రికార్డు సమయంలో స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు | Stop log gate was set up after gate broke in Pulichintala project Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Pulichintala Project: రికార్డు సమయంలో స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు

Published Sun, Aug 8 2021 2:02 AM | Last Updated on Sun, Aug 8 2021 9:23 AM

Stop log gate was set up after gate broke in Pulichintala project Andhra Pradesh - Sakshi

పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు వద్ద లాగ్‌ గేట్‌ను ఏర్పాటు చేయడంతో ఆగిన ప్రవాహం

సాక్షి, అమరావతి, సాక్షి, అమరావతి బ్యూరో, అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిపోయిన రెండు రోజుల్లోనే దాని స్థానంలో శనివారం స్టాప్‌ లాగ్‌ గేటును ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమం చేసి, రికార్డు సృష్టించారు. ప్రాజెక్టు గేటు విరిగిపోయాక.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువ సమయంలో స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు చేసి, నీటి నిల్వను పునరుద్ధరించిన దాఖలాలు లేవని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. సాగర్‌ నుంచి దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో శనివారం రాత్రి 11 గంటలకు పులిచింతల ప్రాజెక్టులోకి 37,332 క్యూసెక్కులు చేరుతున్నాయి. విద్యుదుత్పత్తి ద్వారా 12,968 క్యూసెక్కులను తెలంగాణ ప్రభుత్వం దిగువకు విడుదల చేస్తోంది.

స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటుతో ప్రాజెక్టులో నీటి మట్టం 129.19 అడుగుల్లో 6.4 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు గేట్లు అన్నీ మూసి వేశారు. కాగా, గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 16వ గేటును ఎత్తే సమయంలో ట్రూనియన్‌ బీమ్‌ యాంకర్‌ యోక్‌ గడ్డర్‌లో సమస్య తలెత్తడంతో గేటు ఊడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, అధికారులను సీఎం ఆదేశించడంతో యుద్ధ ప్రాతిపదికన స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు పనులకు ఉపక్రమించారు.  
 
నిర్విరామ శ్రమతో ఫలితం 
17 గేట్లు ఎత్తేసి.. దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో శనివారం తెల్లవారుజాముకు ప్రాజెక్టులో నీటి నిల్వను క్రస్ట్‌ లెవల్‌కు అంటే 3.66 టీఎంసీలకు తగ్గించారు. ఎగువ నుంచి 46 వేల క్యూసెక్కుల వరద వస్తున్నప్పటికీ లెక్క చేయకుండా శనివారం ఉదయం నుంచే ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో బీకెమ్‌ ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. స్టాప్‌ లాగ్స్‌ను క్రేన్ల ద్వారా సక్రమంగా బిగించేందుకు వైజాగ్‌కు చెందిన సీలైన్‌ ఆఫ్‌షోర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 10 మంది సభ్యుల బృందం నిర్విరామంగా శ్రమించింది.
స్టాప్‌ లాగ్‌ను అమర్చుతున్న దృశ్యం 

విరిగిపోయిన 16వ గేటు వెనుక భాగంలో రెండు పియర్‌లకు ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ ద్వారా స్పిల్‌ వే బ్రిడ్జిపై నుంచి గ్యాంట్రీ క్రేన్‌ ద్వారా తొలుత 17 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల ఎత్తు, 28 టన్నుల బరువు ఉన్న ఎలిమెంటు (ఇనుప దిమ్మె)ను దించారు. దానిపై అంతే బరువున్న రెండో ఎలిమెంటును దించారు. అప్పటి నుంచే నీటి నిల్వ మొదలైంది. ఇలా ఎలిమెంట్‌లను ఒకదానిపై మరొకటి ఏర్పాటు చేస్తూ నీరు కిందకు రాకుండా రబ్బర్‌ సీళ్లు వేశారు. అర్ధరాత్రి చివరగా 23 టన్నుల బరువున్న 11వ ఎలిమెంటును దించారు. దాంతో 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఇది మిగతా గేట్ల తరహాలో ఎత్తడానికి, దించడానికి వీలుండదు. నీటి నిల్వకు దోహదం చేస్తుంది. 
 
పూర్తి గేటు ఏర్పాటుకు కసరత్తు  
విరిగిపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయి, స్పిల్‌ వే నుంచి దాదాపు 750 మీటర్ల దూరంలో పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. గడ్డర్స్‌ ఆచూకీ లభించలేదు. ప్రవాహం తగ్గాక.. 250 టన్నుల బరువున్న గేటును వెలికితీసి, పరిశీలిస్తామని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. పటిష్టంగా ఉంటే అదే గేటును బిగిస్తామని.. లేదంటే దాని స్థానంలో కొత్తగా గేటును తయారు చేస్తామని చెప్పారు. గేటు బిగించడానికి రెండు పియర్లకు ట్రూనియన్‌ బీమ్‌లు దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని తొలగించి కొత్తగా నిర్మిస్తామన్నారు.

ట్రూనియన్‌ బీమ్‌ యాంకర్‌లో గేట్ల ఆర్మ్‌ గడ్డర్లను అనుసంధానం చేయడానికి సెల్ఫ్‌ లూబ్రికెంట్‌ బుష్‌లను గతంలో జపాన్‌ నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు అవి బాగుంటే వాటినే ఉపయోగిస్తామని.. లేదంటే జపాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి గేటును బిగించేందుకు రెండు నెలల సమయం పడుతుందన్నారు. స్టాప్‌ లాగ్‌ గేటు ద్వారా పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేస్తామని, కృష్ణా డెల్టా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  
 
అన్ని ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తాం 
పులిచింతల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తామని జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ప్రాజెక్ట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యయన కమిటీ వేయాలని ఆదేశించారని చెప్పారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా నివేదిక ఇస్తుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు పనులను ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను శనివారం సందర్శించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement