42,000 ఇంజనీరింగ్ సీట్లు రద్దు!
సాక్షి, హైదరాబాద్: నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కాలేజీలే ముందుకు వచ్చి సీట్ల రద్దుకు దరఖాస్తు చేస్తున్నాయి. ఈ నెల 13 నాటికి 213 ఇంజనీరింగ్ కాలేజీలు 42 వేల సీట్ల రద్దుకు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో 13 కాలేజీలు పూర్తిగా మూసివేసేందుకు అర్జీ పెట్టుకున్నాయి. యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్న వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) ఆమోదం తెలిపింది. సీట్ల రద్దుకు అవసరమైన నిరభ్యంతర పత్రాల (ఎన్‌వోసీ) జారీని మంగళవారం ప్రారంభించింది.
వరుస చర్యలతో కొరడా..: నిర్ణీత నిబంధనలు అమలు చేయని, నాణ్యత ప్రమాణలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై ఇటీవలి కాలంలో జేఎన్‌టీయూహెచ్ కొరడా ఝుళిపిం చింది. దీంతో యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. గత విద్యా సంవత్సరం (2014-15) ప్రవేశాల సందర్భంగా నిబంధనలు పాటించని, లోపాలు ఉన్న 163 కాలేజీలకు అనుబంధ గుర్తింపును (అఫిలియేషన్) జేఎన్‌టీయూహెచ్ నిరాకరించింది. దీనిపై యాజమాన్యాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. చివరకు షరతులతో అఫిలియేషన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
అయితే అప్పటికే ప్రవేశాలు పూర్తి కావడంతో వాటిల్లో పెద్దగా విద్యార్థులు చేరలేదు. పైగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయా కాలేజీల్లో జాతీయ విద్యా సంస్థలకు చెందిన నిఫుణులతో జేఎన్‌టీయూహెచ్ తనిఖీలు చేపట్టింది. అందులోనూ లోపాలు ఉన్నట్లు తేలింది. దీంతో 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 143 కాలేజీల్లో 807 బ్రాంచీలకు అనుబంధ గుర్తింపును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త విద్యా సంవత్సరం వచ్చేసింది. 2015-16 విద్యా సంవత్సరంలో కాలేజీలు మళ్లీ తమ అనుబంధ గుర్తింపును జేఎన్‌టీయూహెచ్‌లో రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది.
అయితే గతానుభవాల దృష్ట్యా గతంలో అనుమతులు పొందిన అన్ని సీట్లలో అడ్మిషన్లకు ఈసారి ప్రవేశాలు చేపట్టట్లేదు. 213 కాలేజీల్లోని 42 వేల సీట్లను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేశాయి. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఎన్ని సీట్లకు అనుమతి పొందుతారో అన్ని సీట్లకు అవసరమైన ఫ్యాకల్టీని, వసతులను యాజమాన్యాలు ఏర్పాటు చేయాల్సిందే. అయితే ప్రస్తుతం ఎక్కువ కాలేజీల్లో సగం సీట్లు కూడా భర్తీ కావట్లేదు కానీ మొత్తం సీట్లకు అవసరమైన ఫ్యాకల్టీ నియమించాల్సి ఉండటం, వసతులను కల్పించాల్సి ఉండటంతో ఆ సీట్ల రద్దు కోసమే దరఖాస్తు చేశాయి. వాటి రద్దుకు ఆమోదం తెలుపుతూ జేఎన్‌టీయూహెచ్ ఎన్‌వోసీలను ఇస్తోంది.
మళ్లీ తనిఖీలు!
2015-16 విద్యా సంవత్సరంలో కాలేజీల కు అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో జేఎన్‌టీయూహెచ్ మళ్లీ తనిఖీలు చేయనుంది. లోపాలు, నిర్ణీత నిబంధనలు పాటించని కాలేజీల్లో బ్రాంచీల కు అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం లేదు. దీంతో మరిన్ని సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు తేలిన లోపాలను బట్టి చూస్తే గత ఏడాది అనుబంధ గుర్తింపును నిరాకరించిన 143 కాలేజీల్లో సగం వరకు కాలేజీలకు 2015-16 ప్రవేశాల కోసం అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి కనిపించట్లేదని చెబుతున్నారు. ఆయా కాలేజీలన్నీ ఫ్యాకల్టీని పక్కాగా నియమించి, సదుపాయాలు కల్పిస్తేనే గుర్తింపు వస్తుందంటున్నారు.