రేపట్నుంచి బోర్డు చేతుల్లోకి | Krishna Board is now in charge of Srisailam and Nagarjunasagar | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి బోర్డు చేతుల్లోకి

Published Wed, Oct 13 2021 1:54 AM | Last Updated on Wed, Oct 13 2021 9:44 AM

Krishna Board is now in charge of Srisailam and Nagarjunasagar - Sakshi

కృష్ణా బోర్డు సమావేశానికి వెళ్తున్న ఏపీ జలవనరుల శాఖ అధికారులు

సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు చరమగీతం పాడే దిశగా కృష్ణా బోర్డు చర్యలను వేగవంతం చేసింది. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను గురువారం నుంచి అమలు చేయడానికి సిద్ధమైంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై రేపటి నుంచి (గురువారం) ఇక కృష్ణా బోర్డుదే పెత్తనం. ఈ ప్రాజెక్టులతో పాటు వాటిపై ఉన్న 16 అవుట్‌లెట్లను కూడా పరిధిలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రెండు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. ఏపీ భూభాగంలోని ఆరు అవుట్‌లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు చెప్పారు.

తెలంగాణ భూభాగంలోని పది అవుట్‌లెట్లను స్వాధీనం చేయడంపై ప్రభుత్వంతో సంప్రదించి తెలియచేస్తామని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. 16 అవుట్‌లెట్లను స్వాధీనం చేస్తూ ఉత్తర్వులు ఇస్తే బోర్డు పరిధిలోకి తీసుకుని గురువారం నుంచే నిర్వహించడం ద్వారా గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు శ్రీకారం చుడతామని ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు పరిధి ఖరారు, కేంద్ర జల్‌ శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు అజెండాగా మంగళవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు ప్రత్యేకంగా సమావేశమైంది. ఏపీ తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. 
 
నోటిఫికేషన్‌ అమలు వాయిదా కుదరదు.. 
కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం కొత్త ట్రిబ్యునల్‌ నియమించాలని ఇప్పటికే కేంద్రం, కోర్టు ఎదుట ప్రతిపాదించామని, నీటి కేటాయింపులు తేలేదాక గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు వాయిదా వేయాలని తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ సమావేశం ప్రారంభం కాగానే కోరగా బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ తోసిపుచ్చారు. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశాక అమలును నిలుపుదల చేయలేమని తేల్చి చెప్పారు. 
 
పరిధిపై వాడిగా చర్చ.. 
కృష్ణా బోర్డు పరిధిపై సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. సుంకేశుల బ్యారేజీ, ఆర్డీఎస్‌ (రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) ఆనకట్ట, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఉన్న  30 అవుట్‌లెట్లను పరిధిలోకి తీసుకోవాలని సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదికను బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ సమావేశంలో ప్రవేశపెట్టారు. జలవిద్యుత్కేంద్రాలు మినహా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని రజత్‌కుమార్‌ చేసిన ప్రతిపాదనపై శ్యామలరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సీజన్‌ ప్రారంభంలో శ్రీశైలంలో కనీస నీటి మట్టానికి కంటే దిగువన, ఆపరేషన్‌ ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ తెలంగాణ సర్కార్‌  ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించడంపై గతంలోనే పలుదఫాలు ఫిర్యాదు చేశామని బోర్డుకు గుర్తు చేశారు.

తెలంగాణ సర్కార్‌ బోర్డు ఆదేశాలను ధిక్కరించి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడం వల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి వందల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయని తెలిపారు. దీనిపై రజత్‌కుమార్‌ స్పందిస్తూ తెలంగాణలో విద్యుత్‌ అవసరాలు తీవ్రంగా ఉన్నాయని, శ్రీశైలం పూర్తిగా హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు అయినందున విద్యుదుత్పత్తిని ఆపడం కుదరదని పేర్కొనడంపై శ్యామలరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దుందుడుకుగా విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితులను సృష్టిస్తుండటంపై  తాము ఫిర్యాదు చేశామని, ఆ పరిస్థితిని నివారించేందుకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందని గుర్తు చేశారు. 
 
తీర్మానానికి ఆమోదం 
రెండు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న అనంతరం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తి కేంద్రాలతోసహా అన్ని అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకుంటామని బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ ప్రకటించారు. శ్రీశైలంలో ఏడు, సాగర్‌లో తొమ్మిది వెరసి 16 అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకుంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా బోర్డులో సభ్యులైన రెండు రాష్ట్రాల అధికారులు ఆమోదించారు. ఈమేరకు ప్రాజెక్టులను బోర్డుకు స్వాధీనం చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని బోర్డు ఛైర్మన్‌ సూచించగా తక్షణమే జారీ చేస్తామని ఏపీ అధికారులు తెలిపారు. అవుట్‌లెట్లను బోర్డుకు స్వాధీనం చేయడంపై ప్రభుత్వంతో చర్చించి చెబుతామని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. 

 
మూణ్నెళ్ల తర్వాత పూర్తి స్థాయిలో స్వాధీనం.. 
బోర్డు పరిధిలోకి తీసుకున్న 16 అవుట్‌లెట్లను తాము జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా అందులో పనిచేస్తున్న రెండు రాష్ట్రాల అధికారులు నిర్వహించాలని బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ పేర్కొన్నారు. బోర్డులో ఏపీ, తెలంగాణ అధికారులు ఎంత మంది ఉండాలి? ఏ ప్రాజెక్టుల్లో ఎవరిని నియమించాలి? అనే అంశాన్ని మూడు నెలల్లోగా తేల్చి ప్రాజెక్టులను, కార్యాలయాలను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
 
స్పష్టత వచ్చాకే సీడ్‌ మనీ జమ.. 
కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు బోర్డు నిర్వహణకు ఒక్కో రాష్ట్రం ఒకేసారి రూ.200 కోట్ల చొప్పున బోర్డు ఖాతాలో జమ చేయాలని ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ రెండు రాష్ట్రాల అధికారులను కోరారు. ఒకేసారి సీడ్‌ మనీగా డిపాజిట్‌ చేసే రూ.200 కోట్ల వినియోగంపై గెజిట్‌ నోటిఫికేషన్‌లో స్పష్టత లేదని రెండు రాష్ట్రాల అధికారులు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని, ఆ తర్వాత అవసరాన్ని బట్టి నిధులు ఇస్తామని స్పష్టం చేశారు.  
 
తెలంగాణ విద్యుత్కేంద్రాలను స్వాధీనం చేసుకుంటేనే.. 
– జె.శ్యామలరావు, కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ 
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 16 అవుట్‌లెట్లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ సర్కార్‌ పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, నాగార్జునసాగర్‌ విద్యుత్కేంద్రాలను బోర్డుకు స్వాధీనం చేస్తేనే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల, కుడి గట్టు విద్యుత్కేంద్రాలను బోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేస్తాం. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రాలను బోర్డు స్వాధీనం చేసుకుంటేనే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం. లేదంటే గెజిట్‌ నోటిఫికేషన్‌కు అర్థం ఉండదు. 

విద్యుత్కేంద్రాల స్వాధీనంపై సర్కార్‌తో చర్చిస్తాం 
– రజత్‌కుమార్, తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  
శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, సాగర్‌ విద్యుత్కేంద్రాలతో సహా శ్రీశైలం, సాగర్‌లలో బోర్డు ప్రతిపాదించిన తెలంగాణ భూభాగంలోని పది అవుట్‌లెట్లను బోర్డుకు స్వాధీనం చేయడంపై సీఎం కె.చంద్రశేఖరావుతో చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తాం. తెలంగాణలో విద్యుత్‌ అవసరాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల మాకు జలవిద్యుదుత్పత్తి అత్యంత కీలకం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement