ఊడిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు పెట్టడానికి జరుగుతున్న పనులు
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/అచ్చంపేట (పెదకూరపాడు): పులిచింతల ప్రాజెక్టులో ఎడమ వైపున ట్రూనియన్ బీమ్ విరిగిపోవడం వల్ల ఊడిపోయిన 16వ గేటు స్థానంలో యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటును అమర్చేందుకు జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్టాప్ లాగ్ గేటును దించేందుకు ముందస్తుగా చేపట్టాల్సిన పనులను ప్రాజెక్టు ఎస్‌ఈ రమేష్ పర్యవేక్షణలో బీకెమ్ సంస్థ నిపుణులు శుక్రవారం పూర్తి చేశారు. శనివారానికి ప్రాజెక్టులో నీటిమట్టం క్రస్ట్ లెవల్ (గేట్లు అమర్చే స్థాయి)కు చేరగానే.. స్టాప్ లాగ్ గేటును దించుతామని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ గేటును 11 ఎలిమెంట్స్(భాగాలు)గా కిందికి దించుతారు. ఊడిపోయిన 16వ గేటు వెనుక భాగంలో పియర్స్‌కు అమర్చిన రెయిలింగ్ ద్వారా 17 మీటర్ల వెడల్పు, సుమారు 1.68 మీటర్ల పొడవు గల 28 టన్నుల ఎలిమెంట్‌ను తొలుత దించుతారు. దానిపై అంతే వెడల్పు, ఎత్తుతో కూడిన 26 టన్నుల బరువైన ఎలిమెంట్ దించుతారు. వాటికి ముందే అమర్చిన రబ్బర్ సీల్స్‌తో ఆ రెండు ఎలిమెంట్లను అతికిస్తారు. ఇలా 11 ఎలిమెంట్లను ఒక దానిపై ఒకటి దించి.. అతికించడం ద్వారా 18.5 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేస్తారు. ఈ గేటు బరువు సుమారు 240 టన్నుల బరువు ఉంటుంది. పూర్తి స్థాయి గేటు ఎత్తు, వెడల్పు స్థాయిలో ఈ స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేయడం ద్వారా జలాశయంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేస్తారు.
నేడు క్రస్ట్ లెవల్ స్థాయికి నీటి మట్టం
పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం రాత్రి 8 గంటలకు 40.9 మీటర్ల స్థాయిలో 7.7142 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 31,825 క్యూసెక్కులు చేరుతుండగా.. 17 గేట్లను 6 మీటర్లు, ఒక గేటును 2.5 మీటర్ల మేర తెరిచి 2,44,406 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇదే రీతిలో దిగువకు నీటిని విడుదల చేస్తే శనివారం ఉదయానికి ప్రాజెక్టులో నీటి నిల్వ క్రస్ట్ లెవల్ 36.34 మీటర్లకు చేరుతుంది. అప్పుడు ప్రాజెక్టులో 3.61 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది. ఎగువ నుంచి స్థిరంగా 31 వేల క్యూసెక్కుల వరద వచ్చినా.. సులభంగా స్టాప్ లాగ్ గేటును దించుతామని అధికార వర్గాలు తెలిపాయి. స్టాప్ లాగ్ గేటును దించే ప్రక్రియ శనివారం సాయంత్రానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశాయి.
పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ లాగ్ గేటు పెట్టడానికి జరుగుతున్న పనులు
ఆ నివేదికను టీడీపీ బుట్టదాఖలు చేయడంతోనే..
ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడానికి ముందు 2015లో జనవరి 5న స్పెషల్ డ్యామ్ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ టీమ్ (ఎస్‌డీఎస్‌ఐటీ) ఇచ్చిన నివేదికను అప్పటి టీడీపీ సర్కార్ బుట్టదాఖలు చేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టులో నీటిని ఖాళీ చేసినా.. కొద్ది రోజుల్లోనే పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుండగా.. ప్రాజెక్టుపై ఈ నెల 8, 9 తేదీలలో వాహనాలు, ప్రజల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు తహసీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రాజెక్ట్ వద్ద 144వ సెక్షన్ విధిస్తున్నట్టు తెలిపారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు : మంత్రి పేర్ని నాని
పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం వెనుక ఎవరైనా కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఈ ప్రాజెక్టు గేట్లను 2013–14లో అమర్చారని గుర్తు చేశారు. వెలగపూడిలో సచివాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో పులిచింతల ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయిన విషయంపై చర్చించామన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో హైడ్రాలిక్ గేట్లు అమర్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారని తెలిపారు.
యోక్ గడ్డర్ లోపం వల్లే...
పులిచింతల నుంచి వరదను దిగువకు విడుదల చేసేందుకు 16వ గేటును ఎత్తే సమయంలో ఎడమ ట్రూనియన్ బీమ్‌లో గేటును అనుసంధానం చేసిన యోక్ గడ్డర్‌లో 25 మిల్లీమీటర్ల మందంతో కూడిన రేకు(ఇనుప ప్లేట్)పై అధిక ఒత్తిడి పడి చితికిపోయింది. దాంతో యోక్ గడ్డర్ విరిగిపోయింది. దీనివల్ల ట్రూనియన్ బీమ్ పగిలిపోవడంతో గేటు ఊడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిందని జల వనరుల శాఖ అధికారులు, బీకెమ్ సంస్థ నిపుణులు తేల్చారు. ఇక్కడున్న ఒక్కో గేటు బరువు 250 టన్నులు. రెండు పియర్ల(కాంక్రీట్ దిమ్మెల) మధ్య ట్రూనియన్ బీమ్‌లకు అమర్చిన యాంకర్‌లో యోక్ గడ్డర్‌లను ఆర్మ్ గడ్డర్లతో అనుసంధానం చేయడం ద్వారా గేట్లను బిగిస్తారు. వరద ఉధృతి వల్ల 1,500 టన్నుల భారం పడినా.. గేట్లను సులభంగా ఎత్తేలా వాటిని అమర్చారు. గేటు ఎత్తే సమయంలో 2,500 టన్నుల భారం పడినా యోక్ గడ్డర్ విరిగిపోయే అవకాశమే లేదని.. కానీ ఆ స్థాయిలో భారం పడకున్నా 16వ గేటు యోక్ గడ్డర్ విరిగిపోవడం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరమ్మతుల కోసమే స్టాప్ లాగ్ గేటు
పులిచింతల ప్రాజెక్టు స్పిల్ వే పొడవు 560.25 మీటర్లు, ఎడమ వైపు నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్(ఎన్‌వోఎఫ్) పొడవు 232.75, కుడి వైపు ఎన్‌వోఎఫ్ పొడవు 141 మీటర్లు. మట్టి కట్ట పొడవు 355 మీటర్లు. ప్రాజెక్టు టాప్ బీమ్ లెవల్(టీబీఎం) 58.24 మీటర్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 53.54 మీటర్లు. కనీస నీటిమట్టం 42.67 మీటర్లు. స్పిల్ వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 24 గేట్లను బిగించారు. అంటే, స్పిల్ వేకు 32.34 మీటర్ల నుంచి 50.84 మీటర్ల మధ్య వీటిని బిగించారు. వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేస్తే 20.37 లక్షల క్యూసెక్కుల(176 టీఎంసీల)ను ఒకేసారి దిగువకు వదిలేయవచ్చు. ఈ గేట్లలో ఎప్పుడైనా సమస్య ఉత్పన్నమైతే, వాటికి మరమ్మతులు చేయడానికి రెండు స్టాప్ లాగ్ గేట్లను ఏర్పాటు చేశారు. సమస్య ఉన్న గేటుకు ముందు భాగంలో స్టాప్ లాగ్ గేటును దించి.. గేటుకు మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత స్టాప్ లాగ్ గేటును పైకి ఎత్తేస్తారు. ఆ తర్వాత 11 ఎలిమిమెంట్లను విడదీస్తారు.
Comments
Please login to add a commentAdd a comment