ప్రాజెక్టులన్నింటిపై రీసర్వే: కేసీఆర్
* సాగునీటి రంగం, ప్రాజెక్టులపై అధికారులతో కేసీఆర్ సమీక్ష
* జూరాల -పాకాల, పాలమూరు ఎత్తిపోతలకు తొలి ప్రాధాన్యం
* ఈ బడ్జెట్‌లోనే వాటికి నిధులిస్తాం.. పనులు ప్రారంభిస్తాం
* సాగునీటి రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తాం
* 17 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన, ఏరియల్ సర్వే
* స్వయంగా తిరిగి చూసి ప్రాజెక్టులను పరిశీలిస్తానని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటిపై మళ్లీ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీటి రంగం, ప్రాజెక్టులపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో కృష్ణా, గోదావరి బేసిన్‌లో నీటి పారుదల వ్యవస్థ, రాష్ట్రంలో ప్రాజెక్టుల పురోగతి, మధ్య తరహా ప్రాజెక్టుల పరిస్థితిపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా చూడాలని, రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. జూరాల-పాకాల ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రాజెక్టులని, వాటికి సంబంధించిన సర్వేను మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించి, పనులను ప్రారంభించాలని స్పష్టం చేశారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా చాలా ముఖ్యమైందని.. పూర్తిగా లిఫ్టులతోనే కాకుండా గ్రావిటీ ద్వారా కూడా ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించవచ్చని చెప్పారు. కొండలు, గుట్టలపై సిస్టర్న్‌లు నిర్మించి వాటి ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని పంపించాలని సూచించారు. ఈ మేరకు సమీక్షకు సర్వేయర్లను కూడా పిలిపించి, పలు సూచనలు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ కూడా నీటిని సమర్థంగా, ఎక్కువగా వినియోగించుకునేలా లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సిద్ధిపేట, పాములపర్తిల్లో భారీ రిజర్వాయర్లను నిర్మించి ఎక్కువ నీటిని నిలువ చేసుకోవాలని సూచించారు. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసమే కొన్ని తెలంగాణ ప్రాజెక్టులను చేపట్టారని... దుమ్ముగూడెం ప్రాజెక్టు అందుకు పెద్ద ఉదాహరణ అని కేసీఆర్ చెప్పారు. సాగర్ టెయిల్ పాండ్ రైతులకు నీరు ఇవ్వడానికి గోదావరిపై ఎత్తిపోతల పథకం నిర్మించాలనుకోవడం దారుణమన్నారు. అలాంటివాటికి తెలంగాణలో చోటు ఉండకూడదని వ్యాఖ్యానించారు.
బైక్‌పై కొండల్లోనూ తిరిగి చూస్తా..
కృష్ణా గోదావరి నదుల ప్రవాహం తీరు, వాటిపై ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనే అంశాలపై తానే స్వయంగా తిరిగి పరిశీలిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హెలికాప్టర్లలో తనతోపాటు అధికారులను, నిపుణులను కూడా తీసుకెళ్లి ఏరియల్ సర్వే చేస్తామని తెలిపారు. ప్రాజెక్టుల ప్రాంతంలో అవసరమైతే బైక్‌లపై తిరిగి చూస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.