డయాఫ్రమ్‌వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్‌హెచ్‌పీసీ బృందం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో గోదావరి వరదలకు దెబ్బతిన్న పునాది డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలకు నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణుల బృందం శ్రీకారం చుట్టింది. పోలవరం ప్రాజెక్టు వద్ద బుధవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందకుమార్, సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తిలతో ఎన్‌హెచ్‌పీసీ ఈడీ ఎస్.ఎల్.కపిల్, సీనియర్ మేనేజర్లు ఎ.విపుల్ నాగర్, ఎన్.కె.పాండే, ఎం.పి.సింగ్ సమావేశమయ్యారు.
డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు హైరెజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్, సెస్మిక్ టోమోగ్రఫీ విధానాల్లో పరీక్షలు నిర్వహించడంపై చర్చించారు. తర్వాత గ్యాప్–2 డయాఫ్రమ్ వాల్‌పై ప్రతి మీటరుకు ఒకచోట 20 మిల్లీమీటర్ల (ఎంఎం) వ్యాసంతో 1.5 అడుగుల లోతువరకు జలవనరుల శాఖ అధికారులు వేసిన రంధ్రాల్లోకి ఎలక్ట్రోడ్‌లను అమర్చి హైరెజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్ విధానంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
ఈ పనులకు సమాంతరంగా డయాఫ్రమ్ వాల్‌కు ఒక మీటరు ఎగువన, ఒక మీటరు దిగువన 60 ఎంఎం వ్యాసంతో 30 నుంచి 40 అడుగుల లోతువరకు ప్రతి 40 మీటర్లకు ఒకటి చొప్పున తవ్విన బోరు బావుల్లోకి ఎలక్ట్రోడ్‌లను పంపి సెస్మిక్ టోమోగ్రఫీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గురువారం ప్రారంభించే ఈ పరీక్షలు పూర్తవడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఈ రెండు పరీక్షల ఫలితాలను విశ్లేషించడానికి కనీసం 30 రోజుల సమయం పడుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. మొత్తంమీద 45 రోజుల్లోగా డయాఫ్రమ్ వాల్ భవితవ్యం వెల్లడికానుందని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment