ఇక ‘పీజీ’ గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలకు అనుబంధ గుర్తింపు వ్యవహారం గందరగోళంగా మారింది. ఇటు జేఎన్టీయూహెచ్, అటు ఉన్నత విద్యా మండలి ఎవరికి వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో లక్ష మందికి పైగా విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. అన్నీబాగున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు తాము సిద్ధమేనని, ఉన్నత విద్యా మండలి అడిగితే వెంటనే జాబితాను ఇచ్చేస్తామని జేఎన్టీయూహెచ్ చెబుతుంటే... ప్రవేశాలు చేపట్టేందుకు కాలేజీల జాబితాను ఇవ్వాలని పది రోజులుగా అడుగుతున్నా జేఎన్టీయూహెచ్ స్పందించడం లేదని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇలా ఎవరికి వారు వాదనలు చేస్తున్నారే తప్ప.. విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు కావస్తోందని ఆలోచించడం లేదు. ఫలితంగా లక్ష మంది విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. రాష్ట్రంలో గతేడాది దాదాపు 53వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పీజీ (ఎంటెక్) చేసేందుకు పీజీఈసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో దాదాపు 47 వేల మంది అర్హత సాధించగా.. జూన్ 17న ఫలితాలను ప్రకటించారు.
కానీ ఇప్పటివరకు ఇంకా ప్రవేశాల ప్రక్రియను చేపట్టలేదు. మరోవైపు ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం మరో 58 వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించాలంటే యూనివర్సిటీలు (ఉస్మానియా, జేఎన్టీయూహెచ్, కాకతీయ తదితర) అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల జాబితాను ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోని ప్రవేశాల క్యాంపు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. కానీ జేఎన్టీయూహెచ్ నుంచి రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలు ఉన్నత విద్యా మండలికి అందలేదు.
అయితే ఇంజనీరింగ్ బీటెక్ కోర్సుల తరహాలో జేఎన్టీయూహెచ్, ఏఐసీటీఈ సంయుక్త బృందాల తనిఖీల కోసం ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు వాటిని కూడా పరిశీలిస్తామని పేర్కొంది. అయితే ఎలాంటి లోపాలు, వివాదాలు లేని ఎంటెక్ కాలేజీల జాబితాలనైనా ఉన్నత విద్యా మండలికి జేఎన్టీయూహెచ్ అందజేయలేదు. కోర్టు కేసు తేలాక ఇస్తే ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఆపామని పేర్కొంటోంది.
ఉన్నత విద్యా మండలి కోరితే వివాదం లేని కాలేజీల జాబితాలను ఇస్తామని చెబుతోంది. మరోవైపు తాము పది రోజులుగా జాబితాలను ఇవ్వాలని అడిగినా జేఎన్టీయూహెచ్ ఇవ్వడం లేదని మండలి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అసలు అఫిలియేషన్లు ఇచ్చే అధికారం జేఎన్టీయూహెచ్‌కు ఉందా? లేదా? అన్న కొత్త వాదన తెరపైకి వచ్చింది. దీనిపై తుది విచారణకు మరో నాలుగు వారాల గడువు ఉంది. అంటే ఇంకా నెల రోజుల వరకు ఈ ప్రవేశాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. విద్యార్థులకు ఎదురుచూపులు తప్పేలా లేవు.