ప్రమాణాలు లేని విద్యతోనే నిరుద్యోగం
సాక్షి, హైదరాబాద్: ప్రమాణాలు లేని విద్య వల్లే పట్టభద్రులకు ఉద్యోగాలు లభించడం లేదని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అణు శాస్త్రవేత్త ప్రొఫెసర్ అనిల్ కకోద్కర్ వ్యాఖ్యానించారు. దేశ ప్రగతికి విద్యే మూల స్థంభమని, అలాంటి విద్యలో నానాటికి ప్రమాణాలు కొరవడుతుండడం ప్రమాదకరమని చెప్పారు. దేశ నిర్మాణంలో పట్టభధ్రులు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) నాల్గో స్నాతకోత్సవం శనివారం వర్సిటీ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగింది. వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్, పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న విద్యార్థులు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ చేతుల మీదుగా పట్టాలు పొందారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బంగారు పతకాలు అందుకున్నారు. స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కకోద్కర్ మాట్లాడుతూ.. సమర్థుల కోసం దేశంలో అనేక సంస్థలు ఎదురుచూస్తున్నాయని, యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన సాంకేతిక విద్యా సంస్థల కారణంగా పట్టభద్రులు ఆశించిన మేర ప్రతిభ కనబరచలేకపోతుండడంతో వారికి ఉద్యోగాలు లభించడం లేదన్నారు. అయితే జేఎన్‌టీయూహెచ్ ఆ కోవలోకి రాదని, ఉన్నత విలువలకు ఈ వర్సిటీ నిలువుటద్దమని ప్రశంసించారు. యూనివర్సిటీ పరిధిలో 52 విభాగాల్లో గోల్డ్‌మెడల్స్ అందజేస్తున్నట్టు వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రామేశ్వరరావు చెప్పారు. జేఎన్‌టీయూహెచ్ అన్ని రంగాల్లో దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీల సరసన నిలుస్తోందన్నారు. వర్శిటీలో 600 మందికిపైగా విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, 32 మంది ప్రొఫెసర్లకు పలు జాతీయ స్థాయి అవార్డులు లభించాయని తెలిపారు. సుమారు రూ. 55 కోట్లతో వర్సిటీ ప్రాంగణంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు వీసీ వెల్లడించారు. స్నాతకోత్సవంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.వి రమణారావు, రెక్టార్ డాక్టర్ ఇ. సాయిబాబారెడ్డి, పలు విభాగాధిపతులు, ప్రిన్నిపల్స్ పాల్గొన్నారు.
దేశానికి ప్రత్యక్షంగా సేవ చేస్తా..
‘దేశానికి ప్రత్యక్షంగా చేసే చేయాలన్నదే నా ఆకాంక్ష. అందుకే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం వచ్చినా వదిలి ఈసీఐఎల్ రక్షణ విభాగంలో ఇంజనీర్‌గా చేరా. రక్షణ రంగంలో పరిశోధనలు చేస్తా. నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించడం ఎంతో ఆనందాన్ని కల్గిస్తోంది. దీని వెనుక మా పేరెంట్స్ సహకారం కూడా ఎంతగానో ఉంది.’
- కె.కావ్య, నాలుగు బంగారు పతకాల విజేత
సీఈవో కావాలన్నదే నా ఆశయం
‘బంగారు పతకం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా, నాన్నల కళ్లలో ఆనందం చూస్తుంటే గర్వంగా ఉంది. యూనివర్సిటీ విద్యార్థులను ఎంతగానో ప్రోత్సాహిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ చేస్తున్నా. ప్రముఖ సంస్థల్లో సీఈవోగా వ్యవహరించాలన్నదే నా ఆశయం. దీనికోసం మరింత కష్టపడతా.’
- అపర్ణ, బంగారు పతకం విజేత