
పోలవరం పనులను పరిశీలిస్తున్న ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితర ఉన్నతాధికారులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే మీదుగా గోదావరి వరద మళ్లించే పనులు కొలిక్కివచ్చాయి. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాప్–3లో ప్రవాహం దిగువకు వెళ్లేందుకు వదిలిన ఖాళీ ప్రదేశాన్ని అధికారులు వేగంగా భర్తీచేయిస్తున్నారు. నది నుంచి స్పిల్ వే వైపు వరదను మళ్లించేందుకు వీలుగా అప్రోచ్ చానల్ తవ్వకం పనులను వేగవంతం చేశారు. స్పిల్ వే 10 రివర్ స్లూయిజ్ గేట్లను ఇప్పటికే పూర్తిగా ఎత్తివేసిన అధికారులు.. శుక్రవారం స్పిల్ వేకు అమర్చిన గేట్లను ఎత్తే పనులు ప్రారంభించారు. ఈ సీజన్‌లో గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి.. వరద సమయంలోను కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పనులు చేపట్టి 2022లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో 194.6 టీఎంసీలను నిల్వచేసే ప్రధాన డ్యామ్ ఈసీఆర్‌ఎఫ్‌ను నిర్మించాలంటే గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించాలి. ఇందుకు ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగున, దిగువన కాఫర్ డ్యామ్‌లను నిర్మిస్తున్నారు.
కాఫర్ డ్యామ్‌ల పనులు వేగవంతం
గోదావరి డెల్టాలో రబీ పంటలకు నీరు సరఫరా చేయడానికి వీలుగా ఎగువ కాఫర్ డ్యామ్ రీచ్–3లో 300 మీటర్ల ఖాళీ ప్రదేశాన్ని శుక్రవారం యుద్ధప్రాతిపదికన భర్తీచేశారు. జూన్ నెలాఖరుకు 38 మీటర్ల ఎత్తుకు, జూలై నెలాఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు ఎగువ కాఫర్ డ్యామ్, 30 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్ డ్యామ్ పూర్తిచేస్తామని సీఈ సుధాకర్‌బాబు తెలిపారు.
శరవేగంగా అప్రోచ్ చానల్ పనులు
నది నుంచి స్పిల్ వే వరకు 2.16 కిలోమీటర్ల పొడవున.. ప్రారంభంలో 500 మీటర్ల వెడల్పు, తర్వాత 550, 600, 650.. ఇలా స్పిల్ వే సమీపంలోకి వచ్చే సరికి 1,000 మీటర్లు వెడల్పు తవ్వేలా అప్రోచ్ చానల్ డిజైన్‌ను డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) ఆమోదించడంలో తీవ్ర జాప్యం చేసింది. నెలన్నర కిందట ఆమోదించడంతో అప్రోచ్ చానల్ తవ్వకం పనులు ప్రారంభించారు. అప్రోచ్ చానల్‌లో 1.16 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులకుగాను ఇప్పటికే 66 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తిచేశారు. జూన్ నెలాఖరుకు అప్రోచ్ చానల్ పనులు పూర్తవుతాయి. ఆలోగా స్పిల్ చానల్ కూడా సిద్ధమవుతుంది. గోదావరికి వచ్చే వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి, కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టి 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.
పనులను పరిశీలించిన ఈఎన్‌సీ నారాయణరెడ్డి
పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, కాఫర్ డ్యామ్, గేట్లు ఎత్తడం తదితర పనుల్ని శుక్రవారం ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట సీఈ ఎం.సుధాకర్‌బాబు, ఎస్‌ఈ కె.నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం ఎ.సతీష్‌బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మల్లికార్జునరావు, ఆదిరెడ్డి, బాలకృష్ణమూర్తి తదితరులున్నారు.
వరద మళ్లింపునకు స్పిల్ వే సిద్ధం
గోదావరి వరదను మళ్లించడానికి వీలుగా పోలవరం స్పిల్ వేను సిద్ధం చేస్తున్నారు. స్పిల్ వేకు ఇప్పటికే బిగించిన 10 రివర్ స్లూయిజ్ గేట్లను వరదను దిగువకు విడుదల చేయడానికి వీలుగా అధికారులు ఎత్తేశారు. ఇక స్పిల్ వేకు 48 గేట్లకుగాను 42 గేట్లను ఇప్పటికే బిగించారు. ఈ గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల చొప్పున 84 సిలిండర్లను బిగించారు. 2 గేట్లకు బిగించిన 4 హైడ్రాలిక్ సిలిండర్లను ఒక పవర్ ప్యాక్‌ను బిగించి, వాటిని కంట్రోల్ యూనిట్లతో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే 34 గేట్లకు పవర్ ప్యాక్‌లను బిగించి, వాటిని కంట్రోల్ యూనిట్లతో అనుసంధానం చేశారు. మిగిలిన గేట్లకు పవర్ ప్యాక్‌లను అమర్చుతూనే, ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధమైన గేట్లను వరదను దిగువకు విడుదల చేయడానికి 40 మీటర్లకు ఎత్తే పనులను శుక్రవారం ప్రారంభించారు. నెలాఖరునాటికి 42 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తేస్తామని అధికారులు తెలిపారు. జర్మనీలో కరోనా కట్టడికి సుదీర్ఘకాలం నుంచి లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో 12 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల దిగుమతిలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన 6 గేట్లను వచ్చే సీజన్‌లో అమర్చాలని అధికారులు నిర్ణయించారు.