క్వాలిటీ కంట్రోల్, డిజైన్స్ ఇంజనీర్లతో సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘తలాపున పారుతుంది గోదారి..మన చేను, మన చెలక ఎడారి’అంటూ గతంలో తెలంగాణ రాష్ట్రం రాక ముందు పాడుకునే వాళ్ళమని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి ‘మన చేను, మన చెలక మాగాణి’అని పాడుకోవాల్సిన రోజులు వచ్చాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందు చూపుతో సాగునీటి రంగం అభివృద్ధికి మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు అనేక సమస్యల కారణంగా గాలికి వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నిర్థేశిత ఆయకట్టుకు త్వరితగతిన నీరందించడం, రాష్ట్ర అవసరాలమేరకు ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేయడం, గత ప్రభుత్వాలు అటకెక్కించిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం.. లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు ఆయన వివరించారు. ఆదివారం హరీశ్‌రావు హైదరాబాద్‌లోని జలసౌధలో సాగునీటి శాఖ క్వాలిటీ కంట్రోల్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సాగునీటి రంగంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కోరారు.
తనిఖీలు తప్పనిసరి..
సాగునీటి రంగంలో లక్ష్యాలు చేరుకోవడానికి, పనులు పర్యవేక్షించే ఫీల్డ్ ఇంజనీర్లతో పాటు, పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల పాత్ర, ప్రాజెక్టుల డిజైన్లను రూపొందించే డిజైన్ ఇంజనీర్ల పాత్ర కీలకమని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యతలో రాజీ లేకుండా నిర్మించాల్సిన బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. ప్రాజెక్టులు పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలని అన్నారు. వెయ్యి సంవత్సరాల కిందట కాకతీయ రాజులు నిర్మించిన చెరువులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కాకతీయుల కాలంనాటి కట్టడాల్లో ఎక్కడా నాణ్యతలో రాజీ లేకుండా నిర్మించారని చెప్పారు.
మనం కూడా కాకతీయుల వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు నిర్మాణం అవుతున్న భారీ ప్రాజెక్టు నిర్మాణాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. ప్రాజెక్టుల్లో వాడే ఇసుక, స్టీల్, సిమెంట్ నాణ్యతకు క్వాలిటీ కంట్రోల్ విభాగానిదే బాధ్యత అన్నారు. డిజైన్ ప్రకారం కొలతలు, స్లోప్స్, లెవెల్స్ సరిగా ఉన్నాయా లేదా అని చూసే బాధ్యత డిజైన్ల విభాగంపైనే ఉందన్నారు. ప్రతి రోజూ క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నిర్మాణాలవద్దకు వెళ్లి తనిఖీ చేయాలని కోరారు. భారీ కాంక్రీట్ పనులు జరుగుతున్న సైటుకు ఎక్కువ సార్లు వెళ్ళాలని సూచించారు. వివిధ సందర్భాల్లో పత్రికల్లో గానీ, ఇతరత్రా కానీ వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భేటీలో ఇరిగేషన్ ఈఎన్‌సీలు మురళీధరరావు, నాగేందర్‌రావు, సీఈలు సునీల్, హరిరాం, ఖగేందర్‌రావు, సురేశ్ కుమార్, శ్యాం సుందర్, మధుసూదనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం పనితీరును పర్యవేక్షించే బాధ్యతను ఈఎన్‌సీ నాగేందర్‌రావుకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment