శ్రీశైలం డ్యామ్‌ను పరిశీలిస్తున్న నిపుణుల బృందం
సాక్షి, అమరావతి/శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్సార్పీ) సోమవారం తనిఖీ చేసింది. ఆ తర్వాత తనిఖీలో వెల్లడైన అంశాల ఆధారంగా కర్నూలు ప్రాజెక్టŠస్ సీఈ మురళీనాథ్‌రెడ్డి, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) సీఈ కె.శ్రీనివాస్ తదితరులతో ప్రాజెక్టు వద్దే సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రాజెక్టు భద్రతకు ఎటువంటి ఢోకా లేదని చెప్పింది.
మంగళవారం రాష్ట్ర జలవరులశాఖ అధికారులతో మరోసారి సమావేశమై.. ప్రాజెక్టు భద్రతకు తక్షణం, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రపంచబ్యాంకు రుణంతో కేంద్రం చేపట్టిన డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (డ్రిప్) కింద శ్రీశైలం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపడతారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు ప్రపంచబ్యాంకు రుణంతో కేంద్రం డ్రిప్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే తొలిదశ పూర్తవగా రెండోదశను ప్రారంభించింది. ఈ రెండోదశలో శ్రీశైలం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు
కృష్ణానదికి 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్ కాస్త దెబ్బతింది. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ ప్రాజెక్టు స్పిల్ వే గ్యాలరీలో లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రౌటింగ్ (బోరు వేసి.. అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని భూగర్భంలోకి పంపి.. చీలికలను కాంక్రీట్‌తో నింపడం ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేయడం) చేయడం, ఫ్లంజ్ పూల్‌కు, గేట్లకు మరమ్మతులు చేయడం, ఆఫ్రాన్‌ను పటిష్టం చేయడం, క్యాంపు కాలనీ నిర్మించడం వంటి పనులు చేపట్టడానికి రూ.780 కోట్లతో సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపారు.
ఈ ప్రతిపాదనల ఆధారంగా శ్రీశైలం ప్రాజెక్టును తనిఖీ చేసి.. భద్రతకు చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో రిటైర్డ్ సీఈ ఈశ్వర్ ఎస్.చౌదరి, రిటైర్డ్ ఈఎన్‌సీలు బి.ఎస్.ఎన్.రెడ్డి, పి.రామరాజు, రిటైర్డ్ సీఈలు రౌతు సత్యనారాయణ, కె.సత్యనారాయణ, జీఎస్‌ఐ రిటైర్డ్ డీజీ ఎం.రాజు, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అండ్ ల్యాండ్ స్కేప్ ఎక్స్‌పర్ట్ ఎండీ యాసిన్ సభ్యులుగా డీఎస్సార్పీని కేంద్రం నియమించింది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, గేట్లు, గ్యాలరీ, ఫ్లంజ్ పూల్, ఆఫ్రాన్‌లను పరిశీలించిన డీఎస్సార్‌పీ.. జలవనరులశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలపై సమీక్ష సమావేశం నిర్వహించింది. మంగళవారం మరోసారి అధికారులతో సమావేశం కానుంది. ఈ బృందం ప్రాజెక్టు భద్రతకు చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇస్తుందని సీఈ మురళీనాథ్‌రెడ్డి మీడియాతో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment