
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోకి వస్తున్న ప్రవాహాలు, వినియోగిస్తున్న నీటి వివరాలను సమర్పిస్తున్నట్లే బేసిన్‌లోని ఉపనదుల్లో నీటి వినియోగ లెక్కలను తెలపాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి స్పందన కరువైంది. ఉప నదుల నీటి ప్రవాహాలపై స్పష్టత ఉంటేనే నీటి కేటాయింపులు, వినియోగం లెక్కలు పారదర్శకంగా ఉంటాయని తెలిపినా రెండు రాష్ట్రాలు ఇంతవరకు వివరాలు సమర్పించలేదు.
త్రిసభ్య కమిటీ భేటీ అనివార్య కారణాలతో వాయిదా పడటంతో ఈ అంశం పై చర్చ జరగలేదు. దీంతో మరోసారి లేఖ రాయాలని బోర్డు భావిస్తోంది. దీంతోపాటే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో గత 20 ఏళ్లుగా 1989 నుంచి 2019వరకూ ఏటా జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల్లోకి వచ్చిన వరద, వినియోగించుకున్న జలాలు, దిగువకు విడుదల చేసిన ప్రవాహాల లెక్కలు సమర్పించాలని కోరినా స్పందన రాలేదు. ఈ వివరాలిస్తే, మిగులు జలాల లెక్కలు తేల్చుతామని చెప్పినా రాష్ట్రాలు స్పందించకపోవడంతో వారం క్రితం ఈ వివరాలు కోరుతూ రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖ రాసింది. దీనిపైనా స్పందన లేకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న బోర్డు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్న యోచనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment