quality control
-
నాణ్యమైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టండి
ముంబై: నాణ్యమైన, మన్నికైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలంటూ ప్లాస్టిక్ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఇందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు. అలాగే, ఆవిష్కరణల ద్వారా అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచుకుని, ఎగుమతులను ఇతోధికం చేసుకోవాలని సూచించారు. ‘‘నాణ్యత తక్కువగా ఉన్న ఉత్పత్తులు, దేశీయంగా తయారైనా లేదా దిగుమతి చేసుకున్నవి అయినా వాటికి చెక్ పెట్టేందుకు నాణ్యతా తనిఖీలను, నియంత్రణలను తీసుకొస్తున్నాం. ఇవి ప్లాస్టిక్ పరిశ్రమకు, మన వినియోగదారుల ప్రయోజనాలకు హాని చేస్తున్నాయి. అంతేకాదు భారతదేశ ప్రతిష్టకు నష్టం చేస్తున్నాయి’’అని ‘ప్లాస్టిక్ పరిశ్రమ వృద్ధికి సంబంధించిన టెక్నాలజీ సదస్సు’లో భాగంగా మంత్రి పేర్కొన్నారు. ఈ సదస్సును పరిశ్రమ మండలి అయిన ఏఐపీఎంఏ నిర్వహించింది. ప్లాస్టిక్ పరిశ్రమ సామర్థ్యం, సమస్యల పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. రీసైకిల్ కీలకం.. ‘‘ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసే విషయంలో లేదా ప్లాస్టిక్ ముడి పదార్థాలను తిరిగి వినియోగించే విషయంలో పరిశ్రమకు ఎలా మద్దతుగా నిలవగలమనే దానిపై దృష్టి సారించాం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా, కచ్చితంగా నిర్వహించడం కీలకం. అంతర్జాతీయంగా ప్లాస్టిక్ రీసైకిల్ సగటు 9 శాతంగానే ఉంది. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 4 శాతంకంటే తక్కువే ఉంది. కానీ మనం మన ప్లాస్టిక్ వినియోగంలో 13 శాతాన్ని రీసైకిల్ చేస్తూ ప్రపంచంలోనే ముందున్నాం. రానున్న రోజు ల్లో ఇది మరింతగా పెరుగుతుంది’’అని మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని, టెక్నాలజీ, పరిశోధన, అభివృద్ధి కోసం భాగస్వామ్యాలతో పరిశ్రమ చొరవ చూపించాలని కోరారు. ఈ రంగంలో స్టార్టప్‌లకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో జీడీపీలో ప్లాస్టిక్ పరిశ్రమ వాటా మరింత పెరగాలని పిలుపునిచ్చారు. ‘‘వచ్చే పదేళ్లలో పరిశ్రమ పరిమాణం మూడింతలు కావాలి. రెట్టింపు స్థాయిలో ఉపాధి కలి్పంచాలి. ఎగుమతులను రెండింతలు చేసుకోవాలి’’అని కోరారు. -
ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీ ఏర్పాటు
సాక్షి, అమరావతి: ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా శ్రీవెంకటేశ్వర వెటర్నరీ సైన్స్ విశ్వవిద్యాలయం డీన్. 13 మంది సభ్యులతో కమిటీని నియమించింది. రాష్ట్రస్థాయి ఆక్వా కల్చర్ సీడ్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఎంపెడా, ఆక్వారైతులు సహా ఇతర విభాగాల అధికారులతో కమిటీ నియమించింది. జిల్లాస్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా ఆక్వాకల్చర్ సీడ్ కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: చేపకు ఇక నాణ్యమైన ఫీడ్) -
బాలింత రక్తనాళంలో విరిగిన సూది
సాక్షి, హైదరాబాద్: అత్యవసర రోగులకు ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించేందుకు అమర్చే సెంట్రల్ వీనస్ కేథటర్లు రక్తనాళంలోనే విరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా బయటపడిన విషయం మరిచిపోక ముందే ఈ ఘటన వెలుగు చూడటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న మందులు, సెలైన్ బాటిళ్లతోపాటు సెంట్రల్ వీనస్ కేథటర్ల, ఇంట్రా కేథటర్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో రోగికి మత్తుమందు, యాంటిబయాటిక్ ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించేందుకు ప్రధాన రక్తనాళానికి వీటిని అమర్చుతారు. కొంతమందికి చేతి నరానికి అమర్చితే.. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మరికొంత మందికి గొంతు దగ్గర ఉన్న ప్రధాన రక్తనాళానికి అమర్చుతుంటారు. సాధారణంగా ఇవి విరిగిపోవడం అనేది జరగదు. కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అవుతున్న ఈ కేథటర్లు తొలగించే సమయంలో రక్తనాళంలోనే విరిగి పోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రక్తనాళంలో విరిగిపోయిన సూది.. మహబూబ్‌నగర్‌కు చెందిన గర్భిణి (21) ప్రసవం కోసం గత నెల 27న పేట్లబురుజు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఒక్కసారిగా హైబీపీ రావడంతో ఈ నెల 3న ఆమెకు ఆస్పత్రి వైద్యులు మెడ వద్ద సెంట్రల్ వీనస్ కేథటర్‌ను అమర్చారు. దీని ద్వారా మత్తుమందు ఇచ్చి ఆమెకు సిజేరియన్ డెలివరీ చేశారు. అయితే కేథటర్‌ను తొలగించే సమయంలో సూది మధ్యకు విరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సదరు బాలింతను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియాకు తరలించారు. బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రి కార్డియోథొరాసిక్ వైద్యులు ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. సీటీ, ఎంఆర్ఐ పరీక్షలు చేశారు. విరిగిపోయిన నీడిల్ ఏ వైపు వెళ్లిందో గుర్తించారు. సర్జరీ చేస్తే బాలింత ప్రాణాలకే ప్రమాదమని భావించి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో కార్డియోథొరాసిక్ వైద్య బృందం శుక్రవారం ఉదయం ఆమెకు సర్జరీ చేసి, దవడ కింది భాగంలోని ప్రధాన రక్తనాళానికి అడ్డుగా ఉన్న నీడిల్‌ను విజయవంతంగా తొలగించింది. నాణ్యతపై అనుమానాలు: ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల పరిధిలో పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రి, చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ), సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, చాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రుల్లో రోజుకు సగటున 300పైగా సర్జరీలు అవుతుంటాయి. నగరంలోని వివిధ ప్రసూతి ఆస్పత్రుల్లో రోజుకు సగటున 250 ప్రసవాలు అవుతుంటాయి. అత్యవసర చికిత్సలు అవసరమైన రోగులతోపాటు ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు రోజుకు నాలుగైదు ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లు ఎక్కించాల్సి వస్తుంది. ఇంజక్షన్ల కోసం పదేపదే నీడిల్‌తో గుచ్చడం వల్ల రోగికి నొప్పితో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఐవీ కేథటర్లను అమర్చుతుంటారు. ఆస్పత్రి నుంచి రోగిని డిశ్చార్జ్ చేసే సమయంలో చేతికి, మెడ భాగంలో ఉన్న కేథటర్లను తొలగిస్తుంటారు. అయితే నాణ్యతా లోపం వల్ల కేథటర్‌ను తొలగించే సమయంలో రక్తనాళంలో నీడిల్ మధ్యకు విరిగి రక్తంతోపాటే ఇతర భాగాలకు చేరుతుంది. రోగుల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతోంది. నాసిరకం కేథటర్లను సరఫరా చేస్తుండటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఎడారి చెలక మాగాణిగా మారింది
సాక్షి, హైదరాబాద్: ‘తలాపున పారుతుంది గోదారి..మన చేను, మన చెలక ఎడారి’అంటూ గతంలో తెలంగాణ రాష్ట్రం రాక ముందు పాడుకునే వాళ్ళమని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి ‘మన చేను, మన చెలక మాగాణి’అని పాడుకోవాల్సిన రోజులు వచ్చాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందు చూపుతో సాగునీటి రంగం అభివృద్ధికి మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు అనేక సమస్యల కారణంగా గాలికి వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నిర్థేశిత ఆయకట్టుకు త్వరితగతిన నీరందించడం, రాష్ట్ర అవసరాలమేరకు ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేయడం, గత ప్రభుత్వాలు అటకెక్కించిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడం.. లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు ఆయన వివరించారు. ఆదివారం హరీశ్‌రావు హైదరాబాద్‌లోని జలసౌధలో సాగునీటి శాఖ క్వాలిటీ కంట్రోల్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సాగునీటి రంగంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కోరారు. తనిఖీలు తప్పనిసరి.. సాగునీటి రంగంలో లక్ష్యాలు చేరుకోవడానికి, పనులు పర్యవేక్షించే ఫీల్డ్ ఇంజనీర్లతో పాటు, పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల పాత్ర, ప్రాజెక్టుల డిజైన్లను రూపొందించే డిజైన్ ఇంజనీర్ల పాత్ర కీలకమని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యతలో రాజీ లేకుండా నిర్మించాల్సిన బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. ప్రాజెక్టులు పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలని అన్నారు. వెయ్యి సంవత్సరాల కిందట కాకతీయ రాజులు నిర్మించిన చెరువులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కాకతీయుల కాలంనాటి కట్టడాల్లో ఎక్కడా నాణ్యతలో రాజీ లేకుండా నిర్మించారని చెప్పారు. మనం కూడా కాకతీయుల వారసత్వాన్ని అంది పుచ్చుకోవాలని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు నిర్మాణం అవుతున్న భారీ ప్రాజెక్టు నిర్మాణాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. ప్రాజెక్టుల్లో వాడే ఇసుక, స్టీల్, సిమెంట్ నాణ్యతకు క్వాలిటీ కంట్రోల్ విభాగానిదే బాధ్యత అన్నారు. డిజైన్ ప్రకారం కొలతలు, స్లోప్స్, లెవెల్స్ సరిగా ఉన్నాయా లేదా అని చూసే బాధ్యత డిజైన్ల విభాగంపైనే ఉందన్నారు. ప్రతి రోజూ క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నిర్మాణాలవద్దకు వెళ్లి తనిఖీ చేయాలని కోరారు. భారీ కాంక్రీట్ పనులు జరుగుతున్న సైటుకు ఎక్కువ సార్లు వెళ్ళాలని సూచించారు. వివిధ సందర్భాల్లో పత్రికల్లో గానీ, ఇతరత్రా కానీ వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భేటీలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధరరావు, నాగేందర్రావు, సీఈలు సునీల్, హరిరాం, ఖగేందర్‌రావు, సురేశ్ కుమార్, శ్యాం సుందర్, మధుసూదనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం పనితీరును పర్యవేక్షించే బాధ్యతను ఈఎన్సీ నాగేందర్‌రావుకు అప్పగించారు. -
రోడ్ల నిర్మాణానికి పటిష్ట నిబంధనలు
బ్యాచ్ మిక్స్ ప్లాంట్ల ఏర్పాటు తప్పనిసరి - పగ్ మిల్స్, పేవర్లతోనే నిర్మాణం - రూ.11 వేల కోట్లతో పనులు - ప్రయోగాత్మకంగా సీఎం ఫామ్‌హౌస్ రోడ్డు నిర్మాణం - ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రోడ్ల పటుత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన నిబంధనలను రూపొందించింది. క్వాలిటీ కంట్రోల్ దృష్టి సారించింది. ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్రం లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి ఇలా చెదిరిపోవటం సర్వసాధారణమే అయినా, రోడ్ల నిర్మాణంలో నాణ్యత అంతగా లేకపోవటం కూడా దీనికి మరో ప్రధాన కారణం. దాదాపు రూ.11 వేల కోట్లతో ఎన్నడూలేని స్థాయిలో భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు నాణ్యతపై దృష్టి సారించింది. అధికారులు కొత్త నిబంధనలను రూపొందించి ప్రయోగాత్మకంగా ఇటీవల ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్ రోడ్డును నిర్మించారు. మధ్యలో ఎత్తుగా, రెండు వైపులా వాలుగా రోడ్లు ఉండాలనేది సాధారణ నిబంధన. కానీ, మధ్యలో వంపుగా నిర్మిస్తూ నీళ్లు నిలిచే పరిస్థితిని మన కాంట్రాక్టర్లు కల్పిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ కొత్త నిబంధనలను రూపొందించారు. డ్రమ్ మిక్సింగ్ యూనిట్లతో తారు, కంకర కలుపుతూ కాంట్రాక్టర్లు ఇప్పటివరకు రోడ్లను నిర్మిస్తున్నారు. దీంతో వాటి పాళ్లు సరిగా లేక నాణ్యత దెబ్బతింటోంది. ఇక నుంచి రూ.5 కోట్లను మించిన రోడ్ల నిర్మాణంలో కచ్చితంగా బ్యాచ్ మిక్స్ ప్లాంట్లను వాడాల్సిందేనని నిబంధన విధించారు. అంటే లోడ్ సెన్సార్ల సాయంతో తారు, స్టోన్ డస్ట్, చిన్న కంకర సమ పాళ్లలో మిక్స్ అవుతుంది. ఇది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. రోడ్డు నిర్మాణంలో మిక్సర్ సాంద్రతను బట్టే పటుత్వం ఉంటుంది. ఇందుకోసం కాంట్రాక్టర్లు కచ్చితంగా పగ్మిల్ యంత్రం వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. మిక్సర్‌ను పేవర్లతో మాత్రమే చదును చేయాలనే నిబంధనా విధించింది. ఎప్పటికప్పుడు తనిఖీ..ఫొటోలతో డాక్యుమెంటేషన్ నిబంధనలకు అనుగుణంగా యంత్రాలు ఉన్నాయని కాంట్రాక్టర్లు డాక్యుమెంట్లు దాఖ లు చేసి టెండర్లు దక్కించుకోవాల్సి ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ విభాగం యంత్రాలను పర్యవేక్షించి ఫొటోలతో సహా ఆధారాలు సమర్పిస్తేనే పనులకు తుది అనుమతి లభిస్తుంది. పనులు మొదలయ్యాక నేలను చదును చేయటం, కంకర రోడ్డు నిర్మాణం, ఆ తర్వాత తారు వరస వేయటం... ఇలా పలు దఫాల్లో కూడా తనిఖీలు జరిపి ప్రతి దాన్ని ఫొటోల సాయంతో డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బిల్లులు విడుదలవుతాయి. మంచి ఫలితాలుంటాయి ‘కొత్త నిబంధన విషయంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో 35 పెద్ద సంస్థలు సొంతంగా బ్యాచ్ మిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. పగ్ మిల్స్, పేవర్లను కూడా సమకూర్చుకుంటున్నారు. కచ్చితంగా రోడ్లు 10 సంవత్సరాల పాటు మన్నేలా చేయటం ఈ విధానాల ఉద్దేశం. త్వరత్వరగా రోడ్లు చెడిపోతే ప్రజా ధనం వృథా కావటమే కాకుండా, కంకర కోసం గుట్టల రూపంలోని విలువైన ప్రకృతి సంపద నాశనమవుతుంది. దాన్ని ఇప్పుడు అరికట్టే అవకాశం లభించింది’ - భిక్షపతి, ఈఎన్సీ క్వాలిటీ విభాగం, రోడ్లు భవనాల శాఖ -
పనుల్లో నాణ్యత పాటించాలి
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ సంస్థకు సంబంధించిన పనుల్లో నాణ్యత పాటించాలని ఏస్పీడీసీఎల్ క్వాలిటీ కంట్రోల్ (తిరుపతి) ఎస్ఈ వరకుమార్ సూచించారు. మంగళవారం ఆయన తన బృందంతో కలిసి కర్నూలు డివిజన్లో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకు పనులు చేపట్టి నిరీ్ణత గడువులోపు పూర్తి చేయాలని కోరారు. తనిఖీలు పూర్తయిన తరువాత నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు. ఆయన వెంట కర్నూలు ఆపరేషన్స్ డీఈ రమేష్, టౌన్–1, 2 ఏడీఈలు టీఎన్ ప్రసాద్, జి. రంగస్వామి, కల్లూరు ఎస్టేట్ ఏఈ పెద్దయ్య ఉన్నారు. -
ఆర్ అండ్ బీలో కోల్డ్‌వార్!
సాక్షి ప్రతినిధి, కడప: రోడ్లు భవనాలశాఖలో కోల్డ్‌వార్ నడుస్తోంది. క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈగా ఉన్న వివేకానందరెడ్డిని అర్ధాంతరంగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఇటీవల హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లిన రెగ్యులర్ ఎస్ఈ మనోహర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు మంగళవారం ఆర్అండ్బి కడప క్వాలిటీ కంట్రోలర్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టారు. అక్రమ ఉత్తర్వులంటూ ఇదివరకే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వివేకానందరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓ ఏ నెంబర్ 3511 ఆఫ్ 2015 ద్వారా వివేకానందరెడ్డి ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై స్టేటస్కో ఆర్డర్ జారీ చేస్తూ, మునుపటి ఎస్ఈ వివేకానందరెడ్డిని కొనసాగించాలని ఆదేశించింది. ఆమేరకు హైకోర్టు ఉత్తర్వులను కొనసాగించకపోతే, కోర్టుధిక్కారం అవుతుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతకొంత కాలంగా అంతర్గతంగా నడుస్తున్న కోల్డ్‌వార్ బహిర్గతం కావడంతో ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
రోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
పీఆర్ ఇంజినీర్ల వర్క్‌షాప్‌లో మంత్రి అయ్యన్న విశాఖ రూరల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ గ్రామాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి ఇంజినీర్లు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ల రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాల మెరుగుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఈ శాఖకు క్వాలిటీ కంట్రోల్ విభాగం కీలకమని, దాన్ని పటిష్టపర్చి రానున్న కాలంలో అన్ని రకాల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూస్తామన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాపులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ క్వాలిటీ కంట్రోల్‌ను అమలు పర్చే అంశంపై పూర్తి స్థాయిలో మేధోమథనం చేయాలని ఇంజినీర్లకు సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ గ్రామాల్లో నాణ్యమైన రోడ్లను నిర్మించాల్సిన బాధ్యత ఇంజినీర్లపై ఉందని పేర్కొన్నారు. పంచాయతీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలనే లక్ష్యంతో రోడ్, వాటర్, పవర్, గ్యాస్, ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోందని పేర్కొన్నారు. వీటి నిర్మాణంలో సమస్యలు తల్తెకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని సూచించారు. పీఆర్ ఇంజినీర్-ఇన్-చీఫ్ సి.వి.ఎస్.రామ్మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామని, వీటి నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజినీర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ కనెక్టవిటీని పెంచేందుకు ఈ వర్క్‌షాపులో సుమారు రూ.100 కోట్లకు తక్కువ కాకుండా ప్రతిపాదనలు ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ ఇంజినీర్ల రెడీ రెకనానర్ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటేశ్వరరావు, నాబార్డు సీఈ పద్మజ, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ రవీంద్రనాథ్, ఈఈ ఎల్.కృష్ణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కాంతానాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతు..ఓ తంతు
ఉప్పునుంతల, న్యూస్‌లైన్: ఆ చెరువు నిండితే రైతులు ఏడాదికి రెండు పంటలు పండించుకుంటారు. భూగర్భజలాలు పెరిగితే రెండేళ్లవరకు బోరుబావుల్లో నీటికి ఢోకా ఉండదు. కానీ నిధులున్నా ఆులు ఆం చెరువుకు నాలుగేళ్లుగా మరమ్మతులు లేవు. పనులు ఓ తంతుగా సాగుతున్నా పట్టించుకునేవారు లేరు. చెరువులో ఉన్న నీరంతా వృ థాగా పారుతుండటం..పొరుగూరి రైతులు రబీనాట్లు వేస్తుం డటం చూసి ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మామిళ్లపల్లి ఊరచెరువు కింద 154 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు నిండితే గ్రామానికి చెందిన 80 మంది రైతులు ఏడాదికి రెండుపంటలు పండించుకునేవారు. అయితే 2009లో కురిసిన భారీవర్షాలకు చెరువు తెగిపోయింది. మరమ్మతుల కోసం 2010లో వరదనష్టం నిధులు రూ.33.60లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను కాంట్రాక్టర్ కల్వకుర్తికి చెందిన ఓ సబ్‌కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. గతంలో ఏమాత్రం అనుభవంలేని వారు సకాలంలో పనులు పూర్తిచేయలేకపోయారు. ఆలస్యంగా 2012లో పనులు ప్రారంభించినా పునాదిలో వేసిన కాంక్రీట్‌లో నాణ్యతలేదని క్వాలిటీకంట్రోల్ అధికారులు పనులను నిలిపేశారు. వారి సూచనమేరకు అందులో కొంతమందం కాంక్రీట్‌ను తొలగించి తిరిగి పనులు చేపట్టారు. ఇలా చెరువు పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఇలా ఇప్పటివరకు రూ.10లక్షలు ఖర్చుచేశారు. ఐదడుగుల మేర కాంక్రీట్ వాల్ నిర్మించడంతో చెరువులోకి వచ్చిన వరదనీరంతా ఎక్కిపారి దిగువకు పారుతోంది. దీంతోపాటు కాంక్రీట్ గోడ అంచువెంట ఉన్న మట్టికట్ట కోతకు గురై చెరువులో ఏమాత్రం నీరు నిల్వకుండా పోయింది. బీడుగా ఆయకట్టు మరమ్మతులకు నిధులు మంజూరై నాలుగేళ్లు గడుస్తున్నా పనులు పూర్తిచేయడంలో ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టరు నాన్చుడిధోరణి అవలంభించారు. వారి నిర్లక్ష్యం కారణంగా చెరువులో ఉన్న నీరు దిగువకు వృథాగాపోయింది. దీంతో నీళ్లులేకపోవడంతో వందెకరాలను రైతులు బీడుగా ఉంచాల్సి దుస్థితి ఏర్పడింది. ఈ మేరకు ఇటీవల గ్రామానికి వచ్చిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావుకు స్థానిక సర్పంచ్ దామోదర్, ఆయకట్టు రైతులు చెరువు మరమ్మతులపై ఫిర్యాదుచేశారు. అయినా అధికారుల్లో ఏమాత్రం స్పందన కని పించడం లేదు. దీంతో పచ్చనిపంటలతో కళకళలాడాల్సిన పొలాలు బీళ్లుగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఏ గ్రా మంలో చూసినా చెరువులు నీటితో నిండి రబీలో వరిపంట సాగుకు రైతులు సన్నద్ధమవుతుంటే ఇక్కడ మాత్రం చెరువులో నీళ్లులేక పంటలు వేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతుపనులను పూర్తిచేయాలని వారు కోరుతున్నారు. పూర్తిచేయిస్తాం.. చెరువు మరమ్మతు పనులు పూర్తి చేయించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని ఇరిగేషన్ డీఈఈ మనోహర్ తెలిపారు. సబ్ కాంట్రాక్టుకు తీసుకున్న వారు పనులపై నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. పనులకు కావాల్సిన ఇసుక, కంకర కూడా సేకరించినట్లు తెలిపారు. మరో రెండుమూడు రోజుల్లో పనులు ప్రారంభించి ఈ దఫా పూర్తిచేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.