సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కాలేజీల నుంచి పీహెచ్‌డీ చేసేందుకు అనుమతించడం వివాదాస్పదమవుతోంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని అధ్యాపక వర్గం అంటోంది. ఈ విధానం వల్ల పీహెచ్‌డీల నాణ్యతే దెబ్బతింటుందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్జనలో అత్యున్నత స్థాయి డిగ్రీ అయిన పీహెచ్‌డీ (పరిశోధన)ని యూనివర్శిటీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేసేందుకు అనుమతిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి వరకూ పీహెచ్‌డీ కేవలం యూనివర్శిటీల పరిధిలోనే జరుగుతోంది. వర్శిటీ నేతృత్వంలోని ఫ్యాకల్టీ పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేయాల్సి ఉంటుంది. యూనివర్శిటీల్లో గత కొన్నేళ్ళుగా అధ్యాపకుల నియామకం జరగడం లేదు. దీంతో గైడ్‌గా ఉండే అధ్యాపకులకు కొరత ఏర్పడింది. పీహెచ్‌డీ చేయాలనుకునే వారికి ఇది పెద్ద అవరోధంగా మారింది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్‌డీ ఇచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం రీసెర్చ్‌కు అవసరమైన అన్ని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతిమంగా పీహెచ్‌డీలు ఇచ్చేది యూనివర్శిటీయేనని అంటున్నారు. అయితే, వర్శిటీ పట్టాలిచ్చే ఓ కర్మాగారంగా ప్రేక్షక పాత్ర పోషించే వీలుందని నిపుణులు సందేహిస్తున్నారు.
నాణ్యత ఉంటుందా...?
అఫ్లియేషన్ ఉన్న ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్‌డీ చేయడం వల్ల నాణ్యత ఎలా ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టిని ఎంపిక చేయడం లేదని నిపుణులు అంటున్నారు. కాలేజీల్లో ఒక్కో విభాగానికి ప్రొఫెసర్‌లను అర్హులైన వాళ్ళనే నియమించాల్సి ఉన్నా... నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని చెబుతున్నారు.
పీహెచ్‌డీల వ్యవహారంలోనూ ఇదే జరిగే వీలుందని, అర్హతలేని గైడ్‌ల చేత పీహెచ్‌డీ పర్యవేక్షణ చేయించే వీలుందనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థి పీహెచ్‌డీ పూర్తయ్యే వరకూ అధ్యాపకుడు అదే కాలేజీలో పనిచేయాలనే నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని కాలేజీలు అధ్యాపకులను తమ కాలేజీలోనే ఉండాలని వేధించే వీలుందని చెబుతున్నారు. ఇప్పటికే వేతనాలు సకాలంలో ఇవ్వకపోయినా కాలేజీ యాజమాన్యాలను అడిగే దిక్కు ఉండటం లేదని వాపోతున్నారు.
నిపుణులైన గైడ్స్ దీనివల్ల పైవేటు కాలేజీల్లో పనిచేసేందుకు మొగ్గు చూపకపోవచ్చనే విమర్శలొస్తున్నాయి. పీహెచ్‌డీకి గైడ్‌గా ఉండే వ్యక్తికి పీహెచ్‌డీ పూర్తయి.. ఏవైనా జనరల్స్‌లో మూడు ఆర్టికల్స్ పబ్లిష్ అయి ఉండాలి. అయితే, యూనివర్శిటీలు పూర్తి అనుభవం ఉన్న వాళ్ళతోనే పీహెచ్‌డీ మార్గదర్శకత్వం ఇప్పిస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటుకు అప్పగిస్తే ఈ తరహా నాణ్యత ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నాణ్యత దెబ్బతింటుంది
ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్‌డీ అడ్మిషన్లకు అనుమతిస్తే నాణ్యత దెబ్బతింటుంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం. విద్యార్థి పీహెచ్‌డీ అయ్యే వరకూ అధ్యాపకులు అదే కాలేజీలో ఉండాలనే నిబంధన కూడా అన్యాయమే. దీనివల్ల ఫ్యాకల్టితో కాలేజీల యాజమాన్యాలు వెట్టి చాకిరీ చేయించుకుంటాయి. జేఎన్‌టీయూహెచ్ ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి.
– డాక్టర్ వి బాలకృష్ణా రెడ్డి టెక్నికల్, ప్రొఫెషనల్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
అర్హత ఉన్న వారికే అవకాశం
గత ఏడాది రీసెర్చ్ కేంద్రాలున్న కాలేజీలను గుర్తించాం. అదే కాలేజీలో అర్హులైన వారిని ఎంపిక చేసి పీహెచ్‌డీ చేసే విద్యార్థిని సూపర్ వైజ్ చేసే బాధ్యత అప్పగిస్తాం. అంతిమంగా పీహెచ్‌డీ ఇచ్చేది యూనివర్శిటీనే. ఇది యూజీసీ నిబంధనలకు వ్యతిరేకం కాదు.
– ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి వీసీ, జేఎన్‌టీయూహెచ్
Comments
Please login to add a commentAdd a comment