శాంతిస్తున్న గోదారమ్మ | Godavari flood in sub-rivers is receding Andhra Pradesh | Sakshi
Sakshi News home page

శాంతిస్తున్న గోదారమ్మ

Published Mon, Jul 18 2022 3:13 AM | Last Updated on Mon, Jul 18 2022 3:13 AM

Godavari flood in sub-rivers is receding Andhra Pradesh - Sakshi

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు

సాక్షి, అమరావతి, పాడేరు/సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం, ఏలూరు: పరీవాహక ప్రాంతం(బేసిన్‌)లో వర్షాలు తెరపివ్వడం.. ఉప నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ శాంతిస్తోంది. ఉప నదులు ఉప్పొంగడంతో గోదారమ్మ విశ్వరూపం ప్రదర్శించటాన్ని చూసి చిగురుటాకుల్లా వణికిపోయిన ప్రజలకు ఇప్పుడు కాస్త ఊరట కలుగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వస్తున్న వరద ప్రవాహం 24,84,356 క్యూసెక్కులకు తగ్గడంతో నీటి మట్టం 21.10 అడుగులకు పడిపోయింది.

గోదావరి డెల్టాకు 9,500 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 24,74,856 క్యూసెక్కుల (213.87 టీఎంసీలు)ను బ్యారేజ్‌ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువన వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో సోమవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చే వరద క్రమేణ తగ్గనుంది. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాల్లో వర్షాలు తెరపినిచ్చాయి. దాంతో ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, కడెంవాగు, శబరి తదితరాలలో వరద తగ్గుముఖం పట్టింది.

ఇది గోదావరిలో వరద తగ్గుముఖం పట్టేలా చేస్తోంది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వచ్చే వరద 9.28 లక్షల క్యూసెక్కులకు, దానికి దిగువన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్‌లోకి వచ్చే వరద 9.45 లక్షల క్యూసెక్కులకు, ఆ బ్యారేజ్‌కు దిగువన సీతమ్మసాగర్‌లోకి వస్తున్న వరద 16.68 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు.

భద్రాచలంలో తగ్గుతున్న వరద మట్టం 
ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద వరద మట్టం తగ్గుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు 17,58,166 క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గడంతో భద్రాచలం వద్ద వరద మట్టం 59.40 అడుగులకు తగ్గింది. వరద మట్టం 53 అడుగులకు తగ్గే వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు.

సోమవారం వరద మట్టం 48 లేదా అంతకంటే దిగువకు చేరుకునే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద వరద మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరుకుంటేనే ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకుంటారు. మంగళవారానికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

పోలవరం వద్ద అప్రమత్తం 
పోలవరం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వచ్చే వరద గంట గంటకూ తగ్గుతోంది. అయినప్పటికీ సీఈ సుధాకర్‌ బాబు, ఎస్‌ఈ నరసింహ మూర్తి నేతృత్వంలో జల వనరుల శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోలవరంలోకి వచ్చే వరద ప్రవాహం 20,83,779 క్యూసెక్కులకు తగ్గింది. దాంతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటి మట్టం 38.29 మీటర్లకు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 27.54 మీటర్లకు తగ్గింది. సోమవారం పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహం 17 నుంచి 17.50 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉంది. 

వరద గండం గట్టెక్కినట్లే  
ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల గుండెలపై కుంపటి దిగినట్టయ్యింది. మరో రెండు రోజుల్లో అంటే మంగళవారం సాయంత్రానికి గోదావరి లంక గ్రామాలు ఊపిరి పీల్చుకునే అవకాశముంది. వారం రోజులుగా వీడని వరద ముంపుతో లంక గ్రామాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకుని వారికి బాసటగా నిలిచే దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపకదిన చర్యలు తీసుకుంది. మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో బాధితులకు సహాయం అందజేసేందుకు వెళుతున్న పడవ గోదావరిలో అదుపు తప్పి తిరగబడింది. వీఆర్వో లక్ష్మితో పాటు వీఆర్‌ఏలు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

లంక గ్రామాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుతో పాటు సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, జోగి రమేష్, గుడివాడ అమర్‌నాథ్‌లు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొంటున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమితులైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు మురళీధర్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌లు ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలిస్తున్నారు.

ముంపు గ్రామాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవలు కొనసాగుతున్నాయి. బోట్లపై రాకపోకలు సాగించే వారికి సాయం చేస్తున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేయడంలో వలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వరద ఉధృతితో రాజమహేంద్రవరం రోడ్డు వంతెనలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. 

నిత్యావసర సరుకుల పంపిణీ వేగవంతం
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. 3, 5, 6, 9, 16 బెటాలియన్లకు చెందిన 10 బృందాల్లోని 356 మంది సిబ్బంది రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం వరద ముంపు జిల్లాల్లోని 950 మంది బాధితులను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వీరిలో పలువురు గర్భిణులు, వృద్ధులు ఉన్నారు. లంక ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, నీరు, కొవ్వొత్తులను పంపిణీ చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు, పశ్చిమగోదావరిలో ఆచంట, నర్సాపురం, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఏలూరు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ వేలేరుపాడు మండలంలో పర్యటించారు. పోలవరం ముంపు మండలాల్లోని 61 గ్రామాల్లో 18,707 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆచంట మండలంలోని లంక గ్రామాల్లో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రతిరోజు వెయ్యి మందికి తన సొంత నిధులతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపురం పట్టణం, మండలంలో చీఫ్‌ విప్, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు వరద తీవ్రతను పరిశీలించారు.

విలీన మండలాల్లో వరద నీరు కాస్త తగ్గడంతో అధికార యంత్రాంగం, స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చింతూరు నుంచి ముంపు గ్రామాలకు లాంచీల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసర సరకుల రవాణాను వేగవంతం చేశారు. అంటు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నెల్లిపాక వీఆర్‌వో కట్టం వెంకటేశ్వర్లు, విస్సాపురం వీఆర్‌వో ముచ్చిక వీర్రాజులపై జేసీ సూరజ్‌ గనోరే చర్యలకు ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement