
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు, తుపానుల ప్రభావంవల్ల సమృద్ధిగా వర్షాలు కురవడంతో భారీ, మధ్య, చిన్నతరహా నీటి ప్రాజెక్టులు నిండిన తరహాలోనే చెరువులు కూడా నిండిపోయాయి. చిన్న నీటిపారుదల విభాగం కింద ఉన్న 38,169 చెరువుల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 207.53 టీఎంసీలు కాగా.. శనివారం నాటికి 148.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ చెరువుల కింద 25,60,444 ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో చెరువుల కింద ఉన్న ఆయకట్టులో తొమ్మిది లక్షల ఎకరాలకు మించి పంటల సాగుచేసిన దాఖలాల్లేవు. వర్షాభావ పరిస్థితులవల్ల చెరువుల్లోకి వరద నీరు చేరకపోవడమే అందుకు కారణం. కానీ.. ఈ ఏడాది చెరువుల్లో రికార్డు స్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో ఆయకట్టులో పంటలు సాగుచేయడంలో రైతులు నిమగ్నమయ్యారు.
ఇక రాష్ట్రంలో సగటున 859.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 998.2 మి.మీలు కురిసింది. సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఏకంగా 60.9 శాతం అధిక వర్షపాతం కురిసింది. మిగిలిన 12 జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఇలా విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉరకలెత్తాయి. దాంతో ఎన్నడూ నీటిచుక్క చేరని చెరువులు కూడా నిండిపోయాయి. దాంతో ఆయకట్టు రైతుల్లో పండగ వాతావరణం నెలకొంది. నిల్వ సామర్థ్యంలో 50 శాతం కంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్న చెరువుల కింద ఆయకట్టులో పంటలకు జలవనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో భారీఎత్తున పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment