సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన కార్యాలయ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమగ్ర పరిశీలన చేయాలని చెప్పారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణ పరిస్థితులను సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటి నుంచి దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణ కోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్న దానిపై లెక్కలు తీయాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు. గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో కమిటీ ఏర్పాటు చేశాం.
► ఐఐటీ, జేఎన్‌టీయూ నిపుణుల కమిటీకి జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ చైర్మన్‌గా ఉన్నారు. తీసుకోవాల్సిన చర్యలను అత్యున్నత కమిటీకి తెలియజేస్తున్నారు.
► వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నత స్థాయి కమిటీ పరిశీలిస్తోంది. ఇటీవలి వరదలు, కుంభవృష్టిని పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు తగిన సూచనలు చేస్తుంది.
► ఆటోమేషన్ రియల్ టైం డేటాకు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపై కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన అత్యున్నత బృందం దృష్టి సారించింది.
► అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, వాటర్ రెగ్యులేషన్ కోసం సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
► పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తి, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టు ప్రాంతాలను గుర్తించే పని కూడా ఈ కమిటీ చేస్తోంది.
Andhra Pradesh: ప్రాజెక్టుల భద్రతకు ప్రత్యేక చర్యలు
Published Fri, Dec 10 2021 3:01 AM | Last Updated on Sat, Dec 11 2021 5:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment