సాక్షి, సిటీబ్యూరో: అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఓడీలు, అధ్యాపకుల పీహెచ్‌డీలు, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లను మరోసారి చూపించాలని జేఎన్‌టీయూహెచ్ అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. నకిలీ పీహెచ్‌డీలు, విద్యార్హత సర్టిఫికెట్లతో అనేక కళాశాలల్లో హెచ్‌ఓడీలు, అధ్యాపకులుగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కేవలం మూడు నెలల కాలంలోనే మరోసారి పరిశీలనకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఈ చర్య నకిలీ విద్యార్హతలతో కొనసాగుతున్న వారిలో వణకు పుట్టిస్తోంది. ఇదే విధంగా ఫిర్యాదులు రావడంతో గడిచిన అక్టోబర్ నెలలోనూ ఫ్యాకల్టీ పీహెచ్‌డీలు, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించింది. అయినప్పటికీ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు వస్తుండటంతో మరోసారి పక్కాగా నిర్వహించేందుకు సిద్ధం అయింది. దీంట్లో భాగంగానే ఈ నెల 8న మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్యాకల్టీ సభ్యులు యూనివర్సిటీలోని అకాడమిక్ ఆడిట్ సెల్ వద్ద సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ముందు స్వయంగా హాజరు కావాలని ఇన్‌చార్జి రిజిస్ట్రార్ గోవర్దన్ అనుబంధ కళాశాలకు ఆదేశాలు జారీచేశారు.
పనితీరు పరిశీలన...
తాజా ఆదేశాల ప్రకారం ఫ్యాకల్టీ యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పీహెచ్‌డీ అడ్మిషన్ లెటర్, సినాప్సిస్ కాపీ, థీసిస్ కాపీ, ప్రీ పీహెచ్‌డీ పరీక్ష రిజల్ట్ కాపీతో పాటు ఇతర పత్రాలను తీసుకుని స్వయంగా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ కమిటీ డాక్టరేట్‌లను పరిశీలించడంతో పాటు, ఫ్యాకల్టీ నైపుణ్యం, పనితీరును తెలుసుకోనున్నారు.
తక్కువ వేతనాల కోసం...
యూజీసీ నిబంధనల ప్రకారంఒక్కో కళాశాలలో పనిచేస్తున్న 10 శాతం మంది అధ్యాపకులకు పీహెచ్‌డీ హోదా ఉంటేనే ఆ కళాశాలలకు అక్రిడేషన్ హోదా వస్తుంది. పీహెచ్‌డీ హోదా ఉన్న అధ్యాపకులను 10 శాతం మందిని కొనసాగించాలంటే కళాశాలల యాజమాన్యాలకు ఆర్ధికంగా మోయలేని భారం అవుతుంది. హెచ్‌ఓడీ స్థాయిలో పనిచేసే సిబ్బందికి తప్పనిసరిగా డాక్టరేట్ ఉండాల్సిందే. కాబట్టి చాలా కళాశాలలు తక్కువ వేతనాలకు దొరికే వారిని నియమించుకుంటున్నారు. వారి డాక్టరేట్‌లు, విద్యార్హత సర్టిఫికెట్‌లను పూర్తిగా పరిశీలించడం లేదు. దీని వల్ల టెక్నికల్ కళాశాలల్లో విద్యాబోధనలో నాణ్యత కొరవడుతుంది.
విచారణకు రానివారిని తొలగిస్తాం
ఫేక్ సర్టిపికెట్లతో అనుబంధ కళాశాలల్లో కొంత మంది పనిచేస్తున్నారని యూనివర్సిటీ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో కమిటీని నియమించాం. ఫ్యాకల్టీ వారి డాక్టరేట్‌లు, ఇతర విద్యార్హత పత్రాలను తీసుకుని వచ్చి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ముందు హాజరు కావాలి. ఈ విచారణకు రాని వారిని ఫ్యాకల్టీ జాబితా నుంచి తొలగిస్తాం.– గోవర్దన్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్,జేఎన్‌టీయూహెచ్
పదేపదే పరిశీలన సరికాదు
యూనివర్సిటీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో ఫ్యాకల్టీలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గడిచిన అక్టోబర్ నెలతో పాటు అంతకుముందు కూడ ఒకసారి ఫ్యాకల్టీ సర్టిఫికెట్లను పరిశీలించారు. అయినప్పటికీ మరోసారి డాక్టరేట్‌లు, ఇతర విద్యార్హతలను రుజువు చేసుకోవాలని ఆదేశించడం సరికాదు.– వి.బాలకృష్ణారెడ్డి, తెలంగాణటెక్నికల్ ఎంప్లాయీస్‌అసోసియేషన్ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment