ఆరేళ్లలో.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ | Minister Harish Rao in sakshi special Interview | Sakshi
Sakshi News home page

ఆరేళ్లలో.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ

Published Wed, Jun 1 2016 4:13 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

ఆరేళ్లలో.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ

ఆరేళ్లలో.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి టి.హరీశ్‌రావు
 
- వరద జలాలూ ముందు ముందు నికర జలాలే
- బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో 125 టీఎంసీల కేటాయించని నీటి వాటాలున్నాయి
- వాటిని కలుపుకొంటే పాలమూరు, డిండిలకు కేటాయింపులన్నీ నికర జలాలే
- దీనికోసం ట్రిబ్యునల్, కోర్టుల్లో కొట్లాడి అదనపు వాటా సాధిస్తాం
- భూసేకరణకు జీవో 123 ఐచ్ఛికం మాత్రమేనని వివరణ
- నిర్వాసితులు కోరితే భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమిస్తామని వెల్లడి

నేనొక ఫైటర్‌ను. క్రూసెడర్‌ను. బంగారు తెలంగాణ కోసం మంచి పునాదులు వేస్తా. ఒక తప్పు జరిగినా నాలుగు తరాలపై భారం పడుతుంది. అందుకే సమష్టిగా సరైన నిర్ణయాలు తీసుకుంటాం. ఎన్ని ఆటంకాలు కల్పించినా, అవరోధాలు సృష్టించినా మా ప్రస్థానం ఆగేది కాదు. మమ్మల్నెవరూ ఆపలేరు. ఆపుదామనుకుంటే, ఆపుతామనుకుంటే అది భ్రమే
 
 సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తొలి ప్రాధాన్యం నీళ్లకే ఇస్తున్నామని... రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీరందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల జలాల్లో రాష్ట్రానికి ఉన్న నీటి వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఆరేళ్లలో కోటి ఎకరాలకు నీరందించి ప్రజల ఆశలు నెరవేరుస్తామని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మారుస్తామని భరోసా ఇచ్చారు. గతంలోని ఈపీసీ విధానాలు రద్దు, అడ్వాన్సుల చెల్లింపులకు చరమగీతం పాడుతూనే... ప్రాజెక్టు పనుల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులు, లక్ష్యాలు, పొరుగు రాష్ట్రాలతో వివాదాలు, భూసేకరణ ఆరోపణలు తదితర అంశాలపై హరీశ్‌రావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..

 ప్రశ్న: సాగునీటి రంగంలో ప్రభుత్వ ప్రాథమ్యాలేమిటి?
 హరీశ్‌రావు: ప్రతి నియోజవర్గానికి లక్ష ఎకరాల చొప్పున నీరందిస్తాం. ఆరేళ్లలో కోటి ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దీనికోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. ఆరునూరైనా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అని ఎలుగెత్తి చాటేలా చేసి చూపిస్తాం.

 రీఇంజనీరింగ్‌తో కాలయాపన జరుగుతోందనే విమర్శలున్నాయి.. లక్ష్యంలోగా ప్రాజెక్టుల పూర్తి సాధ్యమేనా?
 దేవాదుల, దుమ్ముగూడెం, కంతనపల్లి, ప్రాణహిత ప్రాజెక్టుల పరిధిలో గత ప్రభుత్వాలు ఎంతో అసమగ్రంగా, అసంపూర్ణంగా ప్రాజెక్టులు చేపట్టాయి. దేవాదులలో 5 లక్షల ఎకరాలకు 5 టీఎంసీల సామర్థ్యం, కల్వకుర్తిలో 3.5 లక్షల ఎకరాలకు 0.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లను మాత్రమే డిజైన్ చేశారు. వాటితో తెలంగాణకు ప్రయోజనం శూన్యం. వీటిని సరిదిద్దేందుకే రీడిజైన్ చేపట్టాం. పూర్తి స్పష్టతతో, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమగ్రంగా నివేదికలు రూపొందిస్తున్నాం. అందువల్ల తొలుత కొంత జాప్యం జరిగినా అన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. కాబట్టి అనుకున్న లక్ష్యం మేరకు పూర్తి చేయడం కష్టం కాదు.

 కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై వ్యతిరేకతను ఏమంటారు?
 వ్యతిరేకత లేదు. ప్రతిపక్షాలే వ్యతిరేకతను సృష్టిస్తున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వద్ద రాజీవ్ రహదారికి కుడివైపున జనగామ పరిధిలో భూములు కోల్పోయిన వారికి కేవలం రూ.80 వేల నుంచి రూ.1.30 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చారు. అదే మేం రూ.6 లక్షల వరకు పరిహారాన్ని 15 రోజుల్లోనే చెల్లిస్తున్నాం.

 భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారమివ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం జీవో 123 వైపే ఎందుకు మొగ్గుతోంది?
 ఈ విషయంలో చాలా మందికి అపోహలున్నాయి. జీవో 123 ప్రకారం 15 రోజుల గడువులో నిర్వాసితులకు పరిహారమిస్తున్నాం. భూసేకరణ చట్టం కన్నా మెరుగైన పరిహారం చెల్లిస్తున్నాం. రైతుకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరితేనే జీవో 123ని వర్తింపజేస్తున్నాం. జీవో 123 అనేది కేవలం ఐచ్ఛికం(ఆప్షన్) మాత్రమే. ఎవరైనా భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కోరితే ఆ విధంగానే చెల్లిస్తాం. అయితే ఈ చట్టం ద్వారా పరిహారం చెల్లింపునకు 6 నుంచి 8 నెలల గడువు తీసుకుంటోంది.  

 పాలమూరు-రంగారెడ్డి, డిండి పథకాలకు నీటి కేటాయింపులు లేవని ఏపీ వాదిస్తోంది కదా?
 కృష్ణా జలాల్లో తెలంగాణకున్న హక్కు మేరకే ప్రాజెక్టులు చేపట్టాం. ఒక్క చుక్క అదనంగా కోరుకోవడం లేదు. మొత్తం 811 టీఎంసీల నికర జలాల్లో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. తెలంగాణకు మరో 77 టీఎంసీల మిగులు జలాల కేటాయింపులున్నాయి. కానీ మొత్తంగా 200 టీఎంసీలకు మించి  రాష్ట్రం వాడటం లేదు. అంతేకాదు రాష్ట్రానికి ఉన్న కేటాయింపులను తన పరిధిలో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు ఉంది. అందువల్లే పాలమూరు-రంగారెడ్డి, డిండిలకు నీటిని వాడుకుంటాం. అంతేగాకుండా బచావత్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే పైరాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఆ 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయి. ఇక పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి నీటిని కృష్ణాకు తరలిస్తే అంతే పరిమాణంలో పైరాష్ట్రాలకు వాటా ఉంటుందని బచావత్ అవార్డు పేర్కొంది. 80 టీఎంసీల సామర్థ్యంతో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారు. ఈ లెక్కన ఇదే స్థాయిలో 80 టీఎంసీల నీరు తెలంగాణకు దక్కాలి. అంటే మొత్తంగా 125 టీఎంసీలు రావాల్సి ఉంది. ఈ లెక్కన ప్రస్తుతం వరద జలాలుగా పేర్కొంటున్నవి రేపు నికర జలాలు అవుతాయి. అదే నీటిని పాలమూరు, డిండిలకు వాడతాం.

 అవి కొత్త ప్రాజెక్టులేననే ఏపీ వాదనపై?
 కృష్ణాలో 70 టీఎంసీలు వాడుకునేలా పాలమూ రు ప్రాజెక్టుపై డీపీఆర్ తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇచ్చారు. కృష్ణాలోనే 30 టీఎంసీల నీటిని వాడుకునేలా డిండి ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై  7న జీవో 159 ఇచ్చారు. ఆ జీవోలు ఇచ్చినప్పుడు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ ఉన్నారు. అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? ఆరోజు సరైనవి ఇప్పుడు అక్రమ ప్రాజెక్టులుగా ఎందుకు కనిపిస్తున్నాయి? నిజానికి ఏపీ చేపట్టిన పట్టిసీమ పూర్తిగా కొత్త ప్రాజెక్టు. దానికి ఎలాంటి అనుమతులూ లేవు.

 ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై మీ స్పందన?
 ప్రాజెక్టులకు ఈ రెండేళ్లలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోరినా స్పందన లేదు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద మాత్రం 11 రాష్ట్ర ప్రాజెక్టులను చేర్చారు. వాటికి ఏమేర సహకారం అందుతుందో చూడాలి.
 
 ప్రాణ హిత-చేవెళ్ల డిజైన్ మార్పు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకేనన్న విమర్శలపై మీ స్పందన?
 గోదావరిలో లభ్యతగా ఉన్న నీటిని సాగు, తాగు ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం, ముంపు తక్కువగా ఉండేలా చూడటం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ మేడిగడ్డ ద్వారా నీటిని మళ్లించాలని నిర్ణయించాం. తమ్మిడిహెట్టి 152 మీటర్ల ఎత్తును మహారాష్ట్ర వ్యతిరేకించింది. అందుకే 148 మీటర్లకు తగ్గాల్సి వచ్చింది. ఈ ఎత్తులో కేవలం 1.8 టీఎంసీల సామర్థ్యంతోనే బ్యారేజీ నిర్మించి, 40 టీఎంసీల నీటిని మాత్రమే మళ్లించగలం. ఆ నీటితో నిర్ణీత 16 లక్షల ఎకరాలకు నీరివ్వలేం.

అందుకే ఏడాదిపాటు 400 టీఎంసీల లభ్యత ఉన్న మేడిగడ్డ ద్వారా నీటిని మళ్లించాలని నిర్ణయించాం. దీని ద్వారా నిర్ణీత 20 లక్షల ఎకరాలతో పాటు ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్ కింద ఉన్న మరో 20 లక్షల ఆయకట్టు స్థిరీకరణకూ అవకాశముంది. నీటి నిల్వల కోసం 11 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్లను 153 టీఎంసీల సామర్థ్యానికి పెంచాం. ఆయకట్టు, సామర్థ్యాలు పెరిగినప్పుడు ప్రాజెక్టు వ్యయం పెరగదా?, 2007లోనూ ఇప్పుడూ ఒకే ధరలున్నాయా? ప్రాజెక్టుల్లో మార్పులు రాష్ట్ర ప్రయోజనాల కోసమేగానీ.. కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాదు. కాంట్రాక్టర్లకు ప్రాంతం, వ్యక్తులు, ఇష్టాయిష్టాల మీద ఆధారపడి టెండర్లు ఇవ్వరు. దేశంలోని ఎక్కడివారైనా టెండర్లలో పాల్గొంటారు. తక్కువ కోట్ చేసిన వారు కాంట్రాక్టు పొందుతారు. ఇది గుర్తుంచుకోవాలి.
 
 పొరుగు రాష్ట్రాలతో సఖ్యతకు వీలులేదా?
  రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)కు బచావత్ తీర్పు ప్రకారం 15.9 టీఎంసీల నీటి కేటాయింపు, 87,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ ఏనాడూ అక్కడ 4 టీఎంసీల నీటి వినియోగం కూడా లేదు. ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని అమలు చేద్దామంటే ఏపీ అడ్డుపడుతోంది. ఇదేం న్యాయం? ఆర్డీఎస్ ఆధునీకరణ కోసం కర్ణాటకను ఒప్పించాం. మేడిగడ్డ, చనాఖా-కొరట బ్యారేజీలపై మహారాష్ట్రను ఒప్పించాం. వారితో సఖ్యత కోరుకున్నాం. ఏపీతోనూ అదే విధమైన సఖ్యత కోరుతున్నా.. వారి నుంచి స్పందన లేకపోతే మేమేం చేయగలం? సాగర్, శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని ఒత్తిడి తెస్తోంది. అది సరికాదన్నా వినడం లేదు.
 
 ‘మిషన్ కాకతీయ’ ఆశించిన లక్ష్యాన్ని చేరుతుందా?
 చిన్న నీటి వనరులకు గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 262 టీఎంసీల మేర కేటాయింపులున్నా.. వినియోగం 100 టీఎంసీలు దాటడం లేదు. దీంతో చిన్న నీటి వనరుల కింద ఆయకట్టులో సగం కూడా సాగు కావడం లేదు. అందువల్లే రాష్ట్రంలోని 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టాం. మొదటి విడతలో 8వేలు, రెండో విడతలో మరో 7 చెరువులను వర్షాలు సమృద్ధిగా కురిసే నాటికి సిద్ధం చేసి ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అనుకున్న మేర వర్షాలు కురిస్తే నీటికి కొరత ఉండదు. మా లక్ష్యం నెరవేరినట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement