
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్: పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన పాయతోపాటు.. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి పోటెత్తి ప్రవాహిస్తుండటంతో గోదావరిలో శనివారం వరద ఉధృతి పెరిగింది. తాలిపేరు ఉప్పొంగడంతో రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద 9,96,976 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. దాంతో భద్రాచలం వద్ద నీటి మట్టం 44.50 అడుగులకు చేరడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు 43 అడుగుల కంటే దిగువకు వరద మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఎగువన బేసిన్‌లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శనివారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌లోకి 5,15,460 క్యూసెక్కులు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్‌లోకి 7,20,120 క్యూసెక్కులు చేరుతుండగా.. సీతమ్మసాగర్‌లోకి 10,97,072 క్యూసెక్కులు చేరుతున్నాయి.
ఆ మూడు బ్యారేజ్‌లలోకి వస్తున్న నీటిని వస్తున్నట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. మరో 48 గంటలు బేసిన్‌లో ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం గోదావరిలో వరద ఉధృతి మరింతగా పెరగనుంది.
పోటెత్తిన శబరి
భద్రాచలం నుంచి దిగువకు వస్తున్న గోదావరి వరదకు శబరి ప్రవాహం తోడవడంతో పోలవరం వద్ద వరద ప్రవాహం 7,79,341 క్యూసెక్కులకు పెరిగింది. నీటి మట్టం 32.910 మీటర్లకు చేరుకుంది. దాంతో జల వనరుల శాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తూ, వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రాత్రి 9 గంటలకు నీటి మట్టం 12.30 అడుగులకు చేరింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టాకు 5,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 10,48,887 క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment