సాక్షి, న్యూఢిల్లీ : ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల నియంత్రణ విధానంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేసే అధికారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అడ్మిషన్ ఫీజు నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్‌సీ)కే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫీజులను పెంచుతూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు.. వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల కేసులో తీర్పును సోమవారం వెలువరించింది. అయితే ప్రవేశాల నియంత్రణ కమిటీ నిర్ణయం ప్రకారమే ఫీజులు ఉండాలన్న న్యాయస్థానం.. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని అభిప్రాయపడింది. ఫీజుల పెంపుపై హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, వాసవీ ఇంజనీరింగ్ కాలేజీ పేరెంట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు పెంపు దిశగా కసరత్తు మొదలైంది. యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. కొత్త ఫీజులను ఖరారు చేసే వరకు కొంతమేర ఫీజు పెంచేందుకు అధికార వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈనెల 29న యాజమాన్యాలతో సమావేశం నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ), ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చర్యలు చేపట్టాయి. కొత్త ఫీజులను ఖరారు చేసేవరకు ఇప్పటివరకు వసూలు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాలన్న నిర్ణయానికి వచ్చాయి. అయితే యాజమాన్యాలు అందుకు అంగీకరిస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment