Thotapalli Reservoir
-
ప్రాధాన్యతగా ‘తోటపల్లి’
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన తోటపల్లి బ్యారేజ్ కింద ఆయకట్టులోని మొత్తం 2 లక్షల ఎకరాలకు నీళ్లందించి, రైతులకు జలయజ్ఞ ఫలాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా బ్యారేజ్‌లో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు 2.51 టీఎంసీలను నిల్వ చేయడం, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల (పిల్ల కాలువలు)లో మిగిలిన పనులను పూర్తి చేయడం ద్వారా జలయజ్ఞం ఫలాలను ఆయకట్టు రైతులందరికీ అందించనుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళి నదిపై 1908లో బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటర్‌ను నిర్మించింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 64 వేల ఎకరాలకు నీళ్లందించేలా కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఆ రెగ్యులేటర్ శిథిలావస్థకు చేరడంతో నాగావళి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకుని అదనంగా 1,36,191 ఎకరాలకు నీళ్లందించేలా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి బ్యారేజ్ పనులను చేపట్టారు. 2,151 నిర్వాసితుల కుటుంబాలకు పునరావాసం బ్యారేజ్‌లో పార్వతీపురం మన్యం జిల్లాలోని 20 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 5,629 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇప్పటిదాకా 13 గ్రామాల్లోని 3,478 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. దాంతో బ్యారేజ్‌లో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిగతా ఏడు గ్రామాల్లోని 2,151 కుటుంబాలకు పునరావాసం కల్పించి బ్యారేజ్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలని అక్టోబర్ 21న నిర్వహించిన సమీక్షలో జల వనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బ్యారేజ్‌లో ముంపునకు గురయ్యే భూమితోపాటు ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అవసరమైన 291.12 ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన సేకరించాలని ఆదేశించారు. బ్యారేజ్ కుడి కాలువలో అంతర్భాగమైన గజపతినగరం బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి అవసరమైన 219.31 ఎకరాలను సేకరించాలని దిశానిర్దేశం చేశారు. దాంతో నిర్వాసితుల పునరావాసం, భూసేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయకట్టంతటికీ సాగు నీరు తోటపల్లి బ్యారేజ్ కింద పాత ఆయకట్టు 64 వేల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. కొత్తగా కుడి, ఎడమ కాలువల కింద సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. మిగతా 50 వేల ఎకరాలకు నీళ్లందించాలంటే కుడి, ఎడమ కాలువల్లో, డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలి. కుడి కాలువలో 0 నుంచి 117.89 కిలోమీటర్ల వరకు 15,07,679 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 17 కాంక్రీట్ నిర్మాణాలు, 88,636 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉంది. రూ. 123.21 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించారు. 97.70 కి.మీ నుంచి 25 కిలోమీటర్ల గజపతినగరం బ్రాంచ్ కెనాల్‌ను తవ్వి 15 వేల ఎకరాలకు నీళ్లందించనున్నారు. ఈ పనుల్లో 2,67,847 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 30 నిర్మాణాలు, 40 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలింది. ఈ పనులను రూ.137.8 కోట్లతో చేపట్టారు. ఖరీఫ్ పంట కోతలు పూర్తవగానే ఈ పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. -
బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, విజయనగరం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు బొబ్బిలికి చెందిన రాకేష్, కురుపాంకు చెందిన బాలికగా పోలీసులు భావిస్తున్నారు. తమ చావుకు తన బావ మౌళి అనే వ్యక్తే కారణమంటూ ఆ బాలిక వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లు తెలిసింది. బ్యారేజీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: తిరుపతి: వివాహిత హత్య కేసులో పురోగతి.. ఆన్లైన్ క్లాస్‌లోకి హ్యాకర్.. పోర్న్ వీడియోలతో రచ్చ -
వేగంగా తోటపల్లి బ్యారేజీ పనులు
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే తోటపల్లి బ్యారేజీ పనులు వేగం పుంజుకోనున్నాయి. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి బ్యారేజీ కింద ఆయకట్టంతటికీ నీళ్లు అందించాలని సర్కార్ నిర్ణయించింది. బ్యారేజీ కింద పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 1.20 లక్షల ఎకరాలు, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద 15 వేల ఎకరాలు వెరసి 1.99 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖను ఆదేశించింది. దీంతో పదేళ్లుగా పనులు చేయకుండా మొండికేస్తున్న కాంట్రాక్టర్లపై వేటేసిన అధికారులు.. కొత్తగా టెండర్ పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే సీజన్ నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీళ్లందించడానికి ప్రణాళిక రచించారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి వద్ద నాగావళిపై 1908లో బ్రిటిష్ సర్కార్ రెగ్యులేటర్‌ను నిర్మించింది. దీని కింద శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 64 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రెగ్యులేటర్ శిథిలావస్థకు చేరుకోవడంతో నాగావళి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకుని ఈ రెండు జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్సార్ పాత రెగ్యులేటర్‌కు ఎగువన 2.509 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా కుడి కాలువ ద్వారా 1.20 లక్షల ఎకరాలు, కుడి కాలువలో 97.7 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల మేర గజపతినగరం బ్రాంచ్ కాలువ తవ్వడం ద్వారా 15 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. 2009 నాటికే తోటపల్లి బ్యారేజీ పనులు పూర్తయినా పాత, కొత్త ఆయకట్టులో 1.24 లక్షల ఎకరాలకు మాత్రమే ప్రస్తుతం నీళ్లందుతున్నాయి. కుడి కాలువలో మిగిలిన పనులు పూర్తి కాకపోవడంతో 40 వేల ఎకరాలకు నీళ్లందని దుస్థితి. 2 ప్యాకేజీల కాంట్రాక్టర్లు పనులు చేయకుండా మొండికేస్తుండటంతో ప్రభుత్వం వేటేసింది. మిగిలిన పనులకు రూ.124.23కోట్లతో జలవనరుల శాఖకు అధికారులు ప్రతిపాదనలిచ్చారు. -
'అందుకే తోటపల్లి రద్దు చేశాం'
కరీంనగర్ : తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం కరీంనగర్లో స్పందించారు. ఖర్చు అధికం ప్రయోజనం స్వల్పం కాబట్టే తోటపల్లి రిజర్వాయర్‌ను తమ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన భూములను తిరిగి రైతులకే అప్పగిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తోటపల్లి చెరువును రూ. 30 కోట్లతో అభివృద్ధి చేస్తామని హారీశ్ రావు వెల్లడించారు. -
'తోటపల్లి'పై తొండాట
ఎవరిని అడిగి రద్దు చేశారు మంత్రి హరీశ్‌పై చాడ ధ్వజం నాగర్‌కర్నూల్: తోటపల్లి రిజర్వాయర్‌కు సీపీఐ వ్యతిరేకమంటూ మంత్రి హరీశ్‌రావు వక్రీకరిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం నాగర్‌కర్నూలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై ప్రభుత్వం తొండాట ఆడుతోందని విమర్శించారు. 1600 ఎకరాల భూమిని సేకరించిన అనంతరం ఇప్పుడు రిజర్వాయర్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అసలు ఎవరితో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు తమ నియోజకవర్గాలకు నీళ్లు తీసుకెళ్లేందుకే రద్దు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. గతంలో తోటపల్లి రిజర్వాయర్ కంటే సింగరాయ్కొండ ప్రాజెక్టు నిర్మిస్తే ముంపు తగ్గుతుందన్న అక్కడి ప్రజల నిర్ణయాన్ని అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య దృష్టికి తీసుకెళ్లామని, ఆ అవకాశాలు లేకపోవడంతో అప్పటి ప్రభుత్వం తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయించుకుందని చెప్పారు. ఈ విషయంలో రైతులతో మాట్లాడి భూసేకరణకు సీపీఐ రైతులను ఒప్పించిందన్నారు. కానీ మంత్రి హరీశ్‌రావు తోటపల్లి రిజర్వాయర్‌కు సీపీఐ వ్యతిరేకమంటూ దుష్ర్పచారం చేయడం తగదన్నారు. రూ.380 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.1600 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారని.. ఈ విషయంలో ఇంజనీర్లతో చర్చించేందుకు సిద్ధమన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ప్రజల తరపున మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు రాసిన లేఖను చూపించారు. గద్దర్ త్వరలో నిర్ణయం వెల్లడిస్తారు వరంగల్ ఎంపీ స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా పోటీలో ఉండాలని గద్దర్‌కు విజ్ఞప్తి చేశామని.. దీనిపై ఆయన త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తారని చాడ అన్నారు.