సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే అవకాశమున్నట్టు సమాచారం. నీటిపారుదలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వం కొద్దికాలంగా చెబుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారమే దీనిని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గత పదేళ్లలో సాగు నీళ్లివ్వడానికి కాకుండా కేవలం కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం కోసమే ప్రాజెక్టులు చేపట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఈ అంశాలతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతను శ్వేతపత్రంలో పొందుపరుస్తున్నట్టు తెలిసింది. దీనిపై స్వల్పకాలిక చర్చను పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కులగణన తీర్మానాన్ని కూడా ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి ఈ తీర్మానాన్ని గురువారమే సభలో ప్రవేశపెట్టాలని సర్కారు భావించింది. అయితే బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సుదీర్ఘంగా సాగడంతో వీలు కాలేదు. దీంతో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఏకగ్రీవ ఆమోదం: స్పీకర్
రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరాని ప్రవేశపెట్టిన రూ.2,75,891 కోట్ల బడ్జెట్‌ను, ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా దానిపై బుధ, గురువారాల్లో చర్చ జరిగింది. చర్చకు ఆర్థికమంత్రి సమాధానమిచ్చిన తర్వాత తొలుత వచ్చే నాలుగు నెలల కాలానికి అత్యవసర ఖర్చుల నిమిత్తం ప్రవేశపెట్టిన రూ.78,911.23 కోట్ల ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించింది. అనంతరం 2023–24 సంవత్సరం అనుబంధ పద్దు కింద ప్రవేశపెట్టిన రూ.46,400.9 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. మరోవైపు బడ్జెట్‌కు ఆమోదం తర్వాత శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.
పేద ప్రైవేటు ఉద్యోగుల కోసం ప్రణాళిక: భట్టి
‘ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు అవసరమవుతాయి. అవసరమైతే డిమాండ్‌కు అనుగుణంగా 5 లక్షల ఇళ్లు నిర్మించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దళితులకు బాబాసాహెబ్ అభయహస్తం కింద ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల మేరకు ఆర్థిక స్వావలంభన కల్పించే పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నాం. గత సంవత్సరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు పెట్టినా రూపాయి విడుదల చేయలేదు. ఈ బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు పెట్టాం. అప్పులు తిరిగి చెల్లించడానికే రూ.64 వేల కోట్లకు పైగా కావాలని, అందుకే రూ.68 వేల కోట్ల కొత్త అప్పులను బడ్జెట్‌లో ప్రతిపాదించాం.
త్వరలో బీసీ సబ్‌ప్లాన్ విధివిధానాలు
బీసీ సబ్‌ప్లాన్‌కి సంబంధించిన విధివిధానాలు కూడా సిద్ధం చేస్తున్నాం. త్వరలో ప్రకటిస్తాం. కొద్ది రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఆరు గ్యారంటీలకు వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరుపుతాం. అర్హులైన దరఖాస్తుదారులందరికీ ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తాం. ధరణిపై నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కార్యాచరణ ప్రారంభిస్తాం. రీయింబర్స్‌మెంట్ ఫీజులు 2018 నుంచి పెండింగ్‌లో ఉండడం బాధాకరం. ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా వాటిని చెల్లిస్తాం.
ఎస్‌హెచ్‌జీలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు ఇస్తాం. రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం. కేంద్రం, రాష్ట్రాల మధ్య సుహ్రుద్భావ వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది..’ అని ఆర్థికమంత్రి భట్టి తన సమాధానంలో చెప్పారు. ప్రైవేటు రంగంలో పనిచేసే పేద వర్గాలు ఉద్యోగ విరమణ తరువాత నెలనెలా పీఎఫ్ తరహాలో కొంత మొత్తం పొందేలా ప్రణాళిక చేపట్టనున్నట్లు తెలిపారు. రద్దయిన డీడీఆర్‌సీ సమావేశాలను పునరుద్ధరిస్తామని అన్నారు.
కుట్రలు చేసేవారిని వదిలిపెట్టం
‘మా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేసే వారెవరినీ వదిలిపెట్టం. కొందరు విద్యుత్ అధికారులు మా ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా బద్నాం చేసేందుకు రైతులను ఇబ్బంది పెట్టారు. మా దృష్టికి వచ్చిన వెంటనే స్థానిక ఎస్‌ఈపై బదిలీ వేటు వేశాం. గత ప్రభుత్వంలో పనిచేసిన డిస్కంల డైరెక్టర్లందరినీ తొలగించి నిబంధనల కొత్త వారిని నియమించడానికి నోటిఫికేషన్ జారీ చేశాం..’ అని భట్టి తెలిపారు. పశుగ్రాసాన్ని కోసే యంత్రాలకు ఉచిత విద్యుత్ వాడే రైతులను విద్యుత్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్‌ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించగా భట్టి బదులిచ్చారు.
నీటిపారుదలపై శ్వేతపత్రం!
Published Fri, Feb 16 2024 4:37 AM | Last Updated on Fri, Feb 16 2024 6:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment