దిగువ కాఫర్‌ డ్యామ్‌కు లైన్‌ క్లియర్‌ | Line clear to Polavaram lower cofferdam | Sakshi
Sakshi News home page

దిగువ కాఫర్‌ డ్యామ్‌కు లైన్‌ క్లియర్‌

Published Thu, Feb 24 2022 4:57 AM | Last Updated on Thu, Feb 24 2022 3:24 PM

Line clear to Polavaram lower cofferdam - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులకు మార్గం సుగమమైంది. ఈ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని బాగుచేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ రూపొందించిన డిజైన్‌ను డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) ఆమోదించింది. డీడీఆర్పీ నిర్ణయం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు పోలవరం పనులను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో గోదావరి వరదను మళ్లించే స్పిల్‌ వేను నిర్మించకుండానే.. ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) డయాఫ్రమ్‌ వాల్‌తోపాటు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. దీనిని మధ్యలోనే వదిలేసింది. దాంతో 2019, 2020లలో గోదావరి వరద ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాల ద్వారా ప్రవహించింది. వరద ఉద్ధృతికి దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 220 మీటర్ల పొడవు, 36 మీటర్ల లోతు వరకు కోతకు గురైంది. ఈ ప్రాంతం అభివృద్ధిపై బుధవారం డీడీఆర్పీ చైర్మన్‌ ఏబీ పాండ్య నేతృత్వంలో వర్చువల్‌ విధానంలో జరిగిన సమావేశంలో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్, రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

డయాఫ్రమ్‌ వాల్,జియోమెంబ్రేన్‌ బ్యాగ్‌లతో
కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి.. దాని పక్కన ఒక పొర ఇసుక, మరో పొర జియోమెంబ్రేన్‌ బ్యాగ్‌లు, మరో పొరను రాళ్లతో వేసి అభివృద్ధి చేసేలా జలవనరుల శాఖ రూపొందించిన డిజైన్‌కు డీడీఆర్పీ ఆమోదం తెలిపింది. డయాఫ్రమ్‌ వాల్, రాళ్లు, ఇసుక, జియోమెంబ్రేన్‌ బ్యాగ్‌లతో ఆ ప్రాంతాన్ని 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పూడ్చాలి. వాటిపై మరో 9.17 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి వేయాలి. దీంతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తవుతుంది. స్పిల్‌ వే నుంచి విడుదలైన గోదావరి జలాలు ఈసీఆర్‌ఎఫ్‌ వెనక్కి ఎగదన్నకుండా దిగువ కాఫర్‌ డ్యామ్‌ అడ్డుకుంటుంది. జూన్, 2021 నాటికే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయింది. దాంతో గోదావరి వరదల సమయంలోనూ ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణాన్ని చేపట్టి నిరంతరాయంగా పనులు పూర్తి చేయవచ్చు. 

డయాఫ్రమ్‌ వాల్‌ పటిష్టత తేలాకే
ఈసీఆర్‌ఎఫ్‌ పునాది అయిన డయాఫ్రమ్‌ వాల్‌ను ఎల్‌ అండ్‌ టీ, బావర్‌ సంస్థలు నిర్మించాయి. డయాఫ్రమ్‌ వాల్‌పై 2018, 2019, 2020 వరదల ప్రభావం పడింది. వరద ఉధృతి ప్రభావం వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ ఏమైనా దెబ్బతిందా? లేదా? అన్నది తేల్చాలని ఎల్‌ అండ్‌ టీ, బావర్‌ సంస్థను డీడీఆర్పీ ఆదేశించింది. ఆ రెండు సంస్థలు డయాఫ్రమ్‌ వాల్‌ పటిష్టతను పరీక్షించాయి. మరో వారంలో నివేదిక ఇస్తామని ఆ సంస్థలు తెలిపాయి. ఆ నివేదిక వచ్చాక ఈసీఆర్‌ఎఫ్‌ పనులపై తుది నిర్ణయం తీసుకుంటామని డీడీఆర్పీ చైర్మన్‌ ఏబీ పాండ్య చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement