
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్ పరిస్థితిని నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) వారు పరిశీలించిన అనంతరం వారి సూచనల మేరకు పనుల్లో ముందుకెళతామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన ఆదివారం పోలవరం ప్రాజెక్టు అప్పర్, లోయర్ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్, గ్యాప్–1 పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం గోదావరి నదికి వరద తగ్గుముఖం పట్టిందని, ఈ సీజన్‌లో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేపట్టాలని భావిస్తున్నామని, ఏజెన్సీ వారు సర్వసన్నద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉన్న ఇబ్బందల్లా డయాఫ్రమ్ వాల్ స్థితిగతులు తెలుసుకోవడమేనన్నారు. ఎన్‌హెచ్‌పీసీ వారు డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత వారి సూచనల మేరకే పనులు చేపట్టాల్సి ఉంటుందని, వారి సూచనలు లేకుండా పనులు చేపట్టలేమని స్పష్టం చేశారు.
వారు వచ్చి పరిశీలించడానికి డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నీటిలో మునిగి ఉందని, ఆ నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడుతున్నామని చెప్పారు. త్వరలోనే డయాఫ్రమ్ వాల్ స్థితిగతులు తెలుస్తాయని తెలిపారు. ప్రస్తుతం లోయర్ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించామన్నారు. మంత్రి వెంట జలవనరుల శాఖ ఎస్‌ఈ నరసింహమూర్తి, ఈఈ సుధాకర్, మెగా సంస్థ ప్రతినిధులు, అదికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment