8న ఎంసెట్-3 నోటిఫికేషన్ | On 8th September Eamcet-3 Notification! | Sakshi
Sakshi News home page

8న ఎంసెట్-3 నోటిఫికేషన్

Published Sun, Aug 7 2016 1:02 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM

8న ఎంసెట్-3 నోటిఫికేషన్ - Sakshi

8న ఎంసెట్-3 నోటిఫికేషన్

సెప్టెంబర్ 3 నుంచి కొత్త హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
11వ తేదీన రాత పరీక్ష, వారంలోగా ఫలితాలు, ర్యాంకులు
ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ హాల్‌టికెట్లు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధన అమలు
లీకేజీలో లబ్ధి పొందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులే
ఎంసెట్-3 కమిటీ సమావేశంలో నిర్ణయాలు


సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 11న నిర్వహించనున్న ఎంసెట్-3 రాత పరీక్షకు ఈ నెల 8న నోటిఫికేషన్ జారీ చేయాలని ఎంసెట్-3 ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్‌టీయూహెచ్)లో శని వారం ఎంసెట్-3 కమిటీ సమావేశమైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, జేఎన్‌టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నారు.
 
56,153 మందికి అవకాశం..
ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరినీ ఎంసెట్-3 రాసేందుకు అనుమతించాలని కమిటీ నిర్ణయించింది. ఎంసెట్-2 రాసేందుకు తెలంగాణతోపాటు ఏపీకి చెందిన మొత్తం 56,153 మంది అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 50,961 మంది జూలై 9న నిర్వహించిన పరీక్షకు హాజరు కాగా.. 47,644 మంది అర్హత సాధించి, ర్యాంకులు పొందారు. అయితే లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్ష, ర్యాంకులు అన్నింటిని రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల రిజిస్ట్రేషన్ నంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. హాల్ టికెట్లు  మాత్రం కొత్తవి జారీ చేస్తారు. వచ్చే నెల 3 నుంచి హాల్‌టికెట్లను విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుమతించరు. పరీక్ష జరిగిన రోజే ప్రాథమిక కీ విడుదల చేస్తారు. వారం రోజుల్లోగా ఫలితాలను, ర్యాంకులను వెల్లడిస్తారు. వీలైతే 16, 17 తేదీల్లోనే ర్యాంకులను వెల్లడించే అవకాశం ఉంది. ఇంటర్ మార్కులకు 25 వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేస్తారు. విద్యార్థుల సౌకర్యార్థం వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నపత్రాలను, మోడల్ ప్రశ్నలను అందుబాటులో ఉంచుతారు. ఈసారి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కార్బన్‌లెస్ జవాబు పత్రం ఇస్తారు. అలాగే ప్రశ్నలతోపాటు జవాబుల ఆప్షన్లలోనూ జంబ్లింగ్ ఉంటుంది.
 
విద్యార్థులపైనా పోలీసు నిఘా
ఎంసెట్-2 పేపర్ లీకేజీ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు కూడా పరీక్ష రాసేందుకు అర్హులే. ప్రస్తుతం విచారణ పూర్తి కానందునా వారి పేర్లను ఇప్పుడే తొలగించలేమని, వారు పరీక్ష రాయకుండా నిలుపుదల చేయలేమని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్, ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య పేర్కొన్నారు. వారితోపాటు విద్యార్థులందరిపైనా పోలీసు నిఘా ఉంటుంది. విద్యార్థుల ఫోన్ నంబర్లతో పాటు వివరాలన్నింటినీ ఎంసెట్ కమిటీ ఇప్పటికే పోలీసులకు అందజేసింది. మరోవైపు గతంలో పరీక్ష రాసినవారు ఇపుడు ఎందుకు పరీక్ష రాసేం దుకు దరఖాస్తు చేసుకున్నారన్న దానిపై లోతైన విచారణ జరిపించాలని కమిటీ నిర్ణయించింది.

1970 నుంచి 1994 మధ్యలో జన్మించిన వారు, గతంలో ఎంసెట్ రాసి, ఎంపికై, మెడిసిన్ చదువుతూ ఎంసెట్ రాసేం దుకు దరఖాస్తు చేసిన వారు ఉన్నారు. 1981 నుంచి ఇప్పటివరకు ఇంటర్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేశారు. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసినవారు 609 మంది ఉన్నారు. 2014లో ఇంటర్ ఉత్తీర్ణులైన వారు 5,041 మంది, 2013లో పాసైన వారు 1,474 మంది, 2012లో ఉత్తీర్ణులైన 455 మంది, 2011లో ఉత్తీర్ణులైన 167 మంది, 2010లో పాసైన 67 మంది ఉన్నారు. ఇలా 1981 నుంచి ఇప్పటివరకు ఇంటర్ పాసైన వారు దరఖాస్తు చేశారు. వారందరిపై పోలీసు నిఘా ఉంటుంది.
 
పరీక్ష కేంద్రాల్లో మార్పులు..
పరీక్ష నిర్వహణ కోసం గతంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కేంద్రాల్లో మార్పులు ఉండవు. ఒక్కో రీజనల్ కేంద్ర పరిధిలో పరీక్ష కేంద్రాలు మాత్రం మారుతాయి. ఎంసెట్-2కు 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచే అవకాశం ఉంది. గతంలో విద్యార్థులు పరీక్ష రాసిన కేంద్రాలను మార్చుతారు. ఈ పరీక్ష కేంద్రాలన్నీ ప్రభుత్వ విద్యా సంస్థలు, స్కూళ్లు, కాలేజీల్లో ఏర్పాటు చేస్తారు. ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదు.

సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలు, ఆర్నమెంట్స్‌ను పరీక్ష హాల్లోకి అనుమతిం చరు. ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తారు. విద్యార్థుల ఫొటోలు, వేలిముద్రలు సేకరిస్తారు. ఏపీ నుంచి పరీక్షకు హాజరయ్యేందుకు గతంలో 17,934 మంది దరఖాస్తు చేశారు. వారికి ఈసారి కూడా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement