రేపు అనిల్ కకోద్కర్‌కు జేఎన్టీయూహెచ్ డాక్టరేట్
పేరు : అనిల్ కకోద్కర్
జననం : నవంబరు 11, 1943
తల్లిదండ్రులు : కమల, పి.కకోద్కర్ (ఇరువురూ స్వాతంత్య్ర సమరయోధులు)
గుర్తింపు : బార్క్ యంగెస్ట్ డెరైక్టర్(1996లో)
అవార్డులు : పద్మ విభూషణ్
ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ డాక్టర్ అనిల్ కకోద్కర్‌కు జేఎన్టీయూ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. అణు ఇంధన రంగంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా కకోద్కర్‌ను గౌరవ డాక్టరేట్‌కు ఎంపికచేసినట్లు యూనివర్సిటీ పేర్కొంది. ఈ నెల 9న జరగనున్న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కకోద్కర్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్లు గురువారం వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రామేశ్వరరావు వెల్లడించారు.
అణు ఇంధన రంగంలో భారత్ సాధికారత సాధించడంలో డాక్టర్ అనిల్ కకోద్కర్ కీ లకపాత్ర పోషించారని, అణు రియాక్టర్ టెక్నాలజీలో దేశవాళీ పరిజ్ఞానం అభివృద్ధికి ఆయన కీలక కృషి చేశారని వర్సిటీ వీసీ రామేశ్వరరావు కొనియాడారు. థోరియంను ఇంధనంగా వినియోగించి అణు ఇంధన అభివృద్ధికి ఆయన బాటలు వేశారని పేర్కొన్నారు. కాగా న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అనిల్ కకోద్కర్ నాలుగు దశాబ్దాల విశేష అనుభవాన్ని గడించారు. ఇండో-యూఎస్ నూక్లియర్ ప్రయోగాల కోర్ టీమ్ లో సభ్యుడిగా, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో చైర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్‌గా, భారత ప్రభుత్వ అణు ఇంధన విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు.