ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే తోటపల్లి బ్యారేజీ పనులు వేగం పుంజుకోనున్నాయి. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి బ్యారేజీ కింద ఆయకట్టంతటికీ నీళ్లు అందించాలని సర్కార్ నిర్ణయించింది. బ్యారేజీ కింద పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 1.20 లక్షల ఎకరాలు, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద 15 వేల ఎకరాలు వెరసి 1.99 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖను ఆదేశించింది. దీంతో పదేళ్లుగా పనులు చేయకుండా మొండికేస్తున్న కాంట్రాక్టర్లపై వేటేసిన అధికారులు.. కొత్తగా టెండర్ పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే సీజన్ నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీళ్లందించడానికి ప్రణాళిక రచించారు.
విజయనగరం జిల్లాలో తోటపల్లి వద్ద నాగావళిపై 1908లో బ్రిటిష్ సర్కార్ రెగ్యులేటర్‌ను నిర్మించింది. దీని కింద శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 64 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రెగ్యులేటర్ శిథిలావస్థకు చేరుకోవడంతో నాగావళి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకుని ఈ రెండు జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్సార్ పాత రెగ్యులేటర్‌కు ఎగువన 2.509 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా కుడి కాలువ ద్వారా 1.20 లక్షల ఎకరాలు, కుడి కాలువలో 97.7 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల మేర గజపతినగరం బ్రాంచ్ కాలువ తవ్వడం ద్వారా 15 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. 2009 నాటికే తోటపల్లి బ్యారేజీ పనులు పూర్తయినా పాత, కొత్త ఆయకట్టులో 1.24 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రస్తుతం నీళ్లందుతున్నాయి. కుడి కాలువలో మిగిలిన పనులు పూర్తి కాకపోవడంతో 40 వేల ఎకరాలకు నీళ్లందని దుస్థితి. 2 ప్యాకేజీల కాంట్రాక్టర్లు పనులు చేయకుండా మొండికేస్తుండటంతో ప్రభుత్వం వేటేసింది. మిగిలిన పనులకు రూ.124.23కోట్లతో జలవనరుల శాఖకు అధికారులు ప్రతిపాదనలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment