
సాక్షి, న్యూఢిల్లీ: అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) నిర్ధారించాల్సిన ఫీజులను హైకోర్టు ఎలా నిర్ధారిస్తుందన్నదే కీలక అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులకంటే అధికంగా వసూలు చేస్తున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాసవీ కళాశాల అధిక ఫీజులు వసూలు చేస్తోందంటూ ఆ కళాశాల పేరెంట్స్ అసోసియేషన్ ఇదివరకే దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్లను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. ఏఎఫ్‌ఆర్సీ నిర్దేశించిన రుసుములు మాత్రమే వసూలు చేయాలని ధర్మాసనం ఇదివరకే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తాజాగా మంగళవారం ఈ పిటిషన్ విచారణకురాగా ఇంజనీరింగ్ కళాశాలల ఫీజును నిర్ణయించే అధికారం హైకోర్టుకు ఎలా వస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఫీజు నిర్ణయంలో వివాదం ఉంటే ఏఎఫ్‌ఆర్సీకి అప్పీలు చేయాలి కదా? అని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపిస్తూ ఫీజు నిర్ధారణ అధికారం కోర్టుకు లేదని నివేదిం చారు. లాభాలు ఉత్పన్నమయ్యేలా ఫీజుల నిర్ధారణ ఉండరాదని నివేదించారు. ఫీజు నిర్ధారించే అధికారం కోర్టుకు ఉందని కళాశాలల తరపు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ విన్నవించారు. గతంలో 11 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇందుకు అవకాశం కల్పించిందని వివరించారు. ఫిబ్రవరి 10లోగా రాతపూర్వక నివేదికలు సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించిన ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 19కి వాయిదావేసింది. పేరెంట్స్ అసోసియేషన్ తరపున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment