కృష్ణా బోర్డు సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారంలో బోర్డు కొంత ముందడుగు వేసింది. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. గత నాలుగేళ్ల తరహాలోనే చిన్న నీటివనరుల విభాగంలో వినియోగం, ఆవిరి నష్టాలు, కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలతో నిమిత్తం లేకుండా కృష్ణా జలాలను 66 : 34 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని తేల్చి చెప్పింది. ఏ నీటి సంవత్సరం లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని, కోటాలో మిగిలిన నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో కృష్ణా బోర్డు ఏకీభవించింది. క్యారీ ఓవర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తెలిపింది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు 14వ సర్వ సభ్య సమావేశం సుమారు ఐదు గంటలు రెండు విడతలుగా సుదీర్ఘంగా జరిగింది.
మళ్లించిన వరద జలాలు వేరుగా లెక్కింపు..
శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తివేసి ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎవరు వరద జలాలను మళ్లించినా లెక్కలోకి తీసుకోకూడదన్న ఏపీ ప్రతిపాదనతో బోర్డు ఏకీభవించింది. మళ్లించిన వరద జలాలను వాటా కింద కాకుండా వేరుగా లెక్కిస్తామని పేర్కొంది. సాగర్, కృష్ణా డెల్టాల్లో సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే బోర్డు కేటాయించిన నీటిని శ్రీశైలం నుంచి 66 : 34 నిష్పత్తిలో వాడుకుంటూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలన్న ఏపీ వాదనతో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏకీభవించారు. బోర్డు, జల్ శక్తి శాఖ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి చేయటాన్ని ప్రశ్నించారు. అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్‌ను కట్టడిచేయడంతోపాటు జరిమానా వి«ధించాలని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి పట్టుబట్టడంతో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌లు సమావేశం నుంచి వాకౌట్ చేసి తర్వాత మళ్లీ భేటీలో పాల్గొన్నారు.
70 శాతం వాటాకు ఏపీ పట్టు
కృష్ణా జలాలను చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ కోరడంపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చిన్న నీటివనరుల విభాగంలో 89.15 టీఎంసీల కేటాయింపు ఉంటే తెలంగాణ సర్కార్ 175 టీఎంసీలను వాడుకుంటోందని, వాటిని పరిగణనలోకి తీసుకుని ఏపీకి కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కేటాయించాలని ఈఎన్‌సీ నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. బేసిన్‌లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని గుర్తు చేస్తూ వాటిని వాటా కింద కలపకూడదని ఏపీ అధికారులు చేసిన డిమాండ్‌తో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏకీభవించారు. వరద జలాలను వాడుకునే స్వేచ్ఛ రెండు రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేశారు.
జరిమానా విధించాల్సిందే..
నీటి సంవత్సరం ప్రారంభం నుంచే శ్రీశైలంలో కనీస మట్టానికి దిగువనే బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేయటాన్ని పలుదఫాలు బోర్డు దృష్టికి తెచ్చామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. వాటా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు దక్కకుండా చేయడానికే తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తోందని, నీళ్లు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని సృష్టించిందన్నారు. దీనిపై కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏకీభవించారు. సాగర్, కృష్ణా డెల్టాలో సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని 66:34 నిష్పత్తిలో వాడుకుం టూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయాలని తేల్చిచెప్పారు. ఎడమగట్టు కేంద్రంలో నిరంతరా యంగా విద్యుదుత్పత్తి వల్ల నీటి మట్టం అడుగంటి దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లందించలేని దుస్థితి నెలకొందని, చెన్నైకి తాగు నీరు సరఫరా చేయలేని పరిస్థితి ఉత్పన్నమైందని ఏపీ అధికారులు పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్‌ను కట్టడి చేయడం తోపాటు జరిమానా విధించాలని పట్టుబట్టారు.
విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే..
కృష్ణా నదిపై అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇవ్వాలని బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ రెండు రాష్ట్రాల అధికారులను కోరారు. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను అందచేశామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని, విభజన చట్టం 11వ షెడ్యూల్ ద్వారా వాటిని కేంద్రం ఆమోదించి పూర్తి చేయడానికి అనుమతి ఇచ్చిందన్నారు. వాటిని అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొనడమంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కేంద్ర జల్‌శక్తిశాఖ దృష్టికి తేవాలని బోర్డు ఛైర్మన్ సూచించగా ఇప్పటికే నివేదించినట్లు ఏపీ అధికారులు తెలిపారు. తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండా చేప ట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్త రామదాస, తుమ్మిళ్ల, నెట్టెంపాడు(సామర్థ్యం పెంపు), కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), ఎస్సెల్బీసీ, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులను నిలిపేసేలా చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని తెలంగాణ అధికారులను బోర్డు చైర్మన్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment