సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకూ పూర్తిచేస్తే.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద 2.98 లక్షల ఎకరాలకు కాలువల (గ్రావిటీ) ద్వారా నీటిని సరఫరా చేయవచ్చునని కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షలు కలిపి మొత్తం 23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రజలకు వేసవిలోనూ సమృద్ధిగా తాగునీటిని అందించవచ్చని చెప్పారు. ఈ పనుల పూర్తికి రూ.10,911 కోట్లు అవసరమని.. తక్షణమే విడుదల చేస్తే గడువులోగా తొలిదశను పూర్తిచేస్తామన్నారు. దీనిపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు కుశ్వీందర్ వోహ్రా స్పందిస్తూ.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఇప్పటికే డిస్ట్రిబ్యూటరీలను అభివృద్ధి చేసిన నేపథ్యంలో వాటి వ్యయాన్ని మినహాయించి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తిచేయడానికి అవసరమైన నిధులపై నివేదిక ఇవ్వాలని సూచించారు. దీని ఆధారంగా పోలవరం తొలిదశ పనులను పూర్తిచేయడానికి నిధుల మంజూరు అంశంపై కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక ఇస్తామని కుశ్వీందర్ వోహ్రా తెలిపారు. ఈ నివేదికను బుధవారం సీడబ్ల్యూసీకి పంపుతామని రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి చెప్పారు.
పోలవరం పనులు వేగవంతం
పోలవరం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి పనులను వేగవంతం చేశామని 41.15 మీటర్ల కాంటూర్ వరకూ (తొలిదశ) పనులు పూర్తిచేయడానికి తక్షణం రూ.10,911 కోట్లు, 45.72 మీటర్ల వరకూ ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూ.21 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్వామినాథన్.. పోలవరం తొలిదశ పనులను పూర్తిచేయడానికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయి? వాటివల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో తేల్చి నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఆదేశించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సీడబ్ల్యూసీ సభ్యులు కుశ్వీందర్ వోహ్రా రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, పీపీఏ సీఈ ఏకే ప్రధాన్ తదితరులతో వర్చువల్ విధానంలో సమీక్ష జరిపారు.
పుష్కర కింద 1.41లక్షలు, తాడిపూడి కింద 1.57 లక్షల ఎకరాలు..
పోలవరం ప్రాజెక్టును తొలిదశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకూ పూర్తిచేస్తే.. కుడి, ఎడమ కాలువల ద్వారా గ్రావిటీపై నీటిని సరఫరా చేయవచ్చునని సీడబ్ల్యూసీకి రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు వివరించారు. కుడి కాలువ ద్వారా తాడిపూడి ఎత్తిపోతల కింద 1.57 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా పుష్కర ఎత్తిపోతల కింద 1.41 లక్షల ఎకరాలు వెరసి 2.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు గ్రావిటీపై నీటిని సరఫరా చేయవచ్చునని చెప్పారు. అలాగే, కృష్ణా డెల్టాకు పోలవరం కుడి కాలువ ద్వారా గ్రావిటీపై నీటిని మళ్లించి.. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చునన్నారు. ఇక హెడ్ వర్క్స్ (జలాశయం)లో కుడి, ఎడమ కాలువ పనుల్లో మిగిలిన వాటిని పూర్తిచేయడానికి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి తొలి దశలో రూ.10,911 కోట్లు విడుదల చేయాలని కోరారు.
రెండో దశలో రూ.21 వేల కోట్లు
ఇక పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల వరకూ పూర్తిచేస్తేనే 194.6 టీఎంసీలను నిల్వచేయవచ్చునని.. అప్పుడే ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందుతాయని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. 45.72 మీటర్ల వరకూ ముంపునకు గురయ్యే భూమి సేకరణకు, నిర్వాసితుల పునరావాసానికి రూ.21 వేల కోట్లు అవసరమవుతాయని.. వాటిని కూడా తొలిదశ పనులకు ఇచ్చే నిధులకు సమాంతరంగా విడుదల చేయాలంటూ చేసిన ప్రతిపాదనలపై వోహ్రా సానుకూలంగా స్పందించారు. రెండో దశ పనులు పూర్తిచేయడానికి అవసరమైన నిధులపై కూడా కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక ఇస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment