‘సీమ’ ఎత్తిపోతల టెండర్లకు గ్రీన్‌సిగ్నల్‌! | Department of Water Resources is preparing for tender notification on July 27th | Sakshi
Sakshi News home page

‘సీమ’ ఎత్తిపోతల టెండర్లకు గ్రీన్‌సిగ్నల్‌!

Published Sat, Jul 25 2020 3:41 AM | Last Updated on Sat, Jul 25 2020 8:55 AM

Department of Water Resources is preparing for tender notification on July 27th - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన కృష్ణా జలాల్లో వాటాను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల (ఆర్‌ఎస్సైఎల్‌) పథకం టెండర్‌ ప్రతిపాదనలకు జ్యుడీషియల్‌ ప్రివ్యూ ఆమోద ప్రక్రియ శుక్రవారం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. ఈ పనులకు సోమవారం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పనులకు రూ.3,825 కోట్ల అంచనా వ్యయంతో మే 5న రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వగా రూ.3,278.18 కోట్లతో ఈపీసీ(ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో 30 నెలల్లో పనులు పూర్తి చేయాలనే గడువుతో టెండర్లకు సిద్ధమైంది. 

కాగితాల్లో కేటాయింపులున్నా నీళ్లేవి?
► శ్రీశైలం జలాశయంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌(పీహెచ్‌పీ) నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు 114 టీఎంసీలు సరఫరా చేయాల్సి ఉండగా 2018–19, 2019–20ల్లో మినహా ఏనాడూ కేటాయింపుల మేరకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది.  
► శ్రీశైలంలో 854 అడుగుల కంటే నీటిమట్టం తగ్గితే పీహెచ్‌పీ ద్వారా నీళ్లందవు. దీంతో కృష్ణా బోర్డు నీటి కేటాయింపులున్నా సరే వినియోగించుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. 
► శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల (243 మీటర్లు) నుంచి రోజుకు మూడు టీఎంసీల (34,722 క్యూసెక్కులు) చొప్పున ఎత్తిపోసి  పీహెచ్‌పీకి దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కి.మీ. వద్దకు తరలించి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు నీళ్లందించడం ద్వారా సాగు, తాగునీటి కష్టాలను కడతేర్చాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.

రాయలసీమ ఎత్తిపోతల ఇదీ..
► శ్రీశైలం జలాశయం జలవిస్తరణ ప్రాంతంలో సంగమేశ్వరం వద్ద ఉప నది అయిన తుంగభద్ర కృష్ణా నదిలో కలుస్తుంది. సంగమేశ్వరం వద్ద శ్రీశైలంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉంటుంది.
► సంగమేశ్వరం నుంచి ఒక్కో పంప్‌ 81.93 క్యూమెక్కులు (2,893.5 క్యూసెక్కులు) చొప్పున 12 పంప్‌ల ద్వారా 34,722 క్యూసెక్కులను 39.60 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేలా పంప్‌ హౌస్‌ను నిర్మిస్తారు.  అక్కడి నుంచి ముచ్చుమర్రి వరకు జలాశయంలో 4.5 కి.మీ. పొడవున అప్రోచ్‌ కెనాల్‌ తవ్వుతారు.
► సంగమేశ్వరం పంప్‌ హౌస్‌ ద్వారా ఎత్తిపోసిన నీటిని 125 మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైపు లైన్‌(ప్రెజర్‌ మైన్‌) ద్వారా తరలించి డెలివరీ సిస్ట్రన్‌లో పోస్తారు. అక్కడి నుంచి 22 కి.మీ. పొడవున కాలువ తవ్వి పీహెచ్‌పీకి దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కి.మీ. వద్దకు తరలిస్తారు.
► ఈ నీటిని బనకచర్ల క్రాస్‌ రెగ్యులేట్‌ కాంప్లెక్స్‌ వద్దకు తరలించి ఎడమ వైపు కాలువ ద్వారా తెలుగుగంగ ప్రాజెక్టుకు, మధ్యలో కాలువ ద్వారా కేసీ కెనాల్‌కు.. కుడి వైపు కాలువ ద్వారా ఎస్సార్బీసీ, గాలేరు–నగరికి సరఫరా చేస్తారు.
► నీటిని ఎత్తిపోయడానికి ఒక పంప్‌నకు 33.04 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. 12 పంప్‌లకు 396.48 మెగావాట్ల విద్యుత్‌ కావాలి. ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్తు వినియోగించి ఒక కేంద్రం నుంచి ఇంత భారీగా నీటిని ఎత్తిపోయడం రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా లేదు. 
► సంగమేశ్వరం పంప్‌ హౌస్, పైపు లైన్, డెలివరీ సిస్ట్రన్, 22 కి.మీ. పొడవున కాలువ తవ్వకం కోసం 1,200 ఎకరాల భూమి సేకరించాలని అంచనా వేశారు.

సీమకిచ్చే నీళ్లకంటే సముద్రంలో కలిసేవే ఎక్కువ
► శ్రీశైలం నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సరఫరా చేస్తున్న కృష్ణా జలాల కంటే ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్న జలాలే అధికం. ఈ నీటిని ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో పీహెచ్‌పీ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు.
► శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల మేర ఉన్నప్పుడే పీహెచ్‌పీ ద్వారా ప్రస్తుతం ఉన్న డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కులను తరలించవచ్చు. అయితే ఆ మేరకు శ్రీశైలం నీటి మట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

దుర్భిక్ష ప్రాంతాలకు వరదాయిని
‘శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటేనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు కనీసం ఏడు వేల క్యూసెక్కులైనా నీళ్లందుతాయి. కానీ 800 అడుగుల నుంచి తెలంగాణ సర్కార్‌ నీటిని తరలిస్తుండటం వల్ల జలాశయంలో నీటి మట్టం మెయింటెయిన్‌ చేయడం కష్టమవుతోంది. కృష్ణా బోర్డు కేటాయింపులు ఉన్నా సరే నీళ్లందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మన వాటా నీటిని వినియోగించుకుని సాగు, తాగునీటి కష్టాలను అధిగమించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇది దుర్భిక్ష ప్రాంతాలకు కల్పతరువు’ – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement