సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్‌లో కొద్దిమేర జారడం చిన్న సమస్యేనని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని నిపుణుల కమిటీ తేల్చింది. గైడ్ బండ్ ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణం కాదని, స్పిల్ వే మీదుగా వరద సులువుగా వెళ్లేలా చేయడానికి నిర్మించింది మాత్రమేనని స్పష్టంచేసింది. గోదావరికి సాధారణంగా ఆగస్టులో భారీ వరదలు వస్తాయని, ఆలోగా గైడ్‌బండ్‌కు తాత్కాలిక ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది.
తాత్కాలిక దిద్దుబాటు చర్యల ప్రతిపాదనను నాలుగు రోజుల్లోగా పంపితే.. దానిలో మార్పులుంటే చేసి సీడబ్ల్యూసీకి పంపి తక్షణమే ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రతిపాదన మేరకు జూలైలోగా గైడ్ బండ్ తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలు పరిమితికి లోబడే ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈ కమిటీ గురువారం పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. రాష్ట్ర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. శుక్రవారం రాజమహేంద్రవరంలో నిపుణుల కమిటీతో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ మరోసారి సమావేశమై.. గైడ్ బండ్‌ను పటిష్టం చేయడానికి తాత్కాలిక, శాశ్వత చర్యలపై చర్చించింది.
సీడబ్ల్యూసీకి వారంలో నివేదిక
గైడ్ బండ్‌లో కొంత భాగం కాస్త జారడానికి కారణాలపై రాష్ట్ర అధికారులతో నిపుణుల కమిటీ మేధోమథనం జరిపింది. నిపుణుల కమిటీలోని నలుగురు సభ్యులూ.. నాలుగు రకాల అభిప్రాయలు వెల్లడించటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో ఢిల్లీలో మరోసారి సమావేశమై గైడ్ బండ్ జారడానికి కారణాలపై వారంలోగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇస్తామని పాండ్య తెలిపారు.
తాత్కాలిక మరమ్మతుల ప్రతిపాదన ఇదీ
గైడ్ బండ్ ఎత్తు 51.32 మీటర్లు. పొడవు సుమారు 134 మీటర్లు. ఇందులో కొన్ని చోట్ల 3 మీటర్లు, కొన్ని చోట్ల ఆరు మీటర్ల మేర కాస్త జారింది. జారిన ప్రదేశాల్లో ఇప్పటికే పెద్ద రాళ్లు వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వాటిపైన మళ్లీ పెద్ద పెద్ద రాళ్లు వేసి వాటి మధ్య సిమెంటు మిశ్రమం (స్లర్రీ) పోయాలని నిపుణుల కమిటీ సూచించింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో గాబియన్లు వేయాలని పేర్కొంది. దీనివల్ల వరద ఉద్ధృతిని గైడ్ బండ్ సమర్థవంతంగా అడ్డుకుంటుందని తెలిపింది.
సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో మరోసారి అధ్యయనం
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా స్పిల్ వేకు ఎగువన ఏర్పడే సుడిగుండాలను నియంత్రించి, వరదను సులువుగా దిగువకు వెళ్లేలా చేయడానికి 2:1 నిష్పత్తిలో గైడ్ బండ్ నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. ఆ డిజైన్ ప్రకారమే గైడ్ బండ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొంతమేర జారడంతో సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో మరోసారి అధ్యయనం చేయించాలని నిపుణుల కమిటీ సూచించింది.
గైడ్ బండ్‌ను 3:1 నిష్పత్తిలో నిర్మిస్తే స్పిల్ వే వద్ద వరద ప్రవాహం ఎలా ఉంటుందో అధ్యయనం చేయించాలని పేర్కొంది. గైడ్ బండ్ నిర్మాణ ప్రాంతంలో వరద సమయంలో, వరద తగ్గాక మట్టిని సేకరించి, నాణ్యతపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్‌లో అధ్యయనం చేయించాలని పేర్కొంది. వాటి ఆధారంగా గైడ్ బండ్‌ను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే డిజైన్‌ను రూపొందిస్తామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment