి), కె.సతీష్ (హిందీ పండిట్, దంతాలపల్లి), టి.వెంకటేశ్వర్లు (హెచ్ఎం, కంటాయపాలెం, తొర్రూరు మండలం), ఎ.భిక్షపతి (అవుతాపూర్ పాఠశాల హెచ్ఎం), ఆర్. వెంకన్న (జెడ్పీహెచ్ఎస్ వీరారం), బి.వెంకట్రాం (ఎస్జీటీ, దంతాలపల్లి) ఉన్నారు. -
ఇంగ్లిష్ పరీక్ష 29కు వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్ : సమ్మేటివ్–1 పరీక్షల్లో భాగంగా 6–10 తరగతులకు ఈ నెల 24న జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్ష 29కు వాయిదా వేసినట్లు డీఈఓ అంజయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. డెంగీ వ్యాధిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ³రీక్ష వాయిదా వేసినట్లు వారు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రాలు ఓపెన్ చేయరాదని, ప్రశ్నపత్రాలకు తక్కువ వచ్చి ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతేకాని జిరాక్స్ చేయించకూడదని స్పష్టం చేశారు. -
ఫెయిల్.. ఆబ్సెంట్.. కాదు పాస్!
♦ జేఎన్టీయూహెచ్లో బీటెక్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల పరిస్థితి ఇదీ.. ♦ ఏప్రిల్‌లో రాసిన పరీక్షల ఫలితాల కోసం 600 మంది ఎదురుచూపు ♦ కొందరి ఫలితాలు వెల్లడించినా.. అందులోనూ గందరగోళమే.. ♦ రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోసం 16 వేల మంది దరఖాస్తు ♦ ఆ ఫలితాలు వెల్లడించకుండానే సప్లిమెంటరీ సాక్షి, హైదరాబాద్: నయీఫ్ అనే విద్యార్థి బీటెక్ ఫస్టియర్ పరీక్షలు రాస్తే ఫలితాల్లో ఇంగ్లిష్ పరీక్షకు హాజరు కాలేదని (ఆబ్సెంట్) వచ్చింది. దీంతో ఆలస్య రుసుము రూ.5,000 చెల్లించి సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకున్నాడు. హాల్‌టికెట్ తీసుకొని పరీక్ష కేంద్రానికి వెళ్తే.. ఫెయిల్ అయిన వారి లిస్టులో నీ పేరు లేదు ‘నువ్వు పాసయ్యావు’ వెళ్లొచ్చని చెప్పారు.. ఇదీ జేఎన్టీయూహెచ్లో బీటెక్ విద్యార్థుల పరిస్థితి! ఇలాంటి విచిత్రాలు జేఎన్టీయూహెచ్లో రోజుకోరకంగా చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు ఫెయిలైతే సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవడం సహజం. కానీ కొంతమంది బీటెక్ ఫస్టియర్ విద్యార్థులు ఏప్రిల్‌లో రాసిన పరీక్షల ఫలితాలను ఇప్పటికీ విడుదల చేయని జేఎన్టీయూహెచ్.. శుక్రవారం నుంచి అఫిలియేటెడ్ కాలేజీల్లో అదే బీటెక్ ఫస్టియర్ సప్లిమెం టరీ పరీక్షలు నిర్వహిస్తోంది. వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. మరోవైపు వెల్లడించిన ఫలితాలపై సందేహాలున్న సుమా రు 16 వేల మంది విద్యార్థులు రీ కౌంటింగ్/రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, రిజల్ట్ రాకుండానే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి నిమిషం వరకు రీ వాల్యుయేషన్ ఫలితాల కోసం ఎదు రుచూసిన విద్యార్థులు, తీరా అవి ఇప్పట్లో రావని తెలిసి, సప్లిమెంటరీ పరీక్షలకు హాజర య్యారు. మరోవైపు గురువారం కొంతమంది విద్యార్థుల ఫలితాలను వర్సిటీ విడుదల చేసిం ది. విద్యార్థులు ఆ ఫలితాలను చూసుకుని అవాక్కయ్యారు. ఫలితాల్లో ఆబ్సెంట్ అని ఉండటం తో తలపట్టుకుంటున్నారు. రిజల్ట్‌లో ఫెయిల్ అని ఉండగా, సప్లిమెంటరీ పరీక్ష రాద్దామని వెళ్తే పాస్ అని చెప్పారని కొంతమంది వాపోతున్నారు. ప్రతిష్టాత్మక వర్సిటీలో, పరీక్షల వ్యవస్థ గందరగోళంగా మారడం శోచనీయమని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. 600 మందికి ఎదురుచూపులే నాణ్యతా ప్రమాణాలు లేని కారణంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు 2015-16 విద్యా సంవత్సరానికి జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆయా కళాశాలల్లో అప్పటికే ఫస్టియర్ బీటెక్ చదువుతున్న సుమారు 800 మంది విద్యార్థులకు వారు కోరుకున్న కాలేజీల్లో ప్రవేశం కల్పించింది. ఆపై మరో వారం రోజుల్లో ఫస్టియర్ పరీక్షలు ఉండటంతో తాత్కాలిక హాల్‌టికెట్ నంబరు ఇచ్చి జేఎన్టీయూహెచ్లోనే పరీక్షలు నిర్వహిం చింది. జూలై 20న విడుదల చేసిన ఫస్టియర్ ఫలితాల్లో ఈ 800 మంది విద్యార్థుల ఫలితాలను మాత్రం వెల్లడించలేదు. విద్యార్థులంతా వర్సిటీలో బైఠాయించడంతో రెండు రోజుల నుంచి ఫలితాలను దశల వారీగా విడుదల చేస్తున్నారు. శుక్రవారానికి ఇంకా 600 మంది ఫలితాలను విడుదల చేయలేదు. సెప్టెంబర్‌లో జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలను పలు కారణాల వల్ల ఆగస్టులోనే నిర్వహిస్తుండటంతో ఓవైపు ఫలితాలు రాక, మరోవైపు ఫెయిలైతే సప్లిమెంటరీకి అవకాశం లేక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు రెండు రోజుల నుంచి దశల వారీగా ఫలితాలను అందుకున్న విద్యార్థుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. పరీక్షలు రాసినప్పటికీ ఫలితాల్లో తాను ఇంగ్లిష్ పరీక్షకు ఆబ్సెంట్ అని పేర్కొన్నారని నయీఫ్ అనే విద్యార్థి వాపోయాడు. ఆలస్య రుసుము చెల్లించి సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకున్నానని, తీరా పరీక్ష కేంద్రానికి వెళ్తే ‘నువ్వు పాసయ్యావు’ పొమ్మన్నారని నయీఫ్ ‘సాక్షి’కి తెలిపాడు. రీ కౌంటింగ్ ఫలితాలు ఎప్పుడో? బీటెక్ ఫస్టియర్ ఫలితాలను జూలైలో విడుదల చేసిన అధికారులు రీ కౌంటింగ్/ రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులకు ఆగస్టు 10వ తేదీ వరకు అవకాశం కల్పిం చారు. దీంతో సుమారు 16 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ముందస్తు సప్లిమెంటరీకి షెడ్యూలు ప్రకటించిన జేఎన్టీయూహెచ్, పరీక్షలు ప్రారంభమయ్యేలోగా ఆ ఫలితాలను విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులు చేసేది లేక ఆందోళనతోనే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. కాగా, రీ కౌంటింగ్/రీ వాల్యుయేషన్ దరఖాస్తులు కాలేజీల నుంచి వర్సిటీకి చేరేందుకే 10 రోజుల సమయం పట్టిందని, రీ వాల్యుయేషన్ పూర్తిచేసి ఫలితాలు ఇచ్చేందుకు కనీసం మరోవారం పడుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. -
తమ్ముడి పరీక్ష రాస్తూ పట్టుబడిన అన్నయ్య
ఇంటర్ ఫస్ట్ఇయర్ ఇంగ్లిష్ పరీక్షకు 94.47 శాతం హాజరు సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో గట్టెక్కించ్చేందుకు తమ్ముడి పరీక్ష రాసిన అన్నయ్య కటకటాల పాలయ్యాడు. నగరంలోని గోకుల్ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చంచల్గూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్న జాఫర్ అలీ ఇంగ్లిష్ పరీక్షను గండిపేట్ ఎంబీఐటీలో బీటెక్ చదువుతున్న అస్దర్అలీ రాశాడు. అనుమానం వచ్చిన చీఫ్ సూపరింటెండెంట్ హాల్‌టికెట్‌ను తనఖీ చేశారు. అందులోని ఫొటోకు, పరీక్ష రాస్తున్న అస్దర్కు పోలిక లేకపోవడంతో అతడిని నిలదీశారు. దీంతో తన తమ్ముడి కోసం పరీక్ష రాసేందుకు వచ్చినట్లు ఒప్పుకున్నాడు. కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు అస్దర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 491, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, శనివారం రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ తెచ్చినా పరీక్షకు అనుమతించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి వారం రోజులుగా మొత్తుకుంటున్నా... క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో వెబ్సైట్ హాల్‌టికెట్ తెచ్చిన ఓ విద్యార్థిని పరీక్షా కేంద్రం అధికారులు లోనికి అనుమతించలేదు. అలాగే.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట పరీక్షా కేంద్రంలో ఫర్నిచర్ లేక విద్యార్థులు నేలపైనే కూర్చొని రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంటర్‌బోర్డు నుంచి వెళ్లిన ప్రత్యేక పరిశీలకులే ఈ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు. 94.47 శాతం హాజరు: శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 94.47 శాతం హాజరు నమోదైంది. మొత్తం 5,08,415 మందికి గాను 4,80,312 మంది హాజరయ్యారు. మొత్తం ఐదు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
ఓ లక్ష్యం కోసం కళ్లకు గంతలు కట్టుకొని పరీక్ష
కోయంబత్తూర్: నగరంలోని ‘శ్రీ రామకృష్ణ మెట్రిక్యులేషన్ హైయ్యర్ సెకండరీ’ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న 12 ఏళ్ల ఆర్. మాధేశ్వరన్ తోటి విద్యార్థులకన్నా భిన్నమైన వాడు. తోటి విద్యార్థుల్లాగానే త్రైమాసిన పరీక్షలు రాయడానికి శుక్రవారం నాడు బడికి వెళ్లాడు. రెండు గంటల నిర్దేశిత కాల వ్యవధిలోనే ఆంగ్ల పరీక్ష పూర్తి చేశాడు. కానీ తోటి విద్యార్థులకు భిన్నంగా.... కళ్లకు గంతలు కట్టుకొని చక, చక ప్రశ్నలన్నింటికి సమాధానాలు రాశాడు. అతను గుడ్డివాడూ కాదు. కంటికి ఎలాంటి దెబ్బ తగల లేదు. ఇచ్చిన ప్రశ్న పత్రం బ్రెయిలీ లిపీలో కూడా లేదు. అందుకని ఆ విద్యారి కళ్లకు గంతలుకట్టుకొని పరీక్ష రాయడం తోటి విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు ఆశ్చర్యం వేసింది. మాధేశ్వరన్ తనకున్న అసాధారణమైన నైపుణ్యాన్ని నలుగురు ముందు ప్రదర్శించడం కోసం అలా పరీక్ష రాయలేదు. దాని వెనుక అతనికో లక్ష్యం ఉంది. తోటి వారిలో, వీలైనంత వరకు సమాజంలో నేత్ర దానం పట్ల అవగాహన కల్పించేందుకు, చైతన్యం తీసుకరావడానికే అతను అలా పరీక్ష రాశాడు. విద్యార్థి పెద్ద మనసును అర్థం చేసుకున్న ఉపాధ్యాయులు కూడా మాధేశ్వరన్ను ప్రశంసించారు. విద్యార్థి ఫొటోలు తీసి మీడియాకు కూడా విడుదల చేశారు. తాను కళ్లకు గంతలు కట్టుకొని పరీక్ష రాయడమే కాదని, కళ్లు మూసుకొని పుస్తకాలు చదవగలనని, మొబైల్ ఫోన్లో మెస్సేజ్‌లు కూడా చదవగలనని మాధేశ్వరన్ చెప్పాడు. ప్రతి కాగితానికి ఓ వాసన ఉన్నట్టే ప్రతి పదానికి ఓ ప్రత్యేకమైన వాసన ఉంటుందని, అందుకనే తాను చూడకుండానే వాసన ద్వారా పదాలను గుర్తించగలనని తెలిపారు. ‘బ్రెయిన్ ఫోల్డ్ యాక్టివేషన్’ అనే ప్రోగ్రామ్‌కు మాధేశ్వరన్ను పంపించామని, అప్పటి నుంచి ఈ అసాధారణ నైపుణ్యం అతనికి వచ్చిందని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. వారి మాటలను నమ్మినా నమ్మకపోయినా, నేత్ర దానం పట్ల సమాజంలో చైతన్యం తీసుకరావాలనే ఆ విద్యార్థి పెద్ద మనసును అర్థం చేసుకుంటో చాలు! -
విదేశీ విద్యకు ప్రవేశ పరీక్షలెన్నో..
విదేశీ విద్య ఇప్పుడు ప్రతి ఒక్కరి కల. విదేశాలకు వెళ్లి తమకు నచ్చిన కోర్సులు అభ్యసించి.. భావి జీవితానికి బలమైన పునాదులు వేసుకోవాలని విద్యార్థులు ఆశిస్తారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఇందులోనూ అందరూ మొదటి గమ్యంగా భావించే అమెరికాకు వెళ్లేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఫారిన్ చదువుల కోసం ఏ దేశ నగరాల నుంచి అమెరికాకు ఎక్కువమంది విద్యార్థులు వస్తున్నారో తెలుసుకోవడానికి ఇటీవల అమెరికాకు చెందిన బ్రూకింగ్ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 26,220 మంది విద్యార్థులతో ప్రపంచవ్యాప్తంగా ఐదోస్థానంలో, దేశంలో మొదటి స్థానంలో నిలిచింది హైదరాబాద్. ఈ నేపథ్యంలో విదేశీ విద్యను అభ్యసించాలంటే రాయాల్సిన పరీక్షల గురించి తెలుసుకుందాం.. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ (టోఫెల్) ఇది ప్రాథమిక స్థాయి ఆంగ్ల పరీక్ష. అమెరికాలోని యూనివర్సిటీలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కెనడా, బ్రిటన్, సింగపూర్ సహా 130 దేశాలు, దాదాపు 9000 పైగా కాలేజీలు, యూనివర్సిటీలు టోఫెల్ స్కోరు ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్ష స్కోర్ కార్డ్ రెండేళ్లపాటు చెల్లుతుంది. టోఫెల్లో వచ్చిన స్కోరు ఆధారంగా ఆయా దేశాలు వీసా, స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ కూడా ఇస్తున్నాయి. పరీక్ష వ్యవధి నాలుగున్నర గంటలు. లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అంశాలపై ప్రశ్నలడుగుతారు. ప్రతి సెక్షన్‌కు 30 పాయింట్ల చొప్పున మొత్తం పాయింట్లు 120. పరీక్ష ఫీజు: 170 యూఎస్ డాలర్లు. ఏడాదిలో ఎప్పుడైనా ఆన్లైన్, ఫోన్, ఈమెయిల్ లేదా టోఫెల్ ఐబీటీ రిసోర్స్ సెంటర్‌కు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.ets.org/toefl స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్) విదేశాల్లో.. ముఖ్యంగా యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)లో అండర్గ్రాడ్యుయేట్/బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ చదవాలనుకునేవారు రాయాల్సిన పరీక్ష స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్). ఈ స్కోర్ ఆధారంగా యూజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే వాటిలో కెనడా, ఆస్ట్రేలియా, యునెటైడ్ కింగ్డమ్ వంటి దేశాలున్నాయి. స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి కూడా ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. శాట్‌ను యూఎస్ఏలోని కాలేజ్ బోర్డ్, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 20 లక్షలమంది శాట్ రాస్తున్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో స్పెషలై జేషన్ చేయాలనుకునేవారు శాట్ సబ్జెక్ట్ టెస్టులు రాయాలి. 2016 నుంచి శాట్ పరీక్ష విధానంలో మార్పులు రానున్నాయి. సంవత్సరంలో ఆరుసార్లు (జనవరి, మే, జూన్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏడాదిలో రెండుసార్లకు మించి రాయడానికి అవకాశం లేదు. 12 ఏళ్ల ఎడ్యుకేషన్.. అంటే ఇంటర్మీడియెట్ (10+2) పూర్తిచేసినవారు శాట్‌కు అర్హులు. మూడు గంటల 45 నిమిషాల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్. వీటిల్లో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలడుగుతారు. శాట్ స్కోర్ పరీక్ష రాసిన నాటి నుంచి ఐదేళ్లపాటు చెల్లుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుం కింద 51 యూఎస్ డాలర్లు, ఇతర రుసుంల కింద 40 యూఎస్ డాలర్లు చెల్లించాలి. సబ్జెక్టు టెస్టులు రాసేవారు నిర్దేశిత ఫీజులు పే చేయాలి. వెబ్సైట్: http://sat.collegeboard.org/ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల్లో ఎంబీఏ, ఇతర బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్). దీన్ని యూఎస్‌లోని గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 యూనివర్సిటీలు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఆయా కోర్సుల్లో స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి జీమ్యాట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పరీక్షా విధానం: మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో వెర్బల్ (41 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ (37 ప్రశ్నలు), ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ (12 ప్రశ్నలు)తోపాటు అనలిటికల్ రైటింగ్‌పైన ప్రశ్నలుంటాయి. పరీక్ష ఫీజు 250 డాలర్లు. మన దేశ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కెనడా, ఫిన్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, యూఎస్‌లలోని ప్రముఖ కాలేజీలు/యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్ ఆధారంగానే గ్రాడ్యుయేట్ బిజినెస్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. మనదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, బిట్స్ పిలానీ, ఐఎస్బీ-హైదరాబాద్, ఎక్స్ఎల్ఆర్ఐ-జంషెడ్పూర్, మైకా-అహ్మదాబాద్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ప్రముఖ సంస్థలు జీమ్యాట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. జీమ్యాట్ రాసేవారికి కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. పరీక్ష తేదీ నాటికి కనీసం వారం రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఏడాదిలో గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాయొచ్చు. ఒకసారి పరీక్ష రాస్తే 31 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం లభిస్తుంది. ఈ స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుతుంది. సాధారణంగా ఈ మొత్తం స్కోర్ 200 నుంచి 800 మధ్యలో ఉంటుంది. ప్రధాన బీ-స్కూల్స్‌లో ప్రవేశానికి కనీస స్కోరు ప్రకటించనప్పటికీ 600-700 వరకు మంచి స్కోరుగా భావించొచ్చు. ఆన్లైన్, ఫోన్, పోస్టల్ మెయిల్ ద్వారా సంవత్సరమంతా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.mba.com/india అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ) అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ) స్కోర్‌ను యూఎస్ కాలేజీల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. యూఎస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరాలనుకునేవారు శాట్ లేదా ఏసీటీ రాసుకోవచ్చు. ఎందులో ఎక్కువ స్కోర్ వస్తే దాని ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగేళ్ల కోర్సులను అందించే అమెరికన్ యూనివర్సిటీలు, కళాశాలలన్నీ ఏసీటీ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కెనడాలోని కొన్ని విద్యా సంస్థలు కూడా ఏసీటీ ఆధారంగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఏసీటీని ఏడాదికి ఆరుసార్లు నిర్వహిస్తారు. దాదాపు మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో ఇంగ్లిష్ (75 ప్రశ్నలు), మ్యాథ్స్ (60 ప్రశ్నలు), రీడింగ్ (40 ప్రశ్నలు), సైన్స్( 40 ప్రశ్నలు), వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.actstudent.org ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్) అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఫిన్లాండ్ వంటి దేశాల యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం 130 దేశాల్లో 900 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. నెలకు నాలుగుసార్లు చొప్పున ఏడాదికి 48 సార్లు పరీక్ష ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 9000 సంస్థలు ఐఈఎల్టీఎస్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వీటిలో వివిధ యూనివర్సిటీలు, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ సంస్థలు, బహుళజాతి కంపెనీలు, ఇతర సంస్థలు ఉన్నాయి. అంతేకాకుండా పని కోసం ఇతర దేశాలకు వెళ్లేవారు కూడా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. రెండు గంటల 45 నిమిషాల వ్యవధిలో అభ్యర్థుల ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలను తెలుసుకునే విధంగా లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అంశాలపై పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగంలో కనీసం 1-9 వరకు స్కోర్ సాధించాలి. అన్ని విభాగాల్లో సాధించిన స్కోర్ ఆధారంగా సగటు స్కోరును లెక్కిస్తారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలమంది ఈ పరీక్ష రాశారు. స్కోర్ రెండేళ్లపాటు చెల్లుతుంది. ఫీజు: రూ. 9,900. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.ielts.org ది గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్ఈ) ది గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్ఈ) రివైజ్డ్ జనరల్ టెస్ట్.. విదేశాల్లో ఉన్నత విద్యావకాశానికి మార్గం వేసే పరీక్ష. విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, డాక్టోరల్ కోర్సులు చదవాలనుకునేవారు ఈ పరీక్ష రాయాలి. అమెరికాలోని గ్రాడ్యుయేట్ స్కూల్స్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 3,200 ఇన్స్టిట్యూట్లు జీఆర్ఈ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ ఎంపికకు కూడా ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జీఆర్‌ఈని ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో..850 కేంద్రాల్లో నిర్వహిస్తారు. పరీక్ష రాయడానికి మూడు వారాల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఏడాదిలో ఐదుసార్లు జీఆర్ఈ రాయొచ్చు. ఒక్కో పరీక్ష మధ్య కనీసం 21 రోజుల వ్యవధి ఉండాలి. గతంలో రాసిన పరీక్షలో వచ్చిన స్కోర్‌ను మెరుగుపర్చుకొనేందుకు మళ్లీ టెస్టు రాయొచ్చు. కంప్యూటర్/పేపర్ ఆధారిత విధానాల్లో పరీక్ష ఉంటుంది. అనలిటికల్ రైటింగ్, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్‌లపై ప్రశ్నలడుగుతారు. పరీక్ష వ్యవధి దాదాపు గంటన్నర. సంబంధిత సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్ చేయాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా జీఆర్ఈ సబ్జెక్టు టెస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏడాదిలో మూడుసార్లు (సెప్టెంబర్, అక్టోబర్, ఏప్రిల్) రాసుకునే సదుపాయం ఉంది. జీఆర్ఈ స్కోర్ పరీక్ష రాసిన నాటి నుంచి ఐదేళ్లపాటు చెల్లుతుంది. వివరాలకు: www.ets.org/gre -
పాలిటెక్నిక్ విద్యార్థుల అయోమయం
- ఇంగ్లిష్ పరీక్షలో గందరగోళం - సాంకేతిక విద్యామండలి నిర్వాకం వరంగల్, న్యూస్‌లైన్: రాష్ట్ర ఉన్నత సాంకేతిక విద్యామండలి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా పాలిటెక్నిక్ విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. అధికారుల తప్పిదాలతో విద్యార్థులు గంటపాటు ఆందోళన పడ్డారు. సర్దుబాటు చర్యలు చేపట్టడంతో విద్యార్థులు ఊపీరి పీల్చుకున్నారు. గత నెల 15 నుంచి పాలిటెక్నిక్‌లోని వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ ఇంగ్లిష్ చివరి పరీక్ష యథావిధిగా ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. అరుుతే విద్యార్థులకు మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష పత్రాన్ని పంపిణీ చేశారు. ఆందోళనకు గురైన విద్యార్థులు ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంటనే పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చక్రపాణి దృష్టికి తీసుకెళ్లగా.. తప్పిదాన్ని గుర్తించిన అధికారులు ఆన్లైన్లో రెండో సంవత్సరం పరీక్ష పత్రాన్ని అందజేసి.. దాన్ని జిరాక్స్‌లు తీసి విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గంటపాటు ఆలస్యమైంది. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది, వరంగల్ జిల్లా కేంద్రంలో 500 మంది విద్యార్థులు హైరానా పడ్డారు. సమాచార లోపం, తప్పడు ప్రశ్న పత్రంతో గంటపాటు పరీక్ష ఆలస్యమైన విషయం వాస్తవమేనని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ చక్రపాణి వివరించారు. ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని మరో గంటపాటు విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.