రోడ్ల నిర్మాణానికి పటిష్ట నిబంధనలు
బ్యాచ్ మిక్స్ ప్లాంట్ల ఏర్పాటు తప్పనిసరి
- పగ్ మిల్స్, పేవర్లతోనే నిర్మాణం
- రూ.11 వేల కోట్లతో పనులు
- ప్రయోగాత్మకంగా సీఎం ఫామ్‌హౌస్ రోడ్డు నిర్మాణం
- ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రోడ్ల పటుత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన నిబంధనలను రూపొందించింది. క్వాలిటీ కంట్రోల్ దృష్టి సారించింది. ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్రం లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. వరదల ధాటికి ఇలా చెదిరిపోవటం సర్వసాధారణమే అయినా, రోడ్ల నిర్మాణంలో నాణ్యత అంతగా లేకపోవటం కూడా దీనికి మరో ప్రధాన కారణం. దాదాపు రూ.11 వేల కోట్లతో ఎన్నడూలేని స్థాయిలో భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు నాణ్యతపై దృష్టి సారించింది. అధికారులు కొత్త నిబంధనలను రూపొందించి ప్రయోగాత్మకంగా ఇటీవల ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్ రోడ్డును నిర్మించారు. మధ్యలో ఎత్తుగా, రెండు వైపులా వాలుగా రోడ్లు ఉండాలనేది సాధారణ నిబంధన.
కానీ, మధ్యలో వంపుగా నిర్మిస్తూ నీళ్లు నిలిచే పరిస్థితిని మన కాంట్రాక్టర్లు కల్పిస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ కొత్త నిబంధనలను రూపొందించారు. డ్రమ్ మిక్సింగ్ యూనిట్లతో తారు, కంకర కలుపుతూ కాంట్రాక్టర్లు ఇప్పటివరకు రోడ్లను నిర్మిస్తున్నారు. దీంతో వాటి పాళ్లు సరిగా లేక నాణ్యత దెబ్బతింటోంది. ఇక నుంచి రూ.5 కోట్లను మించిన రోడ్ల నిర్మాణంలో కచ్చితంగా బ్యాచ్ మిక్స్ ప్లాంట్లను వాడాల్సిందేనని నిబంధన విధించారు. అంటే లోడ్ సెన్సార్ల సాయంతో తారు, స్టోన్ డస్ట్, చిన్న కంకర సమ పాళ్లలో మిక్స్ అవుతుంది. ఇది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. రోడ్డు నిర్మాణంలో మిక్సర్ సాంద్రతను బట్టే పటుత్వం ఉంటుంది. ఇందుకోసం కాంట్రాక్టర్లు కచ్చితంగా పగ్‌మిల్ యంత్రం వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. మిక్సర్‌ను పేవర్లతో మాత్రమే చదును చేయాలనే నిబంధనా విధించింది.
ఎప్పటికప్పుడు తనిఖీ..ఫొటోలతో డాక్యుమెంటేషన్
నిబంధనలకు అనుగుణంగా యంత్రాలు ఉన్నాయని కాంట్రాక్టర్లు డాక్యుమెంట్లు దాఖ లు చేసి టెండర్లు దక్కించుకోవాల్సి ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ విభాగం యంత్రాలను పర్యవేక్షించి ఫొటోలతో సహా ఆధారాలు సమర్పిస్తేనే పనులకు తుది అనుమతి లభిస్తుంది. పనులు మొదలయ్యాక నేలను చదును చేయటం, కంకర రోడ్డు నిర్మాణం, ఆ తర్వాత తారు వరస వేయటం... ఇలా పలు దఫాల్లో కూడా తనిఖీలు జరిపి ప్రతి దాన్ని ఫొటోల సాయంతో డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బిల్లులు విడుదలవుతాయి.
మంచి ఫలితాలుంటాయి
‘కొత్త నిబంధన విషయంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో 35 పెద్ద సంస్థలు సొంతంగా బ్యాచ్ మిక్స్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. పగ్ మిల్స్, పేవర్లను కూడా సమకూర్చుకుంటున్నారు. కచ్చితంగా రోడ్లు 10 సంవత్సరాల పాటు మన్నేలా చేయటం ఈ విధానాల ఉద్దేశం. త్వరత్వరగా రోడ్లు చెడిపోతే ప్రజా ధనం వృథా కావటమే కాకుండా, కంకర కోసం గుట్టల రూపంలోని విలువైన ప్రకృతి సంపద నాశనమవుతుంది. దాన్ని ఇప్పుడు అరికట్టే అవకాశం లభించింది’
- భిక్షపతి, ఈఎన్‌సీ క్వాలిటీ విభాగం, రోడ్లు భవనాల శాఖ