ప్రాధాన్యతగా ‘తోటపల్లి’  | CM Jagan decision to irrigate 2 lakh acres with Thotapalli Barrage | Sakshi
Sakshi News home page

ప్రాధాన్యతగా ‘తోటపల్లి’ 

Published Tue, Nov 1 2022 3:35 AM | Last Updated on Tue, Nov 1 2022 3:35 AM

CM Jagan decision to irrigate 2 lakh acres with Thotapalli Barrage - Sakshi

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన తోటపల్లి బ్యారేజ్‌ కింద ఆయకట్టులోని మొత్తం 2 లక్షల ఎకరాలకు నీళ్లందించి, రైతులకు జలయజ్ఞ ఫలాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా చేపట్టింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా బ్యారేజ్‌లో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు 2.51 టీఎంసీలను నిల్వ చేయడం, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల (పిల్ల కాలువలు)లో మిగిలిన పనులను పూర్తి చేయడం ద్వారా జలయజ్ఞం ఫలాలను ఆయకట్టు రైతులందరికీ అందించనుంది.

పార్వతీపురం మన్యం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళి నదిపై 1908లో బ్రిటిష్‌ ప్రభుత్వం రెగ్యులేటర్‌ను నిర్మించింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 64 వేల ఎకరాలకు నీళ్లందించేలా కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఆ రెగ్యులేటర్‌ శిథిలావస్థకు చేరడంతో నాగావళి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకుని అదనంగా 1,36,191 ఎకరాలకు నీళ్లందించేలా 2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి బ్యారేజ్‌ పనులను చేపట్టారు. 

2,151 నిర్వాసితుల కుటుంబాలకు పునరావాసం 
బ్యారేజ్‌లో పార్వతీపురం మన్యం జిల్లాలోని 20 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 5,629 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇప్పటిదాకా 13 గ్రామాల్లోని 3,478 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. దాంతో బ్యారేజ్‌లో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిగతా ఏడు గ్రామాల్లోని 2,151 కుటుంబాలకు పునరావాసం కల్పించి బ్యారేజ్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలని అక్టోబర్‌ 21న నిర్వహించిన సమీక్షలో జల వనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

బ్యారేజ్‌లో ముంపునకు గురయ్యే భూమితోపాటు ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అవసరమైన 291.12 ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన సేకరించాలని ఆదేశించారు. బ్యారేజ్‌ కుడి కాలువలో అంతర్భాగమైన గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌ నిర్మాణానికి అవసరమైన 219.31 ఎకరాలను సేకరించాలని దిశానిర్దేశం చేశారు. దాంతో నిర్వాసితుల పునరావాసం, భూసేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. 

ఆయకట్టంతటికీ సాగు నీరు 
తోటపల్లి బ్యారేజ్‌ కింద పాత ఆయకట్టు 64 వేల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. కొత్తగా కుడి, ఎడమ కాలువల కింద సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. మిగతా 50 వేల ఎకరాలకు నీళ్లందించాలంటే కుడి, ఎడమ కాలువల్లో, డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలి. కుడి కాలువలో 0 నుంచి 117.89 కిలోమీటర్ల వరకు 15,07,679 క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 17 కాంక్రీట్‌ నిర్మాణాలు, 88,636 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని మిగిలి ఉంది. రూ. 123.21 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించారు.

97.70 కి.మీ నుంచి 25 కిలోమీటర్ల గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌ను తవ్వి 15 వేల ఎకరాలకు నీళ్లందించనున్నారు. ఈ పనుల్లో 2,67,847 క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 30 నిర్మాణాలు, 40 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని మిగిలింది. ఈ పనులను రూ.137.8 కోట్లతో చేపట్టారు. ఖరీఫ్‌ పంట కోతలు పూర్తవగానే ఈ పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement