ప్రతిష్టాత్మక జేఎన్టీయూహెచ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సైతం నెలల తరబడి ముందుకు కదలడం లేదు.
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక జేఎన్టీయూహెచ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సైతం నెలల తరబడి ముందుకు కదలడం లేదు. ఫలితంగా బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన పూర్వ విద్యార్థులు ఏంచేయాలో పాలుపోక జేఎన్టీయూహెచ్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తాము ఎంపిక చేసిన అభ్యర్థుల విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన కోసం, కొన్ని సంస్థలు జేఎన్టీయూహెచ్‌కు పంపిన లెటర్లు అదృశ్యమైనట్లు సమాచారం.
ఉదాహరణ ఇదిగో..
కర్నూలు జిల్లాకు చెందిన షేక్ రహీం నగరంలోని జేన్టీయూహెచ్ అఫిలియేటెడ్ కళాశాలలో 2010లో బీటెక్ ఫూర్తిచేశాడు. ఇటీవల ఉద్యోగం కోసం సౌదీ ఆరేబియా వెళ్లేందుకు వీసా కోసం ఢిల్లీలోని ఓ ఏజెన్సీని సంప్రదించాడు. రహీం బీటెక్ ధ్రువపత్రాలు సరైనవా? కాదా? అని పరిశీలించేందుకు జిరాక్సు ప్రతులను ఆగష్టు 14న జేఎన్టీయూహెచ్ పరీక్షల విభాగానికి సదరు ఏజెన్సీ పోస్ట్ ద్వారా పంపింది. దీనికోసం వర్సిటీ నిర్ధేశించిన రూ.500 ఫీజు చెల్లించారు. అయితే, నెలన్నర గడిచినా వెరిఫికేషన్ రిపోర్టు అందకపోవడంతో ఏజెన్సీ అధికారులు ఇదే సమాచారాన్ని రహీంకు తెలిపారు. రహీం ఇక్కడి అధికారులను సంప్రదించగా.. దరఖాస్తు తమకు చేరలేదని చెప్పుకొచ్చారు.
ఎలా అదృశ్యమైంది..!
సర్టిఫికెట్ల తనిఖీ నిమిత్తం ఢిల్లీ నుంచి స్పీడ్ పోస్టులో పంపిన కవరు ఆగష్టు 16నే జేఎన్టీయూహెచ్‌కు చేరినట్లు పోస్టల్ డెలివరీ రిపోర్టు చెబుతోంది. అయితే, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామిషన్ కార్యాలయానికి వచ్చిన పోస్టల్ కవరు ఎలా అదృశ్యమైందో అంతుబట్టడం లేదు. ఈ విషయమై వాకబు చేసేందుకు బాధితుడు ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నించినా సిబ్బంది అంగీకరించలేదు. ఇలాంటి సమస్య నిత్యం వందలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. పరీక్షల విభాగానికి వచ్చినా సమాధానం చెప్పేవారే లేరని పూర్వ విద్యార్థులు వాపోతున్నారు. కాగా, కొన్నేళ్లుగా పరీక్షల విభాగంలో వెరిఫికేషన్ ప్రక్రియ ఓ పద్ధతి లేకుండా కొనసాగుతోందని, ధ్రువపత్రాల తనిఖీలో జాప్యం జరగుతోందని ఓ ఉన్నతాధికారి సెలవిచ్చారు.