handri neeva sujala sravanthi project
-
జూన్‌లో కుప్పానికి హంద్రీ-నీవా జలాలు
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం నియోజకవర్గానికి వచ్చే ఏడాది జూన్ నాటికి నీళ్లందించేలా పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించి గడువులోగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2 పూర్తి స్థాయి ఫలాలను ముందస్తుగా అందించడానికి గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు నీటి ఎత్తిపోత పనుల టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఈ ఎత్తిపోతలకు డిసెంబర్లో శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా తారకరామ తీర్థ సాగరంలో మిగిలిన పనులకు టెండర్లు పిలిచామని, నవంబర్‌లో పనులు ప్రారంభిస్తామని వివరించారు. మహేంద్ర తనయ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టి రూ.852 కోట్లతో అంచనాలను సవరించామని, మిగిలిన పనుల పూర్తికి చర్యలు చేపట్టామని తెలిపారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్లో 3.4 కి.మీ. మేర పనులు మిగిలాయని అధికారులు పేర్కొనగా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టడానికి అవసరమైన భూ సేకరణకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతగా పనులు చేపట్టాలని సూచించారు. కొత్తవి పూర్తి చేయటంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించి క్రమం తప్పకుండా తనిఖీలతో అవసరమైన పనులు చేపట్టాలని నిర్దేశించారు. అత్యంత ప్రాధాన్యతగా పోలవరం.. పోలవరంను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తూ పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతం(అగాధాలు), డయాఫ్రమ్‌వాల్ పటిష్టతను తేల్చడం, ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టే ప్రణాళికపై అధికారులతో చర్చించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా గోదావరిలో 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా తొలుత కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు పరీక్షలు, వాటిలో వెల్లడైన అంశాల ఆధారంగా సీడబ్ల్యూసీ డిజైన్లు ఖరారు చేస్తేగానీ చేపట్టమలేమన్నారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటానికి, డయాఫ్రం వాల్ పటిష్టతపై నిర్ధారణల కోసం సీడబ్ల్యూసీ సూచించిన మేరకు పరీక్షలను నవంబర్ మధ్యలో ప్రారంభిస్తామన్నారు. వాటి తుది ఫలితాలు డిసెంబరు ఆఖరుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ ఫలితాల ఆధారంగా కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత విధానం, డిజైన్లను సీడబ్ల్యూసీ ఖరారు చేస్తుందన్నారు. పరీక్షల్లో వెల్లడయ్యే ఫలితాల ఆధారంగా డయాఫ్రమ్ వాల్‌పై సీడబ్ల్యూసీ ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ పరీక్షలు చేస్తున్న సమయంలోనే దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తి కాగానే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసి సీడబ్ల్యూసీ ఖరారు చేసిన డిజైన్ల మేరకు ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఆలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. గోదావరికి రెండో అతి పెద్ద వరద ప్రవాహం గోదావరిలో వరద ప్రవాహం నిరంతరం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 1990 తర్వాత అత్యధికంగా ఈ ఏడాది గోదావరికి అతి పెద్ద వరద ప్రవాహం వచ్చిందన్నారు. ఈ ఏడాది జులై 18న అత్యధికంగా 25.92 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 14న కూడా 15.04 లక్షల క్యూసెక్కులు, ఆగస్టు 19న 15.92 లక్షల క్యూసెక్కులు, సెప్టెంబరు 16న 13.78 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. ఇప్పటికీ రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగుతోందన్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి 1990లో 355 రోజుల పాటు ప్రవాహం రాగా 7,092 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయన్నారు. 1994లో ధవళేశ్వరం బ్యారేజీకి 188 రోజులు వరద ప్రవాహం రాగా 5,959 టీఎంసీలు కడలిలో కలిశాయి. 2013లో 213 రోజులు వరద రాగా 5,921 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ ఏడాది ధవళేశ్వరం బ్యారేజీకి 136 రోజుల పాటు వరద ప్రవాహంతో 6,010 టీఎంసీలు సముద్రంలో కలిశాయన్నారు. సమర్థంగా నియంత్రిస్తూ ఆయకట్టుకు నీళ్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,164.10 టీఎంసీలు కృష్ణా జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 119.2 టీఎంసీల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట నుంచి 34.8 టీఎంసీల నాగావళి జలాలు, నెల్లూరు బ్యారేజ్ నుంచి 92.41 టీఎంసీల పెన్నా జలాలు ఇప్పటిదాకా కడలిలో కలిశాయని అధికారులు వెల్లడించారు. నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని, ఇంకా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్లలో 90 శాతాన్ని నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తున్నామన్నారు. వరదను సమర్థంగా నియంత్రిస్తూ ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు ప్రాజెక్టుల ఫలాలు అందించాలని సీఎం జగన్ సూచించారు. ఎత్తిపోతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు ఏళ్ల తరబడి నిర్వహణ సరిగ్గా లేక మూలనపడుతున్నాయని అధికారులు పేర్కొనగా నిర్వహణపై ఎస్వోపీ (నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక)లు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో నిర్వహించడంపై కసరత్తు చేయాలని సూచించారు. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఎత్తిపోతల నిర్వహణకు అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి మెరుగైన పద్ధతి రూపొందించాలన్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున రైతుల పర్యవేక్షణలో ఎత్తిపోతలను సమర్థంగా నిర్వహించేలా అవగాహన కల్పించి శిక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, వివిధ ప్రాజెక్టుల సీఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు. -
‘హంద్రీ నీవా’ను అడ్డుకోండి.. ! కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్–1 జల కేటాయింపులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ఎత్తిపోతల పథకంతో పాటు దాని విస్తరణ పనులను తక్షణమే అడ్డుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం మరోసారి కోరింది. కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన ప్రస్తుత హంద్రీ నీవా ఎత్తిపోతల పథకాలకే కేఆర్ఎంబీ అనుమతి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేదని తెలిపింది. అలాంటిది మరో కొత్త పథకాన్ని చేపట్టడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ఇటీవల కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. అభ్యంతరాలు పట్టించుకోకుండా.. హంద్రీ నీవా విస్తరణలో భాగంగా మల్యాల నుంచి (–)4.8 – 216.3 కి.మీల(1–8 పంపింగ్ స్టేషన్లు) పరిధిలోని ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు రూ.4,652 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిందని లేఖలో ఫిర్యాదు చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి నీళ్లను తీసుకోకుండా నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరుతున్నా.. ఇలా టెండర్లను ఆహ్వానించిందని పేర్కొన్నారు. శ్రీశైలంనుంచి ఏపీ ప్రభుత్వం విని యోగించుకోవాల్సిన 34 టీఎంసీల వరద జలాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ప్రణాళికా సంఘం అనుమతుల్లో హంద్రీ నీవా పథకం ప్రస్తావనే లేదని గుర్తు చేశారు. కేంద్ర జలసంఘం/కేంద్ర జల వనరుల శాఖ అనుమతుల ప్రకారం వరద ప్రవాహ సమయాల్లోనే శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 34 టీఎంసీలను తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే కృష్ణా పరీవాహక ప్రాంతం వెలుపలి ప్రాంతాలకు ఏపీ ప్రయోజనం కలిగిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపులకు విరుద్ధంగా తుంగభద్ర ఉప పరీవాహక ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు నీటిని తరలిస్తోందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకే భవిష్యత్తు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణా ట్రిబ్యునల్–1 స్పష్టం చేసిందని తెలిపారు. అందువల్ల తక్షణమే హంద్రీ నీవా విస్తరణ పనులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
రూ.6,182 కోట్లతో హంద్రీ–నీవా కాలువ వెడల్పు
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం మొదటిదశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు చేసే పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.6,182.20 కోట్లతో బ్రిడ్జిలు, అండర్ టన్నెళ్లు వంటి నిర్మాణాలతో కాలువను, 8 పంప్‌హౌస్‌లను విస్తరించే పనులు చేపట్టడానికి పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పనులు పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి 73–75 రోజుల్లోనే హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలను తరలించడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల కృష్ణా వరద నీటిని తరలించి.. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. కృష్ణానదికి వరద వచ్చే 120 రోజుల్లో.. రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున.. 40 టీఎంసీలు తరలించేలా పనులు చేపట్టారు. పరీవాహక ప్రాంతంలో అనావృష్టి పరిస్థితుల ప్రభావం వల్ల శ్రీశైలానికి కృష్ణానది ద్వారా వరద వచ్చే రోజులు బాగా తగ్గాయి. అతివృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక్కసారిగా గరిష్ఠంగా వరద వస్తోంది. కానీ.. ఆ స్థాయిలో వరదను ఒడిసి పట్టే పరిస్థితులు లేకపోవడంతో ఆ జలాలు కడలిలో కలుస్తున్నాయి. సముద్రంలో కలుస్తున్న వరద నీటిని గరిష్ఠ స్థాయిలో ఒడిసి పట్టి.. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా హంద్రీ–నీవా తొలిదశ ప్రధాన కాలువ, ఎత్తిపోతల సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని గత నెల 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ జలవనరులశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం జలాశయం నీటిని మల్యాల పంప్‌హౌస్ నుంచి 8 దశల్లో నీటిని హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ కాలువలో 216.3 కి.మీ. పొడవున తరలించి జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరుస్తారు. మల్యాల పంప్‌హౌస్‌కు నీటిని తెచ్చేందుకు జలాశయంలో 4.806 కిలోమీటర్ల పొడవున అప్రోచ్ చానల్ తవ్వారు. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలంటే అప్రోచ్ చానల్‌తోపాటు ప్రధాన కాలువను విస్తరించాలి. అంటే.. మొత్తం 221.106 కిలోమీటర్ల పొడవున ప్రధాన కాలువను విస్తరించే పనులను ప్రభుత్వం చేపడుతోంది. ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న ఎత్తిపోతలను ఆ మేరకు విస్తరించనుంది. -
హంద్రీ–నీవా సామర్థ్యం పెంపునకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కృష్ణా వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి.. రాయలసీమను సుభిక్షం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హంద్రీ–నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు అభివృద్ధి చేసే పనులను చేపట్టడానికి మంగళవారం మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.6,182 కోట్ల వ్యయంతో పనులను చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల కృష్ణా వరద నీటిని తరలించి.. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. కృష్ణా నదికి వరద వచ్చే 120 రోజుల్లో.. రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 40 టీఎంసీలు తరలించేలా పనులు చేపట్టారు. పరీవాహక ప్రాంతంలో అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి కృష్ణా నది ద్వారా వరద వచ్చే రోజులు బాగా తగ్గాయి. అతివృష్టి ఏర్పడినప్పుడు ఒకేసారి గరిష్టంగా వరద వస్తోంది. కానీ.. ఆ స్థాయిలో వరదను ఒడిసి పట్టే పరిస్థితులు లేకపోవడంతో ఆ జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి. వరద నీటిని గరిçష్ట స్థాయిలో ఒడిసి పట్టడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ, ఎత్తిపోతల సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించారు. 221.106 కి.మీ. పొడవున కాలువ విస్తరణ శ్రీశైలం జలాశయంలో మల్యాల పంప్ హౌస్ ద్వారా హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 8 దశల్లో నీటిని ఎత్తిపోస్తారు. 216.3 కి.మీ. పొడవున్న ప్రధాన కాలువ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. మల్యాల పంప్‌హౌస్‌కు నీటిని తెచ్చేందుకు జలాశయంలో 4.806 కి.మీ. పొడవున అప్రోచ్ చానల్ తవ్వారు. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలంటే అప్రోచ్ చానల్‌తోపాటు ప్రధాన కాలువను విస్తరించాలి. అంటే.. మొత్తం 221.106 కి.మీ. పొడవున ప్రధాన కాలువను విస్తరించే పనులను ప్రభుత్వం చేపట్టనుంది. ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న ఎత్తిపోతలను ఆ మేరకు విస్తరించనుంది. 78 నుంచి 80 రోజుల్లోనే 40 టీఎంసీలు..: ప్రస్తుత డిజైన్ మేరకు హంద్రీ–నీవా నుంచి 40 టీఎంసీలను తరలించడానికి 120 రోజులు సమయం పడుతోంది. కృష్ణా నదికి అన్ని రోజుల్లోను వరద ప్రవాహం ఉండటం లేదు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 830 అడుగుల మేర నీటి మట్టం ఉంటేనే మల్యాల ఎత్తిపోతల ద్వారా తరలించే అవకాశం ఉంది. కానీ.. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి రోజుకు 4 టీఎంసీల చొప్పున దిగువకు తరలించడం వల్ల శ్రీశైలంలో నీటిమట్టం ఆ స్థాయిలో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కృష్ణా వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టేందుకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు అభివృద్ధి చేసే పనులను చేపట్టింది. దీనివల్ల 78 నుంచి 80 రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించడానికి అవకాశం ఉంటుంది. -
రాయలసీమలో నవశకం
సాక్షి, కర్నూలు : రాయలసీమ.. ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయాలు, కరువుతో అల్లాడే జిల్లాలే. అయితే ఇదంతా గతం... 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ నుంచి సీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతితో ఆగిపోయిన రాయలసీమ అభివృద్ధిని ముఖ్యమంత్రి జెట్ స్పీడుతో పరుగులు పెట్టించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్ సంక్పలంతో ప్రస్తుతం అంతరాష్ట్ర వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిచే దశకు చకచకా చేరుకుంది. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకమే పెద్దది.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు అతిపెద్దదిగా భావించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం. దీని మొత్తం పంపింగ్ సామర్థ్యం ఏడాదికి 40 టిఎంసీలు మాత్రమే. అలాగే పట్టిసీమ, ముచ్చుమర్రి, కొండవీటి వాగు, పురుషోత్తపట్నంలాంటి ఎత్తిపోతల పథకాలు గతంలోనే పూర్తయ్యాయి. వీటితో ఏమాత్రం పోలికలేని విధంగా సీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్.. కర్నూలు జిల్లా సంగమేశ్వర వద్ద నిర్మిస్తున్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఆయనకు వచ్చిందే తడవుగా సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించి పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాయలసీమలో అత్యధిక ప్రాంతాలకు తాగు, సాగునీరు అందనుంది. శతాబ్దాలుగా కరువు ప్రాంతంగా పిలువబడుతున్న ఈ ప్రాంతం ఇక కృష్ణమ్మ పరవళ్లతో పచ్చదనంతో కళకళలాడనుంది. వృథా నీటిని ఒడిసి పట్టనున్న ఎత్తిపోతల పథకం.. ఎన్నో దశాబ్దాలుగా సీమ తాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించాలని డిమాండ్ ఉన్నప్పటికి కార్యరూపం దాల్చలేదు. గత 16ఏళ్ళలో పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే 2018-19, 2019-20 సంవత్సరాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని సంవత్సరాల్లో లభించాల్సిన నీటికన్నా తక్కువ నీరు అందింది. ఆఖరికి కృష్ణాకు భారీ వరదలు వచ్చి శ్రీశైలం పొంగి ప్రవహించి జలాలు సముద్రంపాలు అయ్యాయే తప్ప సీమ వాసులకు మాత్రం ప్రయోజనం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని మళ్లించుకోవడమే ఏకైక శరణ్యమని ముఖ్యమంత్రి తలంచారు. దీంతో ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనంచేసి ఆచరణలో సాధ్యమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారీ పంపింగ్ కేంద్రం.. రాయలసీమ ఎత్తిపోతల పథకం(ఆర్.ఎల్.సీ-రాయలసీమ లిప్ట్ స్కీమ్) ద్వారా రోజు మూడు టీఎంసీల(34722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి కృష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. జలాశయంలో 800నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు నీటిని మళ్లించేలా పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణా నదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8టీఎంసీల వరకు కూడా పంప్ చేసేలా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది వైఎస్ జగన్ సర్కార్ ఉద్దేశం. భారీ పైపులైన్లను ఏర్పాటుతో నీటి తరలింపు.. ఎత్తిపోతల ద్వారా పంప్ చేసిన నీటిని 125మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఆ తరువాత డెలివరీ సిస్ర్టన్ నుంచి నీరు విడుదలై 22 కిలోమీటర్ల మేర ప్రవహించి పోతిరెడ్డిపాడుకు సమీపంలో 4-5కిలోమీటర్ల మద్య ఎస్ఆర్ఎంసీలో కలుస్తుంది. అక్కడి నుంచి నీరు తెలుగు గంగ, ఎస్.ఆర్.బీ.సీ, కేసీ కాలువలకు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తోపాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యుమెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసేలా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి. 397మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరం.. రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తరలించేందుకు మొత్తం 397మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరమవుతుంది. ఇంత పెద్దస్థాయిలో విద్యుత్ ను వినియోగించి ఒక కేంద్రం నుంచి నీటిని పంపింగ్ చేయడం రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఏపీలో ఇదే అరుదైనది, పెద్దది అవుతుంది. ఈ పంప్ హౌస్ పనిచేయాలంటే కనీస నీటిమట్టం 243 అడుగులు ఉండాలి. డెలివరీ లెవల్ 273 అడుగుల వద్ద ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముఖ్యంగా కొత్తకాలువ తవ్వడానికి 12వేల ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమ రూపురేఖలు మార్చేలా అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. -
ఎట్టకేలకు కదలిక
* హంద్రీ-నీవా పనులపై సీఎంవో ఆరా * తొలి దశ పనుల పూర్తికి ఎంత ఖర్చవుతుంది? * ఎన్ని రోజుల్లో పనులు పూర్తవుతాయి? * కలెక్టర్‌ను వివరాలడిగిన సీఎం కార్యాలయం సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కరువు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులు నిలదీసిన నేపథ్యంలో ప్రభుత్వం హంద్రీ-నీవా పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాలను ప్రజలు అధికార పార్టీకి కట్టబెట్టిన నేపథ్యంలో, అత్యంత కరువు ప్రాంతమైన ఈ జిల్లా సాగు, తాగు నీటి అవసరాలపై శ్రద్ధ చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయన్న అంతర్మథనం మొదలైనట్లు జిల్లాకు చెందిన అధికార పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరిపై ప్రజల్లో అపనమ్మకం కలిగించడంలో సఫలీకృతులయ్యారని, కొద్దిమేరకైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే గతం పుసరావృతమై రైతులు టీడీపీకిదూరమయ్యే ప్రమాదముందన్న విశ్లేషణలు అధికార పార్టీ వర్గాల్లో మొదలైనట్లు సమాచారం. దివంగత సీఎం వైఎస్ హయాంలోనే ‘హంద్రీ-నీవా’ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు రూ.4,200 కోట్లు ఖర్చు చేశారు. అక్కడక్కడా ప్యాచ్ వర్క్‌లు, నిర్మాణాలు పూర్తయితే జిల్లాలో పలు చెరువులు నింపి.. భూగర్భజల మట్టాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ఇందుకు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్లో మాత్రం కేవలం రూ.100 కోట్లు కేటాయించారు. ఇంకో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయ్యి.. వచ్చే ఖరీఫ్ నాటికి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాలు సాగులోకి వస్తుంది. అప్పుడు ఆ మైలేజీని రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రికి కొందరు సలహా ఇచ్చినట్లు సమాచారం. విజయవాడలో రాజధాని ఖరారు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాలకన్నా ఎక్కువ అసౌకర్యానికి గురవుతోంది అనంతపురమే. ప్రస్తుతం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కైతే జిల్లా వాసులు నాలుగైదు గంటల్లోనే చేరుకోవచ్చు. అదే విజయవాడ వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేవు. వర్షపాత, సాగునీటి సౌకర్యాల ప్రాతిపదికన చూస్తే అనంతపురానికి, విజయవాడకు మధ్య ‘నక్కకు నాగలోకానికి’ ఉన్నంత తేడా కన్పిస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో అధికార పార్టీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ‘అనంత’ విషయంలో ఎంతో కొంత శ్రద్ధ తీసుకోకపోతే.. ఆ ప్రభావం మొత్తం రాయలసీమ వ్యాప్తంగా కన్పించే అవకాశముంది. సీమ ప్రజల్లో రాజుకుంటున్న అసంతృప్తి పెరిగి పెద్ద కాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘హంద్రీ-నీవా’ పనుల పురోగతి, పనుల పూర్తికి ఇంకా ఎంత మొత్తం అవసరం? ఎంతకాలం పడుతుంది?.. తదితర వివరాలపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ ‘హంద్రీ-నీవా’ ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి సీఎంవో కోరిన మేరకు సవివరమైన నివేదిక తయారు చేస్తున్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.