ముంబై: నాణ్యమైన, మన్నికైన ప్లాస్టిక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలంటూ ప్లాస్టిక్ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఇందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని కోరారు. అలాగే, ఆవిష్కరణల ద్వారా అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచుకుని, ఎగుమతులను ఇతోధికం చేసుకోవాలని సూచించారు.
‘‘నాణ్యత తక్కువగా ఉన్న ఉత్పత్తులు, దేశీయంగా తయారైనా లేదా దిగుమతి చేసుకున్నవి అయినా వాటికి చెక్ పెట్టేందుకు నాణ్యతా తనిఖీలను, నియంత్రణలను తీసుకొస్తున్నాం. ఇవి ప్లాస్టిక్ పరిశ్రమకు, మన వినియోగదారుల ప్రయోజనాలకు హాని చేస్తున్నాయి. అంతేకాదు భారతదేశ ప్రతిష్టకు నష్టం చేస్తున్నాయి’’అని ‘ప్లాస్టిక్ పరిశ్రమ వృద్ధికి సంబంధించిన టెక్నాలజీ సదస్సు’లో భాగంగా మంత్రి పేర్కొన్నారు. ఈ సదస్సును పరిశ్రమ మండలి అయిన ఏఐపీఎంఏ నిర్వహించింది. ప్లాస్టిక్ పరిశ్రమ సామర్థ్యం, సమస్యల పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో ఉన్నట్టు మంత్రి చెప్పారు.
రీసైకిల్ కీలకం..
‘‘ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసే విషయంలో లేదా ప్లాస్టిక్ ముడి పదార్థాలను తిరిగి వినియోగించే విషయంలో పరిశ్రమకు ఎలా మద్దతుగా నిలవగలమనే దానిపై దృష్టి సారించాం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా, కచ్చితంగా నిర్వహించడం కీలకం. అంతర్జాతీయంగా ప్లాస్టిక్ రీసైకిల్ సగటు 9 శాతంగానే ఉంది. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 4 శాతంకంటే తక్కువే ఉంది. కానీ మనం మన ప్లాస్టిక్ వినియోగంలో 13 శాతాన్ని రీసైకిల్ చేస్తూ ప్రపంచంలోనే ముందున్నాం.
రానున్న రోజు ల్లో ఇది మరింతగా పెరుగుతుంది’’అని మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని, టెక్నాలజీ, పరిశోధన, అభివృద్ధి కోసం భాగస్వామ్యాలతో పరిశ్రమ చొరవ చూపించాలని కోరారు. ఈ రంగంలో స్టార్టప్‌లకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో జీడీపీలో ప్లాస్టిక్ పరిశ్రమ వాటా మరింత పెరగాలని పిలుపునిచ్చారు. ‘‘వచ్చే పదేళ్లలో పరిశ్రమ పరిమాణం మూడింతలు కావాలి. రెట్టింపు స్థాయిలో ఉపాధి కలి్పంచాలి. ఎగుమతులను రెండింతలు చేసుకోవాలి’’అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment