ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ పై ఎల్లుండికి స్పష్టత!
హైదరాబాద్ : ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్పై జేఎన్టీయూహెచ్ అప్పీల్పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. 25 కాలేజీలకు అనుమతి నిరాకరణపై అడ్వకేట్ జనరల్ ఈ సందర్బంగా కోర్టుకు వివరించారు. రికార్డులు సమర్పించాలని కోర్టు ఈ సందర్భంగా ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది.
కాగా ఈ నెల 8 నుంచే వెబ్ ఆప్షన్లు ప్రారంభం కావాల్సి ఉన్నా సీట్లు కోత పడిన కాలేజీలు, అనుబంధ గుర్తింపు రాని కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు ఇచ్చిన అన్ని కాలేజీలు, అన్ని సీట్లను వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దానిని అమలు చేయకుండా జేఎన్‌టీయూహెచ్ డివిజన్ బెంచ్ అప్పీల్‌కు వెళ్లింది.
కాగా జేఎన్‌టీయూహెచ్, యాజమాన్యాల మధ్య ఏర్పడిన వివాదానికి రెండు మూడు రోజుల్లో ఏదైనా పరిష్కారం లభించకపోతే ఈ నెలాఖరుకల్లా ప్రవేశాలు పూర్తి చేయడం అసాధ్యమేనని అధికారులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ, వివాదం పరిష్కారం కాని పక్షంలో తరగతులు ప్రారంభించడం సాధ్యం కాదు.