సాక్షి, అమరావతి: పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాలువ సామర్థ్యం పెంపు ద్వారా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, పల్నాడుకు తరలించి సుభిక్షం చేయాలని నిర్ణయించారు. పోలవరం కుడి కాలువను వెడల్పు చేయడం ద్వారా 50 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి తరలింపు పనులపై సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో జలవనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
కాలువ కుడి వైపు విస్తరణ..
► ప్రస్తుతం పోలవరం కుడి కాలువ వెడల్పు 85.5 మీటర్లు కాగా లోతు 5 మీటర్లు, ప్రవాహ సామర్థ్యం 17,633 క్యూసెక్కులు ఉంది. కాలువ పొడవు 174 కి.మీ. కాగా కుడి కాలువ కింద 3.2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 2004లో దివంగత వైఎస్సార్ హయాంలో పనులు చేపట్టారు.
► కుడి కాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచాలంటే కాలువను 181 మీటర్లు వెడల్పు చేయడంతోపాటు లోతును ఆరు మీటర్లకు పెంచాలని అధికారులు ప్రతిపాదించారు.
► కాలువ కుడి వైపున 95.5 మీటర్లు విస్తరించడం ద్వారా 181 మీటర్లకు వెడల్పు చేయవచ్చు. ఈ పనులు చేపట్టేందుకు కొత్తగా 1,757 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.
► కాలువను వెడల్పు చేయడం, లోతు పెంచడంతోపాటు లైనింగ్ పనులకు సుమారు రూ.12,100 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు.
జంట సొరంగాల సామర్థ్యమూ పెంపు..
► పోలవరం ప్రాజెక్టును కుడి కాలువకు అనుసంధానం చేసే కనెక్టివిటీలో జంట సొరంగాల సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వివరించారు.
► జలవనరుల శాఖ అధికారుల ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
► ప్రకాశం బ్యారేజీకి గ్రావిటీ ద్వారా తరలించే 50 వేల క్యూసెక్కులను నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి కాలువ, పల్నాడు, వెలిగొండ ప్రాజెక్టు ఆయకట్టు, రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొంచాలని ఆదేశించారు.
సమగ్ర నీటిపారుదల అభివృద్ధిలో భాగంగా పనులు..
సమగ్ర నీటిపారుదల అభివృద్ధి పథకంలో భాగంగా పోలవరం కుడి కాలువ విస్తరణ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన రూ.12,827 కోట్లను సమకూర్చుకుని సకాలంలో పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐడీసీఎల్)ను స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఏర్పాటు చేసింది. ఎస్పీవీ నేతృత్వంలో పనులు చేపట్టాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment