సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాల్లో చౌర్యానికి అడ్డుకట్ట వేయడమే అజెండాగా ఈనెల 9న హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు నీళ్లను మళ్లించకుండా అడ్డుకట్ట వేసి.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని బోర్డు వర్గాలు తెలిపాయి. తుంగభద్ర జలాశయంలో కేసీ కెనాల్‌కు 10 టీఎంసీల కోటా ఉంది. నదిలో సహజ ప్రవాహం లేనప్పుడు, సుంకేశుల బ్యారేజీ వద్ద నీటి లభ్యత లేనప్పుడు.. ఈ కోటా నీటిని విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ ప్రతిపాదనలు పంపిస్తుంటుంది.
ఆ మేరకు తుంగభద్ర బోర్డు నీటిని విడుదల చేస్తుంది. తుంగభద్ర జలాశయం నుంచి ఆ నీళ్లు నదీ మార్గంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు చేరగానే.. వాటిని ఎడమ కాలువ ద్వారా కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు మళ్లిస్తున్నాయి. సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీళ్లను చౌర్యం చేస్తోంది. కృష్ణా బోర్డు జాయింట్ కమిటీ ఇటీవల క్షేత్ర స్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలచౌర్యం బయటపడింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఏపీ హక్కులకు భంగం కలుగుతుందని జాయింట్ కమిటీ తేల్చిచెబుతూ కృష్ణా బోర్డుకు నివేదిక ఇచ్చింది.
ఈ నివేదికను 9వ తేదీన నిర్వహించే బోర్డు సమావేశంలో చైర్మన్ ఎంపీ సింగ్ ప్రవేశపెట్టనున్నారు. జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు.. ఆర్డీఎస్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక అధికారులతో కూడిన జాయింట్ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించాలని ప్రతిపాదించనున్నారు. ఎడమ కాలువపై టెలీమీటర్లు ఏర్పాటు చేసి.. నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు లెక్కించాలని సూచించే అవకాశముంది. కోటాకు మించి వాడుకుంటే.. అదనంగా ఉపయోగించుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలో కలిపి.. కోత వేయనున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తిగా ఆపేయాలని స్పష్టం చేసే అవకాశముంది. వీటిపై సమావేశంలో మూడు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని.. తుది నిర్ణయం తీసుకోనున్నారు.
9న కృష్ణా బోర్డు భేటీ
Published Tue, Mar 8 2022 4:11 AM | Last Updated on Tue, Mar 8 2022 9:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment