మీడియాతో మాట్లాడుతున్న ఆర్‌అండ్‌బీ మంత్రి దాడిశెట్టి రాజా, చిత్రంలో ఎంపీ గీత
తుని: రాష్ట్రంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, పారదర్శక విధానాలతో రహదారుల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతుంటే ఓ వర్గం మీడియా పని గట్టుకొని పాత ఫొటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. శనివారం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో ఆయన ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రహదారులు దెబ్బ తిన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంకా ఏమన్నారంటే..
► ఓ వర్గం మీడియా పని గట్టుకొని పాత ఫొటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు చర్యలతో పాడైన ఒక్కో వ్యవస్థను కచ్చితమైన ప్రణాళికతో సరిదిద్దుతున్నాం.
► రాష్ట్రంలో సీఎం జగన్ పాలనకు మెచ్చి.. కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితన్ గడ్కరీ ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని జాతీయ రహదారుల ప్రాజెక్టులను మన రాష్ట్రానికి మంజూరు చేశారు.
► 8,268 కిలోమీటర్ల మేర రాష్ట్ర హైవేలు, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించి 1,167 మేజర్ పనులు చేపట్టేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2,205 కోట్ల రుణం తీసుకున్నాం. ఇందులో 438 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం.
► పూర్తి చేసిన 2,756 కిలోమీటర్లు పనులకు రూ.700 కోట్ల మేర కాంట్రాక్టర్లకు చెల్లించాం. గత ప్రభుత్వ హయాంలో మంజూరై ఆగి పోయిన 233 పనులు చేపట్టేందుకు ఎన్‌ఐడిఏ పథకం కింద నాబార్డు రూ.1,558 కోట్లు రుణం ఇచ్చింది. వీటిలో 182 పనులు పూర్తి కాగా, 51 పనులు ఈ నెలఖారుకు పూర్తవుతాయి.
► 2021–22లో గుంతలు పూడ్చడానికి రూ.86 కోట్లు మంజూరు చేశాం. èఒకప్పుడు రహదారులు ఏలా ఉండేవి? ప్రస్తుతం అభివృద్ధి చేసిన రోడ్లు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు నాడు–నేడు ఫొటో ప్రదర్శన రాష్ట్రంలోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment