గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం చింతమోటులో దెబ్బతిన్న మిర్చి తోటను పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/ భట్టిప్రోలు/కొల్లూరు/అనంతపురం అర్బన్ : కుండపోత వర్షాలు, వరదలతో దారుణంగా నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసింది. వరద నష్టం పరిశీలనకు రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన సౌరవ్ రాయ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం సోమవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో అధికారులతో సమావేశమైంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వాయుగుండం, అల్పపీడనాల వల్ల వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిని రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ బృందానికి వివరించారు. ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యల వల్ల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గించ గలిగామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రైతులకు వెంటనే పెట్టుబడి రాయితీ పంపిణీ చేశామని, బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందించామని చెప్పారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి ఉదారంగా సాయం అందేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లిన వివరాలు ఇలా ఉన్నాయి.
► భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిబంధనలు సడలించి వర్షాలకు తడిసిన, రంగు మారిన ధాన్యం, వేరుశనగను రైతుల నుంచి కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి.
► వివిధ రంగాలకు రూ.6,386 కోట్ల నష్టం వాటిల్లింది. తాత్కాలిక పునరుద్ధరణ సహాయ చర్యలకు రూ.840 కోట్లు, శాశ్వత పునరుద్ధణ చర్యలకు రూ.4,439 కోట్లు అవసరం.
► 2.12 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, 24,516 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా అన్నదాతలకు రూ.1,386 కోట్ల నష్టం సంభవించింది.
► రోడ్లు, భవనాల శాఖకు రూ. 2,976 కోట్లు, జల వనరుల శాఖకు రూ.1,074 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ. 781 కోట్లు, పురపాలక శాఖకు రూ.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతరత్రా పలు శాఖలకు ఆస్తి నష్టం జరిగింది.
► 387 మండలాల పరిధిలోని 3,310 గ్రామాలపై ప్రభావం పడింది. 17.74 లక్షల మంది ప్రభావితమయ్యారు. రూ.399 కోట్లతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.
► శాఖల వారీగా జరిగిన నష్టం గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం ఛాయా చిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది.
క్షేత్ర స్థాయిలో పర్యటన
► కేంద్ర బృందం కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించింది. తొలుత కృష్ణా జిల్లా కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, చందర్లపాడు మండలాల్లో దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. జిల్లాలో రూ.664 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టరు ఏఎండీ ఇంతియాజ్ వివరించారు.
► గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని జువ్వలపాలెం, తిప్పలకట్ట, పోతార్లంక, చింతమోటు, పెదలంక, పెసర్లంక గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ.. ‘కొన్ని పంటలు చూడటానికి బాగానే ఉన్నాయి. అయితే అవి ఎందుకూ పనికి రావు. రైతులకు ఇచ్చే నష్ట పరిహారాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని కేంద్ర బృందం సభ్యుడు, కేంద్ర జలశక్తి డైరెక్టర్ పి.దేవేంద్రరావు అన్నారు. జిల్లాలో మొత్తం రూ.320 కోట్ల నష్టం వాటిల్లిందని జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు.
► అనంతపురం జిల్లాలో పరిస్థితిని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో కేంద్ర బృందం అక్కడికి వెళ్లింది. వజ్రకరూరు ప్రాంతంలో దెబ్బతిన్న వేరుశనగ పంటను, ఫొటో ఎగ్గిబిషన్‌ను పరిశీలించింది. మొత్తంగా రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment