
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డిలు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్, కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) కార్యదర్శి స్వామినాథన్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం మేరకు నిధులు విడుదల చేయాలని విన్నవించారు. ఆ ధరల ప్రకారం నిధులు విడుదల చేస్తేనే.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా మండలి(టీఏసీ).. రివైజ్డ్ కాస్ట్ కమిటీ(ఆర్‌సీసీ)లు ఇప్పటికే ఆమోదించాయని గుర్తు చేశారు. భూసేకరణ చట్టం–2013 అమల్లోకి రావడంతో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్(సహాయ, పునరావాస) విభాగం వ్యయం పెరిగిందని.. దీనివల్ల అంచనా వ్యయం పెరిగిందని వివరించారు. దీనితో ఏకీభవించిన కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖల కార్యదర్శులు సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడంపై సానుకూలంగా స్పందించారు.
‘రాయలసీమ’పై సీడబ్ల్యూసీ చైర్మన్‌తో భేటీ..
ఇదిలా ఉండగా, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సీడబ్ల్యూసీ చైర్మన్ ఎస్కే హల్దర్, సీడబ్ల్యూసీ సభ్యులు(డబ్ల్యూపీ అండ్ పీ) కుశ్విందర్ ఓహ్రాలతో కూడా సమావేశమయ్యారు. ‘రాయలసీమ ఎత్తిపోతల’కు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన వాటా జలాలను వినియోగించుకుని, పాత ప్రాజెక్టుల కింద ఆయకట్టును స్థిరీకరించడానికే ఈ ఎత్తిపోతల చేపట్టామని వివరించారు. దీనితో ఏకీభవించిన సీడబ్ల్యూసీ చైర్మన్ హల్దర్.. విభజన చట్టం మేరకు కృష్ణా బోర్డుకు నివేదిక ఇవ్వాలని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అక్కర్లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కమిటీ ఇప్పటికే ఎన్జీటీ(జాతీయ హరిత న్యాయస్థానం)కి నివేదిక ఇవ్వడం తెలిసిందే. ఇదే అంశంపై గురువారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్‌ప్రసాద్ గుప్తాతో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అక్కర్లేదంటూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment