రూ.6,182 కోట్లతో హంద్రీ–నీవా కాలువ వెడల్పు | Handri-Neeva canal width at a cost of Rs 6182 crore | Sakshi
Sakshi News home page

రూ.6,182 కోట్లతో హంద్రీ–నీవా కాలువ వెడల్పు

Published Tue, Jun 8 2021 3:45 AM | Last Updated on Tue, Jun 8 2021 3:45 AM

Handri-Neeva canal width at a cost of Rs 6182 crore - Sakshi

సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం మొదటిదశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు చేసే పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.6,182.20 కోట్లతో బ్రిడ్జిలు, అండర్‌ టన్నెళ్లు వంటి నిర్మాణాలతో కాలువను, 8 పంప్‌హౌస్‌లను విస్తరించే పనులు చేపట్టడానికి పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పనులు పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి 73–75 రోజుల్లోనే హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను తరలించడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల కృష్ణా వరద నీటిని తరలించి.. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.

కృష్ణానదికి వరద వచ్చే 120 రోజుల్లో.. రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున.. 40 టీఎంసీలు తరలించేలా పనులు చేపట్టారు. పరీవాహక ప్రాంతంలో అనావృష్టి పరిస్థితుల ప్రభావం వల్ల శ్రీశైలానికి కృష్ణానది ద్వారా వరద వచ్చే రోజులు బాగా తగ్గాయి. అతివృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక్కసారిగా గరిష్ఠంగా వరద వస్తోంది. కానీ.. ఆ స్థాయిలో వరదను ఒడిసి పట్టే పరిస్థితులు లేకపోవడంతో ఆ జలాలు కడలిలో కలుస్తున్నాయి. సముద్రంలో కలుస్తున్న వరద నీటిని గరిష్ఠ స్థాయిలో ఒడిసి పట్టి.. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా హంద్రీ–నీవా తొలిదశ ప్రధాన కాలువ, ఎత్తిపోతల సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని గత నెల 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ జలవనరులశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం జలాశయం నీటిని మల్యాల పంప్‌హౌస్‌ నుంచి 8 దశల్లో నీటిని హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ కాలువలో 216.3 కి.మీ. పొడవున తరలించి జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరుస్తారు. మల్యాల పంప్‌హౌస్‌కు నీటిని తెచ్చేందుకు జలాశయంలో 4.806 కిలోమీటర్ల పొడవున అప్రోచ్‌ చానల్‌ తవ్వారు. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలంటే అప్రోచ్‌ చానల్‌తోపాటు ప్రధాన కాలువను విస్తరించాలి. అంటే.. మొత్తం 221.106 కిలోమీటర్ల పొడవున ప్రధాన కాలువను విస్తరించే పనులను ప్రభుత్వం చేపడుతోంది. ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న ఎత్తిపోతలను ఆ మేరకు విస్తరించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement